ఖాట్మండు: నేపాల్‌లో ప్రస్తుతం హృదయ విదారక పరిస్థితులు నెలకొన్నాయి. వందలాది మంది ప్రాణాలు కోల్పోగా, వెయ్యికి పైగా ప్రజలు గల్లంతయ్యారు. భోటేకోశి, త్రిశూలి నదీ పరీవాహక ప్రాంతాల నుంచి కొట్టుకొస్తున్న మృతదేహాలను భద్రపరచడం, వాటిని గుర్తించడం అధికారులకు సవాలుగా మారింది. వరద తీవ్రతకు మృతదేహాలు నదీ ప్రవాహాల్లో చాలా దూరం కొట్టుకుపోతుండటంతో పలు జిల్లాల్లోని మార్చురీలు నిండిపోయాయి. ‘ది ఖాట్మండు పోస్ట్’ నివేదిక ప్రకారం.. నువాకోట్, చిత్వాన్, తనహున్, నవల్‌పరాసి తదితర సెంట్రల్ నేపాల్ జిల్లాల్లో వరదల్లో కొట్టుకొచ్చిన మృతదేహాలను వెలికితీస్తున్నారు.
చిత్వాన్‌లో తాత్కాలిక భద్రతా కేంద్రం
నదీ తీర ప్రాంతమైన చిత్వాన్‌లో అత్యధికంగా మృతదేహాలు బయటపడుతున్నాయి. త్రిశూలి, నారాయణి నదుల పరిధిలో గురువారం ఉదయానికి 137 మృతదేహాలను గుర్తించారు. అక్కడి మార్చురీల సామర్థ్యం 30 నుంచి 50 మృతదేహాలు మాత్రమే కావడంతో.. భరత్‌పూర్‌లోని ఒక నిరుపయోగ ప్రభుత్వ భవనాన్ని తాత్కాలిక భద్రతా కేంద్రంగా మారుస్తున్నారు.ఈ తాత్కాలిక కేంద్రంలో దాదాపు 250 మృతదేహాలను భద్రపరిచే అవకాశం ఉంది.
మృతదేహం నుంచి చెవి దుద్దులు కాజేత
వరదలో కొట్టుకొచ్చిన ఓ మహిళ మృతదేహాన్ని నది ఒడ్డుకు లాగి, ఆమె చెవులకు ఉన్న బంగారు దుద్దులను దొంగిలించిన అమానవీయ ఘటన నేపాల్‌లో కలకలం రేపింది. నారాయణి నదిలో కొట్టుకువచ్చిన ఓ మహిళ మృతదేహాన్ని కొయ్య కర్రలతో ఆమె జుట్టు పట్టుకుని నీటిలోంచి ఒడ్డుకు లాగిన ఇద్దరు వ్యక్తులు.. ఆమె రెండు చెవుల పోగులను లాగేసుకున్నారు. నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు.
