- అవినీతి పార్టీని మళ్లీ గెలిపిద్దామా..?
- బ్రాహ్మణ పరిషత్ పదవులు ఆంధ్రావారికా?
- సీఎం తీరును తప్పు పట్టిన టీఆర్ఎస్ చీఫ్
- బీఆర్‌ఎస్‌ను చేజిక్కించుకొనేందుకు
- హరీశ్ కుట్ర చేస్తున్నారని ఆరోపణ
హైదరాబాద్, వెలుగు: బీఆర్‌ఎస్ ప్రభుత్వం వ్యవస్థీకృత అవినీతికి పాల్పడిందని తెలంగాణ రక్షణ సేన (టీఆర్‌ఎస్) చీఫ్ కవిత ఆరోపించారు. పాలు ఒకరికి, రియల్ ఎస్టేట్ ఒకరికి, ఇసుక మరొకరికి అన్నట్లు పంచుకొని అవినీతిని సిస్టమ్‌లోకి జొప్పించారన్నారు. ఇప్పుడేమో కాంగ్రెస్ ఫెయిలైందంటూ చెబుతున్న బీఆర్‌ఎస్ పార్టీ.. మళ్లీ తాము అధికారంలోకి వస్తామని చెబుతున్నారన్నారు. విచ్చలవిడిగా అవినీతికి పాల్పడిన పార్టీని మళ్లీ అధికారంలోకి తీసుకొద్దామా అని ప్రశ్నించారు. గురువారం హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని టీఆర్‌ఎస్ పార్టీ ఆఫీసులో మీడియాతో ఆమె మాట్లాడారు. జవాబుదారీతనంతో, అవినీతి లేకుండా, కొత్త వాళ్లకు అవకాశం కల్పించేందుకు పార్టీ పెట్టానని, తన లాంటి వాళ్లకు ఒక అవకాశం ఇవ్వాలని కోరారు. తెలంగాణ బ్రాహ్మణ పరిషత్ చైర్మన్ గా, వైస్ చైర్మన్ గా ఆంధ్రాకు చెందిన వ్యక్తులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నియమించారని మండిపడ్డారు. తెలంగాణలో వేదం చదివిన, ఘనాపాఠీలైన బ్రాహ్మణులున్నప్పటికీ.. ఆంధ్రా ప్రాంతానికి చెందిన వారికి పదవులు కట్టబెట్టడం తగదని అన్నారు. అందుకే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని “అనుముల రేవంత్ రెడ్డి”అని కాకుండా “ఆంధ్ర రేవంత్ రెడ్డి”అని పిలవాల్సిన పరిస్థితి వచ్చిందని ఫైర్ అయ్యారు.
బీఆర్ఎస్ ను చేజిక్కించుకునేందుకు హరీశ్ కుట్రలు
బీఆర్‌ఎస్ పార్టీని చేజిక్కించుకునేందుకు హరీశ్ రావు కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. ఈ మధ్యనే మెదక్ ఎమ్మెల్యేలతో హరీశ్ రావు మీటింగ్ పెట్టారని ఆరోపించారు. ‘‘కేసీఆర్ ఎన్టీఆర్‌లా పెద్ద మనిషి. కానీ ఆయన కొడుకుకు వారసత్వం ఇవ్వడం సరికాదంటూ ఎమ్మెల్యేలతో హరీశ్ అన్నారు. ఆ మీటింగ్‌లో ఉన్న ఒక ఎమ్మెల్యేనే నాకు ఈ విషయాలు చెప్పారు. బీఆర్‌ఎస్‌ను చేజిక్కించుకుని బీజేపీ సపోర్ట్ తీసుకోవాలని కుట్రలు చేస్తుండు. బీజేపీతో మిలాఖత్ ఉందని చెప్పడానికి నా దగ్గర ఆధారాలు ఉన్నాయి. రాజపుష్ప ఓపెన్ స్కై విల్లాస్‌లో ఒక ఆర్‌ఎస్‌ఎస్ ప్రముఖుడు వచ్చినప్పుడల్లా ఆయనకు పసుపు, మిరియాలు కలిపిన పాలు వెళ్తుంటాయి. ఆ రోజు హరీశ్ పూర్తిగా తన కార్యక్రమాలను రద్దు చేసుకొని ఆయనతో మీటింగ్ పెడతాడు. నేను ఇప్పుడు బీఆర్ఎస్‌లో లేను. ఆ పార్టీ ఎలా పోయినా నాకు సంబంధం లేదు. కానీ, తిన్నింటి వాసాలు లెక్కపెట్టే హరీశ్గురించి తెలియాలనే ఈ విషయాలు చెబుతున్నా’’అని ఆమె సంచలన వ్యాఖ్యలు చేశారు.
సీఎంతో లండన్ లో లాలూచీ
సీఎం రేవంత్ రెడ్డితో హరీశ్ రావు లాలూచీ పడ్డారని కవిత ఆరోపించారు. లేదంటే ఫోన్ ట్యాపింగ్, కాళేశ్వరం కేసులు ఏమయ్యాయని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రయోజనాలను సీఎం తాకట్టు పెడుతున్నా బీఆర్ఎస్ మాట్లాడటం లేదని మండిపడ్డారు. ఏపీకి చెందిన ఓ ఎంపీ కొడుకు అతివేగంతో వచ్చి యాక్సిడెంట్ చేస్తే ఒడిశా అమ్మాయి చనిపోయిందని, దాని గురించి ఒక్క మాట కూడా మాట్లాడలేదని మండిపడ్డారు. లండన్‌లో లాలూచీ కారణంగానే ఏ విషయాలపైనా బీఆర్‌ఎస్ మాట్లాడడం లేదని ప్రశ్నించారు. కొన్ని రోజుల క్రితమే లండన్‌లో సీఎం రేవంత్, హరీశ్ మధ్య మీటింగ్ జరిగిందని ఆమె ఆరోపించారు. ఆంధ్రావాళ్లతో కేటీఆర్‌కు వ్యాపార సంబంధాలు, దోస్తులు ఉండటంతో ఆయన మాట్లాడటం లేదన్నారు. లండన్‌లో లాలూచీ పడకపోయుంటే.. హరీశ్ రావు మీద సీఎం రేవంత్ క్విడ్ ప్రోకో కేసు నమోదు చేయాలని డిమాండ్‌చేశారు. హెల్త్ మినిస్టర్‌గా ఉన్న సమయంలో హరీశ్ రావు కార్పొరేట్ సంస్థలకు పెద్ద ఎత్తున పాలు పోసి వ్యాపారం చేశారని, ఒక్క నారాయణ, చైతన్య కాలేజీలకే నెలకు రూ.5 కోట్ల చొప్పున 8 ఏండ్లు రూ.960 కోట్ల వ్యాపారం చేశారని ఆరోపించారు. ఇంకా కార్పొరేట్ హాస్పిటల్స్ కిమ్స్, కామినేని, యశోద వంటి హాస్పిటల్స్‌కు కూడా ఆయన పాలు పోశారన్నారు. ఆరోగ్య శాఖ మంత్రిగా ఉంటూ ఇలా ఆంధ్రా వాళ్లతో పాల వ్యాపారం చేయడం క్విడ్ ప్రోకో కాదా? అని ఆమె ప్రశ్నంచారు.
