- ఉద్యోగుల జేఏసీ చైర్మన్ మారం జగదీశ్వర్ వార్నింగ్
- తమ డిమాండ్లు పరిష్కరించాలని డిమాండ్
హైదరాబాద్/ముషీరాబాద్, వెలుగు: ప్రభుత్వ ఉద్యోగులతో పెట్టుకున్న ఏ ప్రభుత్వం కూడా మనుగడ సాగించలేదని ఉద్యోగుల జేఏసీ చైర్మన్ మారం జగదీశ్వర్ హెచ్చరించారు. సమస్యల పరిష్కారం కోసం కేబినెట్ సబ్‌కమిటీ, ఐఏఎస్ అధికారులు, మంత్రులను పలుమార్లు కలిసినా ప్రయోజనం లేకుండా పోయిందని, సీఎం ఆదేశాలను అధికారులు అమలు చేయడం లేదని ఆరోపించారు. ప్రభుత్వంపై ఉద్యోగుల్లో తీవ్ర వ్యతిరేకత ఉందన్నారు.
గురువారం ఇందిరాపార్క్ ధర్నాచౌక్‌లో ఉద్యోగుల జేఏసీ ఆధ్వర్యంలో భారీ ధర్నా నిర్వహించారు. అన్ని జిల్లాల నుంచి వేలాది మంది ఉద్యోగులు తరలివచ్చారు. మహాధర్నాకు మద్దతుగా జిల్లా కేంద్రాల్లోనూ ఉద్యోగ సంఘాల నేతలు ఆందోళనలు చేపట్టారు. ఈ సందర్భంగా జగదీశ్వర్మాట్లాడుతూ ఉద్యోగులు ఎదుర్కొంటున్న పీఆర్సీ, పెండింగ్ డీఏలు, సీపీఎస్ రద్దు, ఈహెచ్‌ఎస్ అమలు, పెండింగ్ బిల్లుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు.
సమస్యలు పరిష్కరించకపోతే ప్రభుత్వం తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. జేఏసీ సెక్రటరీ జనరల్ ఏలూరి శ్రీనివాసరావు మాట్లాడుతూ పీఆర్సీ అమలు, డీఏ బకాయిల విడుదల కోసం ప్రభుత్వానికి ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని కోరారు. లేదంటే పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో నాయకులు ముజీబ్, శ్యామ్, కృష్ణయాదవ్, శ్రీకాంత్, వెంకటేశ్వర్లు, సత్యనారాయణగౌడ్, మధుసూదన్‌రెడ్డి, వంగ రవీందర్‌రెడ్డి పాల్గొన్నారు.
