ఉత్తర తెలంగాణ ప్రాంతంలో రవాణా వ్యవస్థకు, ఆర్థిక కార్యకలాపాలకు కీలకమైన పూడూర్ నుంచి జగిత్యాల వరకు విస్తరించిన మార్గం ప్రస్తుతం ప్రయాణికులకు ప్రాణసంకటంగా మారుతోంది. ఉమ్మడి కరీంనగర్, వరంగల్, ఆదిలాబాద్ జిల్లాలను అనుసంధానించే ఈ రోడ్డు మార్గం ప్రాంతీయ అభివృద్ధికి జీవనాడి లాంటిది. సరుకు రవాణా వాహనాలు, నిత్యం వేలాది మంది ప్రయాణికులకు ప్రధాన రోడ్డు మార్గం ఇదే. పూడూర్ నుంచి జగిత్యాల మార్గంలో ప్రతివారం కనీసం ఒక ప్రమాదం జరగడం పరిపాటిగా మారింది.
కొండగట్టు ప్రాంతంలో పరిస్థితి మరింత ఆందోళనకరంగా ఉంది. ఈ రోడ్డుపై సగటున ప్రతి 15రోజులకు ఒక ప్రాణాంతక ప్రమాదం జరుగుతోంది. ఈ రహదారి నిత్యం మృత్యు ఘోష వినిపిస్తున్న ప్రాంతంగా మారడానికి ఇంజినీరింగ్ లోపాలు, సాంకేతిక పరిమితులే ప్రధాన కారణమని సివిల్ ఇంజినీరింగ్ నిపుణులు భావిస్తున్నారు.
సంస్థాగత బాధ్యతారాహిత్యానికి నిదర్శనం
ఒకే నిర్దిష్ట ప్రాంతంలో పదేపదే ఘోర రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నప్పుడు అది కేవలం వ్యక్తిగత తప్పిదాల అంశం కాదు. అది స్పష్టంగా రోడ్డు ఇంజినీరింగ్ లోపాలు, సంస్థాగత బాధ్యతారాహిత్యానికి నిదర్శనం. ప్రమాదాలను నివారించడంలో సరైన ప్రణాళిక కొరవడటం, హెచ్చరిక బోర్డులు, రాత్రివేళల్లో తగినంత లైటింగ్ లేకపోవడం, ట్రాఫిక్ నిబంధనల అమలులో బలహీనత వంటి అంశాలు పరిస్థితిని మరింత దిగజార్చుతున్నాయి.
ఇక్కడ ద్విచక్ర వాహనాల ప్రమాదాలు సర్వసాధారణంగా మారుతుండటంతో, యువకులు, స్థానిక ప్రయాణికులు నిత్యం మృత్యువుతో పోరాడాల్సి వస్తోంది. భారీ వాహనాల దూకుడు, ద్విచక్ర వాహనదారులు అదుపుతప్పి భారీ వాహనాల కింద నలిగిపోవడం జరుగుతోంది. అత్యవసర వైద్యసేవల లభ్యతలో జాప్యం కూడా ప్రాణనష్టాన్ని పెంచుతోంది.
ప్రభుత్వం పరిష్కారంవైపు దృష్టి సారించాలి
ఒకే ప్రాంతంలో పదేపదే ప్రయాణికుల ప్రాణాలు గాలిలో కలుస్తున్నప్పుడు ప్రభుత్వం శాశ్వత పరిష్కారాల వైపు దృష్టి సారించాలి. ప్రభుత్వం, సంబంధిత శాఖలు ఈ ప్రమాదాల నివారణకు సమగ్రమైన ప్రణాళికను రూపొందించడంలో విఫలమవడం విచారకరం. ప్రస్తుత మార్గంలో గల తీవ్రమైన వంపులు, తరచూ జరుగుతున్న ప్రమాదాలకు మూలకారణాలుగా సివిల్ ఇంజినీరింగ్ విశ్లేషణ స్పష్టం చేస్తున్నది.
వాహనాల వేగ నియంత్రణకు అవసరమైన గ్రేడ్ సపరేటర్లు, సరైన కూడలి డిజైన్లు, నాణ్యమైన రోడ్డు భద్రతా మౌలిక వసతులు ఈ ప్రాంతంలో పూర్తిగా కొరవడ్డాయి. ముఖ్యంగా భారీ వాహనాలు, ప్రైవేట్ రవాణా వాహనాలు ఎదురెదురుగా వచ్చే సందర్భాలలో సైట్ డిస్టెన్స్ లోపించడం వల్ల ఘోర ప్రమాదాలు పునరావృతమవుతున్నాయి. భౌగోళిక, సాంకేతిక అవరోధాలను అధిగమించడానికి ఈ మార్గంలో ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణాన్ని చేపట్టడం దీర్ఘకాలిక పరిష్కారంగా భావించవచ్చు. వేములవాడ, ధర్మపురి వంటి క్షేత్రాలకు వెళ్లే భక్తులకు ఈ కారిడార్ ఉపయోగపడుతుంది.
ఎలివేటెడ్ కారిడార్ లేదా ఫ్లైఓవర్ నిర్మించాలి
కొండగట్టు రోడ్డు అత్యంత సమస్యాత్మక ప్రాంతాల్లో ఎలివేటెడ్ కారిడార్ లేదా ఫ్లైఓవర్ నిర్మించాలనే డిమాండ్ వ్యక్తమవుతోంది. ప్రభుత్వం ముందుగా రహదారి ఇంజినీరింగ్ నిపుణులతో సమగ్ర సాధ్యాసాధ్యాల నిపుణ కమిటీ చేత అధ్యయనం చేయించాలి. ప్రమాదకర మలుపులను సరిచేయడం, వీలైనచోట రోడ్డును విస్తరించడం, గ్రేడ్ సెపరేషన్ పద్ధతులు అమలు చేయడం, క్రిటికల్ ప్రాంతాల్లో ఎలివేటెడ్ వయాడక్ట్ భాగాలు నిర్మించడం వంటి చర్యలు పరిశీలించాలి. క్రాష్ బారియర్లు, మధ్యలో డివైడర్ రక్షణ, హెచ్చరిక సంకేతాలు, ఇంటెలిజెంట్ ట్రాఫిక్ మానిటరింగ్ సిస్టమ్ ఏర్పాటు చేయాలి. తక్షణ చర్యగా ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉన్న స్పాట్లను గుర్తించి ఇంజినీరింగ్ పద్ధతుల ద్వారా చర్యలు చేపట్టాలి.
- డా. కట్కూరి
పాలసీ విశ్లేషకుడు
ఓపెన్ పేజీకి వ్యాసాలు, లెటర్లు పంపాల్సిన మెయిల్ ఐడీ
openpage@v6velugu.com
రచయితలు ‘వెలుగు’ కు మాత్రమే పంపుతున్నామని
హామీ తప్పనిసరి రాయాలి.
స్వీయ రచన అయి ఉండాలి.
రచన 700 పదాలకు మించరాదు.
