భద్రాచలం, వెలుగు : భద్రాచలంలోని సీతారామచంద్రస్వామి దేవస్థానం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పవిత్రోత్సవాలు శుక్రవారం పూర్ణాహుతితో ముగిశాయి. పూర్ణాహుతి, పవిత్రాల ఉద్వాసన, మహా కుంభప్రోక్షణ చేశారు. ఈ సందర్భంగా నిలిపివేసిన నిత్య కల్యాణాలు నేటి నుంచి పున: ప్రారంభం కానున్నాయి. జంజాల పౌర్ణమి సందర్భంగా హయగ్రీవ జయంతిని భక్తిప్రవత్తులతో నిర్వహించారు. శ్రావణ శుక్రవారం వేళ లక్ష్మీతాయారు అమ్మవారికి అభిషేకం చేసి, సాయంత్రం మిథిలాప్రాంగణంలో లక్ష కుంకుమార్చన వేదోక్తంగా జరిపించారు.
