పాన్ కార్డ్‌లో పేరు, అడ్రస్ తప్పుగా ఉన్నాయా ? ఇంటి నుంచే ఇలా ఈజీగా మార్చుకోండి!

పాన్ కార్డ్‌లో పేరు, అడ్రస్ తప్పుగా ఉన్నాయా ? ఇంటి నుంచే ఇలా ఈజీగా మార్చుకోండి!

భారతదేశంలో పాన్ కార్డ్ చాలా ముఖ్యమైన డాక్యుమెంట్. బ్యాంకు అకౌంట్  తెరవాలన్నా, ఐటీఆర్ (ITR) ఫైల్   చేయాలన్నా, పెద్ద మొత్తంలో డబ్బు లావాదేవీలు జరపాలన్నా పాన్ కార్డ్ కచ్చితంగా ఉండాలి. ఒకవేళ మీ పాన్ కార్డ్‌లో పేరు తప్పుగా ఉన్నా, పాత అడ్రస్ ఉన్నా, లేక పాత మొబైల్ నంబర్ ఉన్నా భవిష్యత్తులో చాలా ఇబ్బందులు వస్తాయి. అయితే దలారీలు లేదా ఏజెంట్ల చుట్టూ తిరగకుండా, మీ ఇంటి నుంచే ఆన్‌లైన్‌లో సులభంగా పాన్ కార్డ్ లో ఈ మార్పులు చేసుకోవచ్చు....

ఆన్‌లైన్‌లో మార్పులు చేసుకోవడం ఎలా?
* ముందుగా NSDL  లేదా UTIITSL అధికారిక వెబ్‌సైట్‌లోకి వెళ్లాలి.
* అందులో “PANలో మార్పులు/సవరణ” (Changes/Correction in PAN) అనే ఆప్షన్‌ను సెలెక్ట్ చేసుకోవాలి.
* ఇప్పుడు మీ పాన్ నంబర్, పేరు, పుట్టిన తేదీ, ఈమెయిల్ ఐడీ వంటి వివరాలు ఎంటర్ చేయాలి.
*వివరాలు సమర్పించగానే మీకు 15 అంకెల టోకెన్ నంబర్ వస్తుంది. భవిష్యత్ అవసరాల కోసం దీన్ని సేఫ్ గా  రాసి పెట్టుకోవాలి.

పేరు, అడ్రస్, మొబైల్ నంబర్ మార్చుకునే విధానం:
*మీరు ఏ వివరాలను మార్చాలనుకుంటున్నారో (పేరు, అడ్రస్ లేదా ఫోన్ నంబర్) దాన్ని సెలెక్ట్ చేసుకొని సరైన సమాచారాన్ని టైప్ చేయాలి.
*మీరు ఇచ్చే వివరాలు మీ దగ్గర ఉన్న ఒరిజినల్ ప్రూఫ్స్‌లో ఉన్నట్టే కచ్చితంగా ఉండాలి. ఏ చిన్న తేడా ఉన్నా మీ అప్లికేషన్ ఆలస్యం అవుతుంది.

ఏయే డాక్యుమెంట్లు కావాలి?
మీరు మార్చాలనుకుంటున్న వివరాలను బట్టి గుర్తింపు రుజువు (ID Proof), అడ్రస్ ప్రూఫ్ (Address Proof), పుట్టిన తేదీ రుజువు, మీ ఫోటో, సంతకం స్కైన్ చేసి ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది.

ఫీజు ఎంత ఉంటుంది?
అన్ని వివరాలు, డాక్యుమెంట్లు అప్‌లోడ్ చేశాక ఆన్‌లైన్ ద్వారా ఫీజు చెల్లించాలి. భారతదేశంలో ఉండేవాళ్లకు జీఎస్టీతో కలిపి సుమారు రూ. 50 ఖర్చు అవుతుంది. విదేశాల్లో ఉండేవాళ్లకు అయితే సుమారు రూ. 959 వరకు ఫీజు ఉంటుంది.

కొత్త పాన్ కార్డ్ ఎప్పుడు వస్తుంది?
అన్ని వివరాలు కరెక్ట్‌గా ఇచ్చి, సవరణ దరఖాస్తు విజయవంతంగా సమర్పిస్తే.. దాదాపు 15 నుంచి 20 రోజుల్లో మీ అప్‌డేటెడ్ పాన్ కార్డ్ మీ ఇంటికి పోస్ట్ ద్వారా వస్తుంది. అప్లికేషన్ పూర్తయిన తర్వాత వచ్చే రిసిప్ట్  డౌన్‌లోడ్ చేసుకుంటే, దానిపై ఉన్న నంబర్ ద్వారా మీ పాన్ కార్డ్ స్టేటస్ ఎప్పుడైనా చెక్ చేసుకోవచ్చు.