ప్రపంచంలోనే అత్యధిక యువ జనాభా కలిగిన భారతదేశంలో రాజకీయాలను సమూలంగా మార్చే శక్తి యువతకు ఉందా..? ఈ ప్రశ్నకు ముందు, దేశంలో ఎన్నికలను యువతరం ఎంతమేర ప్రభావితం చేయగలుగుతుంది..? అన్న ప్రశ్నకు జవాబు రాబట్టాలి. ఇప్పటివరకున్న సమాచారం, హేతుబద్ధ విశ్లేషణలను బట్టి చూస్తే కచ్చితంగా ‘అవును’ అని చెప్పే స్థితి లేదు.
దేశంలో సుమారు ఏకకాలపు 50 రోజుల ఓ యువజనోద్యమ భావోద్వేగాలు, మరో 50 రోజుల సర్వే ఫలితాల వ్యత్యాసాలే ఇందుకు నిదర్శనం. జంతర్ మంతర్ కేంద్రంగా దేశమంతా జరిగిన యువ ఉద్యమం కేంద్ర ప్రభుత్వం మెడలు వంచి, నేలకు దించింది. అదే వరసలో మరో 55 ( జులై1- ఆగస్టు 25) రోజులపాటు సాగిన ఇండియా టుడే సీ ఓటర్ ‘మూడ్ ఆఫ్ ది నేషన్’ సర్వే ఫలితాలు అందుకు విరుద్ధంగా కేంద్రంలోని ఎన్డీయేకు అనుకూలంగా ఉన్నాయి. ఈ పరస్పర విరుద్ధ సంకేతాలు యువత నిరసన వేరు, వారి ఓటింగ్ సరళి వేరని చెప్పకనే చెబుతున్నాయి.
భారత ఎన్నికల రాజకీయాల్లో యువత ఎప్పటినుంచో కీలక ఓటుబ్యాంకుగా పరిగణించడం జరుగుతోంది. దేశ జనాభాలో యువత వాటా (60 %) భారీగా ఉండటంతో ప్రతి రాజకీయ పార్టీ వారిని ఆకర్షించేందుకు ప్రత్యేక వ్యూహాలు రచిస్తోంది. ఉద్యోగాలు, విద్య, నైపుణ్యాభివృద్ధి, ఉపాధి అవకాశాలు, పరీక్షలు, స్టార్టప్‌లు, డిజిటల్ ఆర్థికవ్యవస్థ వంటి అంశాలను ఎన్నికల ప్రచారంలో ప్రధానంగా ప్రస్తావిస్తోంది.
అయితే యువత సంఖ్య ఎక్కువగా ఉండటం ఒక్కటే ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేస్తుందా..? యువత నిజంగా పెద్దసంఖ్యలో పోలింగ్ కేంద్రాలకు వస్తున్నారా..? వారి ఓటింగ్ ధోరణి ఏ పార్టీకి అనుకూలంగా ఉంది..? అనే ప్రశ్నలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.
యువత అంటే ఒకే రాజకీయ వర్గం కాదు
ఎన్నికల విశ్లేషణలో యువ ఓటర్లను ఒకే సమూహంగా పరిగణించడం సరైనది కాదు. 18–21, 22–25, 26–28 వంటి వయసు గ్రూపుల్లో రాజకీయ అభిప్రాయాలు, ఓటింగ్ ఆసక్తి, ఎన్నికల భాగస్వామ్యం మారుతుంటాయి. అందువల్ల ‘యువత ఈ పార్టీ వైపు ఉంది’ అనే సాధారణ అంచనాల కంటే వయసు, ప్రాంతం, సామాజిక నేపథ్యం, విద్య, ఉద్యోగ స్థితి వంటి అంశాలను కూడా పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుందని ప్రముఖ రాజకీయ విశ్లేషకుడు, లోక్‌నీతి సంస్థ డైరెక్టర్ డా. సంజయ్ కుమార్ అంటారు.
యువతకు ఓటు వేయాలనే ఆసక్తి, నిజంగా పోలింగ్ కేంద్రానికి వెళ్లి ఓటు వేయడం మధ్య ఉన్న తేడా ముఖ్యం. సోషల్ మీడియాలో ఒక రాజకీయ అంశంపై పెద్ద ఎత్తున స్పందించడం, నిరసనల్లో పాల్గొనడం లేదా ఒక పార్టీకి మద్దతు ప్రకటించడం తప్పనిసరిగా ఎన్నికల రోజున ఓటుగా మారదు.
