వాట్సాప్, మెయిల్ ద్వారా సమస్యలు తెలిపినా స్పందించాలి: మంత్రి జూపల్లి కృష్ణారావు

వాట్సాప్, మెయిల్ ద్వారా సమస్యలు తెలిపినా స్పందించాలి: మంత్రి జూపల్లి కృష్ణారావు

వనపర్తి/పాన్​ గల్​, వెలుగు :   ప్రజలు తమ సమస్యలను వాట్సాప్, మెయిల్ ద్వారా తెలిపినప్పటికీ, సంబంధిత శాఖల అధికారులు స్పందించి వాటిని వారం రోజుల్లోగా పరిష్కరించాలని ఎక్సైజ్, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ఆదేశించారు. వనపర్తి జిల్లా పాన్ గల్ హైస్కూల్ లో శుక్రవారం నిర్వహించిన గ్రామసభలో ఆయన అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. గత రెండున్నరేండ్లలో వచ్చిన దరఖాస్తులు, పెండింగ్ ఫిర్యాదులపై ఆరా తీసిన మంత్రి, రెవెన్యూ, ఇతర శాఖలకు సంబంధించిన పలు సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించారు. 

సాంకేతికత విపరీతంగా పెరిగిన ఈ రోజుల్లో ప్రజలు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ చెప్పులరిగేలా తిరగాల్సిన అవసరం లేదని, విద్యార్థుల ధ్రువీకరణ పత్రాలను రెండు మూడు రోజుల్లోనే జారీ చేయాలని స్పష్టం చేశారు. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలపై ప్రత్యేకంగా సమీక్షించిన మంత్రి, ఆర్థిక స్థోమత లేక ఇండ్లు ప్రారంభించని లబ్ధిదారుల జాబితాను సిద్ధం చేసి తదుపరి సమావేశంలోగా బ్యాంకు రుణాలు ఇప్పించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. 

ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పనిచేసి ప్రజల సమస్యలను క్షేత్రస్థాయిలో పరిష్కరించాల్సిన బాధ్యత ఎంతైనా ఉందని పేర్కొన్నారు. కలెక్టర్ ఆదర్శ్ సురభి మాట్లాడుతూ గ్రామ స్థాయి సమస్యలు అక్కడికక్కడే పరిష్కారమయ్యేలా అధికారులు బాధ్యత వహించాలని సూచించారు.  

సమావేశంలో అడిషనల్​ కలెక్టర్ ఖీమ్యా నాయక్, ఆర్డీఓ సుబ్రహ్మణ్యం, డీఆర్​ఓ  తిరుపతయ్య, తహసీల్దార్ కార్తీక్, ఎంపీడీఓ గోవిందా రావు,  గ్రంధాలయ సంస్థ చైర్మన్ గోవర్ధన్ సాగర్, పాన్​గల్ సర్పంచ్ నాగలక్ష్మి, జిల్లా అధికారులు, మండల అధికారులు, పాల్గొన్నారు.