లక్నో: నేపాల్ వరదల్లో చనిపోయిన నలుగురి మృతదేహాలు శుక్రవారం యూపీలోని మహారాజ్‌గంజ్ జిల్లాలోని నదిలో లభించాయి. అవి పూర్తిగా కుళ్లిపోయిన స్థితిలో ఉండటంతో ఇంకా గుర్తించలేదు. డెడ్‌బాడీలను జిల్లా ఆస్పత్రి మార్చురీలో ఉంచి.. వివరాల కోసం నేపాల్ అధికారులతో సంప్రదిస్తున్నారు. మరోవైపు నేపాల్‌లో కురుస్తున్న భారీ వర్షాలతో గంగా, గండక్, కోసి, బుర్హీ గండక్, ఘాఘ్రా నదుల్లో నీటిమట్టాలు పెరుగుతున్నాయి. బిహార్‌లోని పలు ప్రాంతాల్లో ఈ నదులు ప్రమాదస్థాయిని దాటాయి. దీంతో యూపీ, బిహార్ బార్డర్ జిల్లాల్లో అధికారులు నదుల నీటిమట్టాలను నిరంతరం పర్యవేక్షిస్తూ రక్షణ బృందాలను అప్రమత్తం చేశారు.