రాష్ట్రాల మధ్య భారీ తేడాలు
2024 లోక్‌సభ ఎన్నికల గణాంకాలను పరిశీలిస్తే యువ ఓటర్ల పోలింగ్‌లో రాష్ట్రాల మధ్య గణనీయమైన తేడాలు కనిపిస్తాయి. కొన్ని రాష్ట్రాల్లో 18-–21 వయసు ఓటర్ల పోలింగ్ రాష్ట్ర సగటు కంటే చాలా తక్కువగా ఉండగా, మరికొన్ని రాష్ట్రాల్లో యువత పోలింగ్ మొత్తం రాష్ట్ర సగటును మించిపోయింది. బిహార్‌లో 18–-21 వయసు యువత పోలింగ్ సుమారు 41 శాతంగా ఉండగా, రాష్ట్రం మొత్తం పోలింగ్ 67.3 శాతంగా నమోదైంది.
యూపీలో యువత పోలింగ్ సుమారు 51 శాతంగా ఉండగా, రాష్ట్ర సగటు 61.1 శాతంగా ఉంది. అంటే ఈ రెండు పెద్ద రాష్ట్రాల్లో యువతకు ఉన్న రాజకీయ ప్రాధాన్యానికి అనుగుణంగా వారి పోలింగ్ కనిపించలేదని చెప్పవచ్చు. ఇదే సమయంలో మధ్యప్రదేశ్, పంజాబ్, గుజరాత్, పశ్చిమ బెంగాల్, తమిళనాడు వంటి రాష్ట్రాల్లో యువత పోలింగ్ గణనీయంగా నమోదైంది. అందువల్ల దేశవ్యాప్తంగా యువత ఓటింగ్‌పై ఒకే రకమైన తీర్పు
ఇవ్వడం సాధ్యం కాదు.
యువత మద్దతు వేరు.. యువత ఓటు వేరు
ఎన్నికల రాజకీయాల్లో అత్యంత ముఖ్యమైన పాఠం ఇదే. ఒక పార్టీకి యువతలో ఆదరణ ఉండవచ్చు. కానీ ఆ మద్దతు ఎన్నికల ఫలితంగా మారాలంటే వారు పోలింగ్ కేంద్రాలకు వచ్చి ఓటు వేయాలి. ఇందుకు ఉత్తరాఖండ్ ఎన్నికల ఉదాహరణ 2022లో 18–21 వయసు యువ ఓటర్లలో కాంగ్రెస్‌కు 48 శాతం, బీజేపీకి 33 శాతం మద్దతు ఉన్నట్లు సీఎస్‌డీఎస్ లోక్‌నీతి డేటా సూచిస్తోంది. అయినప్పటికీ బీజేపీ అధికారం నిలబెట్టుకుంది. అంటే ఒక వర్గంలో ఉన్న ఓటు ప్రాధాన్యత మాత్రమే ఎన్నికల ఫలితాన్ని నిర్ణయించదు. ఓటర్ల సంఖ్య, పోలింగ్ శాతం, ఇతర వయసు గ్రూపుల మద్దతు, నియోజకవర్గాలవారీగా ఓట్ల పంపిణీ వంటి అనేక అంశాలు కలిసి ఫలితాన్ని నిర్ణయిస్తాయి.
2014 నుంచి మారుతున్న యువత రాజకీయ ధోరణి
2014, 2019 లోక్‌సభ ఎన్నికల్లో యువతలో బీజేపీకి కనిపించిన ఆకర్షణపై విస్తృతంగా చర్చ జరిగింది. అయితే 2024 ఎన్నికల్లో అదే ధోరణి పూర్తిగా కొనసాగలేదని సంజయ్ కుమార్ చేసిన పరిశోధన సూచిస్తోంది. 2024 ఎన్నికల్లో యువత రాజకీయ భాగస్వామ్యాన్ని పరిశీలించిన ఆయన అధ్యయనం ప్రకారం ఏ ఒక్క రాజకీయ పార్టీ కూడా ప్రత్యేకమైన ‘యూత్ కానిస్టిట్యూయెన్సీ’ని పూర్తిగా తనవైపు తిప్పుకోలేకపోయింది. ఇది రాజకీయ పార్టీలకు ఒక కీలక హెచ్చరిక. యువతను కేవలం ప్రచార కార్యక్రమాల్లో ఉపయోగించుకోవడం లేదా సోషల్ మీడియా ద్వారా చేరుకోవడం సరిపోదు. వారి వాస్తవ సమస్యలకు పరిష్కారాలు చూపించాల్సి ఉంటుంది.
ఉద్యోగమే ప్రధాన ఎన్నికల అంశమా..?
యువత రాజకీయ ప్రాధాన్యాల్లో ఉద్యోగం, ఉపాధి అత్యంత ముఖ్యమైనవి. సీఓటర్ తాజా సర్వేలోనూ అత్యధికులు (23% మంది) నిరుద్యోగితనే ప్రధాన సమస్యగా చెప్పారు. విద్యావంతులైన నిరుద్యోగ యువతలో ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రైవేట్ రంగ అవకాశాలు, నైపుణ్య శిక్షణ, పోటీ పరీక్షలు, రిక్రూట్‌మెంట్ ప్రక్రియలో పారదర్శకత వంటి అంశాలు రాజకీయ అభిప్రాయాలను ప్రభావితం చేస్తున్నాయి.
