- రూ.13 లక్షల కోట్ల భారీ వాల్యుయేషన్
న్యూఢిల్లీ: రిలయన్స్ ఇండస్ట్రీస్ సబ్సిడరీ జియో ప్లాట్‌ఫామ్స్ ఐపీఓకి మార్కెట్ రెగ్యులేటరీ సెబీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ ఇష్యూ ద్వారా 4 బిలియన్ డాలర్లు (దాదాపు రూ.38,400 కోట్లు) సమీకరించాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది. భారత స్టాక్ మార్కెట్ చరిత్రలోనే ఇది అతిపెద్ద ఐపీఓగా రికార్డు సృష్టించనుంది. జియో 27 కోట్ల కొత్త ఈక్విటీ షేర్లను ఐపీఓలో అమ్మనుంది. ఇది మొత్తం ఈక్విటీలో దాదాపు 2.9శాతం వాటాకు సమానం.
దాదాపు 137 బిలియన్ డాలర్ల (దాదాపు రూ.13.15 లక్షల కోట్ల) భారీ వాల్యుయేషన్ దగ్గర ఈ నిధులను సమీకరించనున్నారు. ఐపీఓ ద్వారా సేకరించిన నిధుల్లో మెజార్టీ వాటాను జియో ఇన్ఫోకామ్ అప్పులు తీర్చడానికి, సాధారణ కార్పొరేట్ అవసరాలకు వినియోగిస్తారు. 2008 తర్వాత రిలయన్స్ గ్రూప్ నుంచి వస్తున్న మొట్టమొదటి పబ్లిక్ ఇష్యూ ఇదే కావడం విశేషం.
ప్రస్తుతం జియో ప్లాట్‌ఫామ్స్‌లో రిలయన్స్ ఇండస్ట్రీస్‌కు 66.43శాతం, మెటా, గూగుల్‌లకు కలిపి 17.71శాతం వాటాలు ఉన్నాయి. మిగిలిన వాటా కేకేఆర్, జనరల్ అట్లాంటిక్ వంటి అంతర్జాతీయ ఇన్వెస్టర్ల వద్ద ఉంది. ఈ మెగా ఐపీఓపై మార్కెట్ వర్గాల్లో తీవ్ర ఆసక్తి నెలకొంది.
మరో 6 కంపెనీలకూ అనుమతి
జియోతో పాటు మరో ఆరు కంపెనీలకు సెబీ అనుమతులిచ్చింది. పారాస్ హెల్త్‌కేర్, భారత్ పీఈటీ, సద్భవ్ ఫ్యూచర్‌టెక్, ఎంకే సన్స్ ఫైన్ జ్యువెల్స్, పారామోటార్ డిజిటల్ టెక్నాలజీ, పుష్ప్ బ్రాండ్స్ కంపెనీలు త్వరలో ఐపీఓకి రానున్నాయి. పారాస్ హెల్త్‌కేర్ రూ.1,800 కోట్లను, భారత్ పీఈటీ రూ.760 కోట్లను సేకరించనున్నాయి.
