విద్యాభ్యాసంలో పిల్లలకు చదువుతోపాటు ఆరోగ్యం, పోషకాహారం కీలకమైన అంశాలు. క్షేత్రస్థాయి పరిస్థితులను పరిశీలించినప్పుడు చాలాచోట్ల ఉదయం అల్పాహారం లేకుండా పాఠశాలకు వస్తున్నారని పీపుల్స్ పల్స్ రీసెర్చ్ సంస్థ సహా పలు అధ్యయనాలలో తేలిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం ‘బ్రేక్‌ఫాస్ట్ విత్ మిల్క్’ పథకాన్ని తీసుకొచ్చింది. బడిని రోజూ పౌష్టికాహారంతో ప్రారంభించడం వల్ల పిల్లల ఆరోగ్యాన్ని, హాజరుశాతాన్ని పెంచి అభ్యాసనానికి మెరుగైన వాతావరణం కల్పించాలన్నదే ఈ కార్యక్రమం ఉద్దేశం. ఉదయం తగిన ఆహారం తీసుకున్న పిల్లల్లో తరగతుల సమయంలో చురుకుదనం, ఏకాగ్రత మెరుగ్గా ఉంటాయి. ఈ అంశాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వ పాఠశాలల్లోనే ఉదయం ఆహారాన్ని అందించడం వల్ల విద్యార్థుల రోజువారీ అవసరాన్ని తీర్చే ప్రయత్నం జరుగుతుంది.
రూ.800 కోట్ల బడ్జెట్
దేశంలో ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు ఉదయం అల్పాహారం అందించే కార్యక్రమానికి తమిళనాడు నాంది పలికింది. అక్కడి అనుభవాలను స్ఫూర్తిగా తీసుకుని సీఎం రేవంత్ రెడ్డి ఈ ఆలోచనను మరింత విస్తృత పరిధిలో అమలు చేసే దిశగా చర్యలు చేపట్టారు. ప్రీ ప్రైమరీ నుంచి ఇంటర్మీడియట్ వరకు విద్యార్థులకు ఈ బ్రేక్ ఫాస్ట్ ప్రయోజనం చేకూరేలా కార్యక్రమాన్ని విస్తరించడం, పాఠశాల విద్యతోపాటు ఆరోగ్య పరిరక్షణకు కూడా ప్రాధాన్యత ఇస్తోంది.
2026-–27 విద్యా సంవత్సరంలో తెలంగాణ ప్రభుత్వం ఈ కార్యక్రమానికి రూ.800 కోట్ల బడ్జెట్‌తో ప్రత్యేక ప్రాధాన్యతనిస్తోంది. దశలవారీగా విస్తరిస్తున్న ఈ పథకం ద్వారా మరింత మంది విద్యార్థులకు ప్రయోజనం అందే అవకాశం ఉంది. సమతుల్యమైన ఆహారం పిల్లల శారీరక ఎదుగుదలకు, శక్తి సామర్థ్యాలకు, రోగనిరోధక శక్తికి దోహదపడుతుంది. అందువల్ల పాఠశాల స్థాయిలోనే పోషకాహారంపై శ్రద్ధ పెట్టడం భవిష్యత్ తరాల ఆరోగ్యానికి పెట్టుబడిగా భావించాలి.
రోజువారీ కూలిపై ఆధారపడే కుటుంబాలకు ఇది ఆర్థికంగా ఉపశమనాన్ని కలిగిస్తుంది.
పిల్లలకు పాఠశాలలోనే ఉదయం ఆహారం అందుతుందనే భరోసా తల్లిదండ్రుల్లో నమ్మకాన్ని పెంచుతుంది. తద్వారా ప్రభుత్వ పాఠశాలల పట్ల విద్యార్థులు, తల్లిదండ్రుల్లో సానుకూల దృక్పథం పెంచడంలోనూ ఇలాంటి కార్యక్రమాలు ఉపయోగపడతాయి. విద్యార్థులతోపాటు ఉపాధ్యాయులు కలిసి అల్పాహారం తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించడం వల్ల ఈ పథకంపై తల్లిదండ్రులలో నమ్మకాన్ని పెంచింది.
రైతులకు ఆదాయం, విద్యార్థులకు నాణ్యమైన ఆహారం
బడికి వచ్చే పిల్లల కడుపు నింపడంతోనే ఈ కార్యక్రమ ప్రయోజనాలు పరిమితం చేయవద్దు. పాఠశాలల అవసరాలకు కావాల్సిన కూరగాయలు, పాలను స్థానిక రైతులు, పాడి రైతులు, మహిళా సంఘాల నుంచి నేరుగా సేకరించే విధానంతో అభివృద్ధి చేస్తే వారికి స్థిరమైన మార్కెట్ లభిస్తుంది. స్థానికంగా ఉత్పత్తి అయ్యే కూరగాయలు, పాలు వినియోగించడం ద్వారా రైతుల ఆదాయం పెరగడంతోపాటు విద్యార్థులకు తాజా, నాణ్యమైన ఆహారం అందుతుంది.
ఇంత విస్తృతంగా అమలు చేస్తున్న కార్యక్రమంలో నాణ్యత, పరిశుభ్రతపై నిరంతర పర్యవేక్షణ కీలకం. విద్యార్థులకు స్వచ్ఛమైన తాగునీరు, డైనింగ్ హాల్ వంటి సౌకర్యాలు కల్పిస్తే పథకం మరింత సమర్థవంతంగా అమలై మంచి ఫలితాలు సాధించవచ్చు. సమీప గ్రామాల్లోని ఉత్పత్తిదారులను వంటశాలల అవసరాలతో అనుసంధానం చేస్తే రవాణా, నిల్వ ఖర్చులను తగ్గించి, స్థానిక ఆర్థిక వ్యవస్థకు మరింత బలం చేకూర్చవచ్చు.
వంటశాలల పరిశుభ్రత, పదార్థాల నాణ్యత, వంట విధానం, ఆహార నిల్వ, సమయానికి పంపిణీ వంటి అంశాలను క్రమం తప్పకుండా పరిశీలించాలి. మెనూలో వైవిధ్యాన్ని కొనసాగించడంతోపాటు విద్యార్థుల అభిరుచులు, పోషక అవసరాలను కూడా పరిగణనలోకి తీసుకోవాలి. పాఠశాల యాజమాన్యాలు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు పర్యవేక్షణలో భాగస్వాములైతే పారదర్శకత, జవాబుదారీతనం మరింత పెరుగుతుంది. ‘బ్రేక్‌ఫాస్ట్ విత్ మిల్క్’ కార్యక్రమం కేవలం ఉదయం ఆహారం అందించే పథకంగానే కాకుండా విద్య, ఆరోగ్యం, సామాజిక సమానత్వం, గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసే కార్యక్రమంలా రూపుదిద్దుకోవాలి.
- జంపాల ప్రవీణ్
ఓపెన్ పేజీకి వ్యాసాలు, లెటర్లు పంపాల్సిన మెయిల్ ఐడీ
openpage@v6velugu.com
రచయితలు ‘వెలుగు’ కు మాత్రమే పంపుతున్నామని
హామీ తప్పనిసరి రాయాలి.
స్వీయ రచన అయి ఉండాలి.
రచన 700 పదాలకు మించరాదు.