జులై 2026లో విద్యార్థుల నిరసనలు పరీక్షా పత్రాల లీకేజీలు, యువత ఉద్యోగాల సమస్యలు రాజకీయంగా ప్రభావవంతమైన అంశాలుగా మనం చూశాం. అయితే, ఒక సమస్యపై యువతలో తీవ్ర అసంతృప్తి ఉండటం, అది తప్పనిసరిగా ఒకే పార్టీకి ఓటుగా మారుతుందని భావించడం కూడా తప్పే.
ఎన్నికల ఫలితాల్లో ‘మొబిలైజేషన్’ కీలకం
యువత ఓటు ప్రభావాన్ని అంచనా వేయడంలో ‘ఎవరికి మద్దతు ఉంది?’ అనే ప్రశ్నతో పాటు, ‘ఎవరు వారిని పోలింగ్ కేంద్రానికి తీసుకురాగలిగారు?’ అనే ప్రశ్న కూడా కీలకం. ఒక పార్టీకి యువతలో 50 శాతం మద్దతు ఉన్నప్పటికీ, ఆ వర్గంలో పోలింగ్ శాతం తక్కువగా ఉంటే దాని ఎన్నికల ప్రయోజనం పరిమితమే! మరోవైపు యువతలో మద్దతు తక్కువగా ఉన్నా, పోలింగ్ రోజున వారిని సమర్థంగా మొబిలైజ్ చేయగలిగితే ఆ పార్టీకి ఎన్నికల ప్రయోజనం కలగవచ్చు. అందుకే యువతలో ఉన్న రాజకీయ భావన కంటే, ఆ భావన ఓటుగా మారే ప్రక్రియే ఎన్నికల ఫలితాల్లో అసలు కీలకం. నిన్నటి తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో అదే రుజువైంది.
యువ ఓటు.. నిర్ణాయకం కావాలంటే
యువ ఓటర్లను ఆకర్షించేందుకు రాజకీయ పార్టీలు ఇప్పుడు కేవలం సంప్రదాయ ప్రచారాన్ని కాకుండా డిజిటల్ మీడియా, సోషల్ మీడియా, క్యాంపస్ కార్యక్రమాలు, యువజన సమావేశాలు, ఉద్యోగ, నైపుణ్య హామీలు వంటి మార్గాలను అనుసరిస్తున్నాయి. కానీ యువతను ఆకర్షించడానికి ఇచ్చే హామీలకు విశ్వసనీయత ఉండాలి. భారతదేశ ప్రజాస్వామ్యంలో యువత సంఖ్య ఎన్నికల శక్తిగా మారాలంటే మూడు అంశాలు ముఖ్యం.
ఓటరు నమోదు, పోలింగ్‌లో భాగస్వామ్యం, స్పష్టమైన రాజకీయ నిర్ణయం. అందువల్ల యువతను కేవలం ‘వచ్చే ఎన్నికల్లో కీలక ఓటుబ్యాంకు’గా చూడటం కంటే, ప్రజాస్వామ్య ప్రక్రియలో నిరంతరం పాల్గొనే పౌర సమూహంగా చూడాలి. ‘మూడ్ ఆఫ్ ది నేషన్’ తాజా సర్వే ఫలితాలు, ఇటీవలి దేశ యువత ఉద్యమ సమయపు ఉద్వేగాలకు భిన్నంగా ఉండటం గమనార్హం.
25 వేలకు పైగా శాంపిల్స్‌తో నిర్వహించిన ఈ సర్వే ప్రకారం.. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే 320కి పైగా స్థానాలతో ఎన్డీయే తిరిగి అధికారంలోకి వస్తుందని ఈ సర్వే చెప్పింది. మరి, యువశక్తి ప్రభావం ఉండదా? అన్న ప్రశ్న తలెత్తవచ్చు. భారత రాజకీయాల్లో యువతకు భవిష్యత్తు మాత్రమే కాదు. ప్రతి ఎన్నికలో వర్తమానాన్ని మార్చగల ఓటు శక్తి కూడా ఉంది. ఆ శక్తిని ఎవరు సమర్థంగా సమీకరిస్తారన్నదే రాబోయే ఎన్నికల్లో కీలకం.
- దిలీప్ రెడ్డి
పొలిటికల్ ఎనలిస్ట్,
పీపుల్స్ పల్స్ రీసెర్చ్ సంస్థ డైరెక్టర్
ఓపెన్ పేజీకి వ్యాసాలు, లెటర్లు పంపాల్సిన మెయిల్ ఐడీ
openpage@v6velugu.com
రచయితలు ‘వెలుగు’ కు మాత్రమే పంపుతున్నామని
హామీ తప్పనిసరి రాయాలి.
స్వీయ రచన అయి ఉండాలి.
రచన 700 పదాలకు మించరాదు.
