భద్రాచలం, వెలుగు : భద్రాచలం పట్టణంలోని మార్కెట్ ప్రాంతంలో శుక్రవారం ఫుడ్ సేఫ్టీ అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. జిల్లా ఫుడ్ సేఫ్టీ అధికారి ఈ.శరత్ ఆధ్వర్యంలో 15 కిరాణా, జనరల్ స్టోర్స్, ఆహార విక్రయ కేంద్రాలను తనిఖీ చేసి మిఠాయిలు, క్యాండీలు, ప్యాకేజ్డ్ ఫుడ్ తదితరాల నాణ్యత, ప్యాకింగ్, లేబులింగ్, గడువు తేదీలు, నిల్వ విధానాలను పరిశీలించారు.
అనుమానం ఉన్న ఆహార పదార్థాల నమూనాలను సేకరించి ల్యాబ్‌కు తరలించారు. నిబంధనలకు విరుద్ధంగా ఉన్న సుమారు 30 కిలోల ఆహార పదార్థాలను గుర్తించి డిస్కార్డ్ చేయించారు. వ్యాపారులు ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ నాణ్యతా ప్రమాణాలను తప్పనిసరిగా పాటించాలని శరత్ సూచించారు. నిబంధనలు ఉల్లంఘించే వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని తెలిపారు.
