- మాజీ కేంద్ర మంత్రి మిలింద్ దేవర
బషీర్‌బాగ్, వెలుగు: తెలంగాణలో శివసేన పార్టీని బలోపేతం చేసి, రాబోయే ఎన్నికల్లో పోటీ చేస్తామని రాజ్యసభ పక్ష నేత, మాజీ కేంద్ర మంత్రి మిలింద్ దేవర తెలిపారు. మహారాష్ట్ర మోడల్ను తెలంగాణలో అమలు చేసేందుకు కృషి చేస్తామని చెప్పారు. హైదరాబాద్ బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సింకారు శివాజీ ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి సమావేశంలో పాల్గొన్నారు.
అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. మహారాష్ట్రకు చెందిన శివసేన నేతలు తెలంగాణలో విస్తృతంగా పర్యటిస్తారని, పార్టీని బలోపేతం చేసేందుకు పని చేస్తామని తెలిపారు. ప్రజా సమస్యలపై ప్రత్యేక కార్యాచరణ రూపొందించి ఉద్యమాలు చేపడతామన్నారు. దేశవ్యాప్తంగా శివసేనను విస్తరించేందుకు పార్టీ అధినేత ఏక్నాథ్ షిండే నాయకత్వంలో ముందుకెళ్తున్నామని తెలిపారు.
దేశం, ధర్మం కోసం పని చేయాలనుకునే వారికి శివసేన సరైన వేదిక అని, యువత, మహిళలు పార్టీలో చేరాలని పిలుపునిచ్చారు. తెలంగాణలో గోమాతను రాజ్యమాతగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. శివసేన తెలంగాణ అధ్యక్షుడు సింకారు శివాజీ మాట్లాడుతూ హుస్సేన్‌సాగర్ పేరును వినాయక్సాగర్గా మార్చాలని డిమాండ్ చేశారు.
రాష్ట్రంలో గో హత్యను పూర్తిగా నిషేధించాలని కోరారు. ఎన్నికల సమయంలో ప్రభుత్వం ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని కోరారు. ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి.సుధాకర్, నేతలు రమేశ్, రాజారావు, లక్ష్మణ్, సాయి, మారుతి, విష్ణు, అఖిల్, వెంకటేశ్, రాహుల్, లింగం పాల్గొన్నారు.
