వ్యాయామ విద్య అనేది కేవలం శారీరక దృఢత్వాన్ని పెంపొందించే సాధనం మాత్రమే కాదు. వ్యక్తి శారీరక, మానసిక, సామాజిక, భావోద్వేగ వికాసానికి ఎంతో అవసరమైన విద్యా ప్రక్రియ. ఆధునిక జీవనశైలిలో శారీరక శ్రమ తగ్గిపోవడం, ఎక్కువ సమయం మొబైల్ ఫోన్లు, కంప్యూటర్లు, టెలివిజన్ ముందు గడపడం వల్ల చిన్నారులు, యువతలో అనేక ఆరోగ్య సమస్యలు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో వ్యాయామ విద్యకు మరింత ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉంది. విద్యార్థుల సమగ్ర వికాసంలో -వ్యాయామ విద్య కీలక పాత్ర పోషిస్తుంది. ఆటలు, వ్యాయామాలు విద్యార్థుల్లో క్రమశిక్షణ, సమయపాలన, నాయకత్వ లక్షణాలు, బాధ్యత, సహకార భావన వంటి విలువలను పెంపొందిస్తాయి.
క్రీడాస్ఫూర్తి.. వ్యక్తిత్వ వికాసం
మాదక ద్రవ్యాలు, పొగాకు, మద్యం వినియోగం కూడా యువత ఆరోగ్యానికి తీవ్రమైన సవాలుగా మారుతున్నాయి. భారతదేశంలోని గ్లోబల్ యూత్ టొబాకో సర్వే 2019 ప్రకారం 13–15 సంవత్సరాల పాఠశాల విద్యార్థుల్లో 8.4% మంది పొగాకు వినియోగిస్తున్నట్లు నమోదైంది. 2024 విద్యార్థుల సర్వేలో కూడా ఆందోళన కలిగించే అంశాలు కనిపించాయి. ఏదో ఒక రూపంలో పొగాకు వినియోగం 9.7%, గత 30 రోజుల్లో సిగరెట్ వినియోగం 5.7%, మద్యం గత 30 రోజుల్లో వినియోగించినవారి శాతం 5.3%గా నమోదైంది.
ఈ నేపథ్యంలో వ్యాయామ విద్య పాత్ర అత్యంత కీలకం. క్రీడల ద్వారా వ్యక్తిత్వ వికాసంతోపాటు క్రీడా మైదానం విద్యార్థులకు జీవిత పాఠాలను నేర్పే వేదికగా నిలుస్తోంది. గెలుపును వినయంగా స్వీకరించడం, ఓటమి నుంచి పాఠాలు నేర్చుకోవడం, ప్రత్యర్థిని గౌరవించడం, జట్టుతో కలిసి పనిచేయడం వంటి లక్షణాలు క్రీడల ద్వారా అభివృద్ధి చెందుతాయి. క్రీడలు నిత్యం ఆడటం మూలంగా జీవితంలో సామాజిక బాధ్యత, మానసిక దృఢత్వం, మానసిక ఉల్లాసం కలిగి ఒత్తిడిని జయిస్తారు. తద్వారా చెడు వ్యసనాలకు దూరంగా ఉంటారు. ఈ లక్షణాలు భవిష్యత్తులో విద్యార్థులు మంచి పౌరులుగా ఎదగడానికి సహాయపడతాయి.
క్రీడా కమిటీల సిఫార్సులు
కౌల్ కపూర్ కమిటీ ప్రధానమైన సిఫార్సులు చేసినప్పటికీ సక్రమంగా అమలుకాలేదు. 1948–49 రాధాకృష్ణన్ కమిషన్ (యూనివర్సిటీ ఎడ్యుకేషన్ కమిషన్) విశ్వవిద్యాలయ విద్యార్థుల సమగ్ర అభివృద్ధిలో శారీరక విద్య, ఆరోగ్యం, క్రీడలకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించింది. కుంజ్రు కమిటీ 1959 ముఖ్య సిఫారసులు.. పాఠశాల స్థాయిలో అందరికీ ఏకీకృత, తప్పనిసరి ప్రాథమిక వ్యాయామ విద్యా కార్యక్రమం ఉండాలి.
విద్యార్థుల్లో నాయకత్వ లక్షణాలను అభివృద్ధి చేయాలి. కౌల్ కపూర్ కమిటీ 1960/1961 ముఖ్య సిఫారసులు.. వ్యాయామ విద్యను సాధారణ విద్యలో అంతర్భాగంగా పాఠశాలలు, కళాశాలల్లో చేర్చాలి. విశ్వవిద్యాలయ స్థాయిలో ఫిజికల్ ఎడ్యుకేషన్‌ను ఒక సబ్జెక్ట్‌గా అభివృద్ధి చేయాలి. ఈ నేపథ్యంలో 1961లో ఏర్పడ్డ నేతాజీ సుభాష్ చంద్రబోస్ నేషనల్ ఇన్‌స్టిట్యూట్ అఫ్ స్పోర్ట్స్, 1984లో ఏర్పడ్డ స్పోర్ట్స్ అథారిటీ అఫ్ ఇండియా ద్వారా కొంతమేరకు దేశంలో క్రీడాకారులు పతకాలు సాధించి ఉన్నత స్థానాలకు ఎదిగారు.
క్రీడలతో ఫిట్ నెస్
జాతీయ విద్యా విధానం 2020లో వ్యాయామ విద్య, క్రీడలకు ప్రత్యేక స్థానం కల్పించి భారతదేశ విద్యా వ్యవస్థలో ఒక కీలకమైన మార్పుకు దారితీసింది. ఈ విధానం విద్యార్థుల అభివృద్ధిని కేవలం పుస్తక జ్ఞానానికకే పరిమితం చేయకుండా.. శారీరక, మానసిక, సామాజిక, నైతిక వికాసంతో కూడిన సమగ్ర విద్యకు ప్రాధాన్యతనిచ్చింది. ప్రపంచంలోనే అత్యధిక యువతను భారతదేశం కలిగి ఉంది. వారికి ఉన్నతమైన, నాణ్యతగల విద్య, క్రీడావకాశాలను కల్పిస్తే మన దేశం భవిష్యత్తులో ప్రపంచదేశాల్లో అగ్రస్థానానికి చేరుకునే అవకాశం ఉంది.
- డా. జంగం పాండు
అసిస్టెంట్ ప్రొఫెసర్
డా. బీఆర్. అంబేద్కర్ కాలేజ్
ఓపెన్ పేజీకి వ్యాసాలు, లెటర్లు పంపాల్సిన మెయిల్ ఐడీ
openpage@v6velugu.com
రచయితలు ‘వెలుగు’ కు మాత్రమే పంపుతున్నామని
హామీ తప్పనిసరి రాయాలి.
స్వీయ రచన అయి ఉండాలి.
రచన 700 పదాలకు మించరాదు.
