నెలకు రూ.5 లక్షలు జీతం వస్తున్నా బతకటం కష్టంగా ఉందా..? డబ్బులు ఎక్కువైతే ఇలాగే అనిపిస్తదా ఏంటీ..!

నెలకు రూ.5 లక్షలు జీతం వస్తున్నా బతకటం కష్టంగా ఉందా..? డబ్బులు ఎక్కువైతే ఇలాగే అనిపిస్తదా ఏంటీ..!

ఇండియన్ సిలికాన్ వ్యాలీ బెంగుళూరులో పెరుగుతున్న ఖర్చులు మరోసారి నెట్టింట హాట్ టాపిక్‌గా మారాయి. ఉద్యోగాల కోసం లక్షలాది మంది యువత వలస వచ్చే ఈ నగరంలో.. సంపాదన ఎంత ఉన్నా ఖర్చులు మాత్రం దానికి మించి హద్దుమీరుతున్నాయనే చర్చ జరుగుతోంది. తాజాగా రెడిట్ లో ఓ మధ్యతరగతి ఫ్యామిలీ తమ నెలవారీ బడ్జెట్ వివరాలను పంచుకోవడంతో ఈ అంశంపై పెద్ద ఎత్తున వాదనలు ప్రారంభమయ్యాయి. నెలకు రూ.4.50 లక్షలు సంపాదిస్తున్నప్పటికీ.. కుటుంబ నిర్వహణ భారంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు.

అసలు ఆ కుటుంబం ఖర్చుల లెక్కేంటి?
తమ నెలవారీ ఖర్చుల చిట్టాను బయటపెట్టింది సదరు బెంగళూరు కపుల్ రెడ్డిట్ వేదికగా. భార్యాభర్తలు, ఒక చిన్నపాపతో కూడిన ఈ ముగ్గురి కుటుంబం బెంగుళూరులో నివసిస్తోంది. ఎలాంటి విలాసవంతమైన ఖర్చులు చేయకపోయినా.. కేవలం ఇంటి అవసరాలకే నెలకు రూ.లక్షా 47వేలు ఖర్చవుతున్నాయని వారు తెలిపారు. ఇందులో అత్యధికంగా ఇంటి అద్దె కింద రూ.45వేలు చెల్లిస్తుండగా, చైల్డ్ కేర్ కోసం పెట్టే ఖర్చులు తలకు మించిన భారంగా మారుతున్నాయి. పాప సంరక్షణ కోసం నానీకి రూ.20వేలు, వంట మనిషికి రూ.9వేలు, పని మనిషికి రూ.3వేలు, కార్ క్లీనర్‌కు రూ.వెయ్యి చొప్పున వెచ్చిస్తున్నారు. ఇవి కాకుండా నిత్యవసరాలు, కిరాణా సామాగ్రికి రూ. 20వేలు, ఇన్సూరెన్స్ ప్రీమియంల రూపంలో రూ. 25వేలు, సొంతూరికి పంపే ఖర్చులు, ఇతరత్రా బిల్లుల కింద మరో రూ.20వేలు ఖర్చవుతున్నట్లు వారు స్పష్టం చేశారు.

సంపాదన రూ.4.50 లక్షలు.. అయినా భయమెందుకు?
ఈ దంపతుల నెలవారీ సంపాదన రూ.4లక్షల 50వేలు. అంత మంచి ప్యాకేజీ ఉన్నప్పటికీ.. భవిష్యత్తులో -ఆర్థిక స్వాతంత్ర్యం సాధించి త్వరగా రిటైర్ కావడం లక్ష్యాలను ఎలా చేరుకోవాలో తెలియక తలలు పట్టుకుంటున్నట్లు ఆ యూజర్ పేర్కొన్నారు. ఒకవేళ నానీని తీసేసినా.. రాబోయే రోజుల్లో పాప స్కూల్ ఫీజులు ఆ ఖర్చును భర్తీ చేస్తాయని, కాబట్టి ఖర్చులు ఎప్పటికీ తగ్గే అవకాశం లేదని వాపోయారు. బెంగుళూరులో పెరుగుతున్న భారాన్ని తట్టుకోలేక టైర్-2 నగరాలకు మకాం మార్చడం మంచిదేనా అని తోటి నెటిజన్లను సలహా కోరారు.

నెటిజన్ల నుంచి భిన్న స్పందనలు.. ట్రోల్స్
ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్ల నుంచి రకరకాల కామెంట్లు వ్యక్తమయ్యాయి. కొందరు బెంగుళూరులో పెరుగుతున్న అద్దెలు, జీవన వ్యయం నిజంగానే ఒక పీడకలలా మారిందని మద్దతు తెలపగా.. మరికొందరు మాత్రం వారిపై విమర్శలు గుప్పించారు. నెలకు రూ.4లక్షల 50వేలు సంపాదిస్తూ.. అన్ని సౌకర్యాలు, విలాసాలు అనుభవిస్తూ కూడా నెట్టింట దొంగ ఏడుపులు ఏంటని మరికొందరు నిలదీస్తున్నారు. అన్ని ఖర్చులు పోను ప్రతి నెలా రూ.3 లక్షలకు పైగా సేవింగ్స్ చేసుకునే అవకాశం ఉన్నప్పటికీ ఇలా మాట్లాడటం అతిగా ఉందని కామెంట్లు పెడుతున్నారు. చిన్న చిన్న జాబ్స్ చేసుకుంటూ బతికే వాళ్లకంటే దరిద్రంలో జీవిస్తున్నట్లు బిల్డప్ ఇవ్వటం నిజంగా కష్టాల్లో ఉన్న మధ్యతరగతిని ఆగ్రహానికి గురిచేస్తోంది.