- తమ ఆఫ్‌షోర్ ట్యాలెంట్‌తో లాభాల బాట పట్టించే ప్లాన్
- తాజాగా పోర్షే నుంచి ఎంహెచ్‌పీని దక్కించుకున్న టీసీఎస్
న్యూఢిల్లీ: ఇండియన్ కంపెనీలు యూరప్‌లో షాపింగ్ మొదలు పెట్టాయి. అక్కడ విస్తరించేందుకు ఐటీ కంపెనీలను వరుసపెట్టి కొనుగోలు చేస్తున్నాయి. ముఖ్యంగా ఆటో కంపెనీలకు సేవలందించే ఐటీ సబ్సిడరీలను తక్కువ ధరకే దక్కించుకుంటున్నాయి. చైనా ఈవీల నుంచి పోటీ పెరగడం, లాభాలు పడిపోవడం, ఈవీలకు డిమాండ్ తగ్గడం వంటి కారణాలతో యూరప్ ఆటోమొబైల్ ఇండస్ట్రీ తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది.
ఈ నష్టాల నుంచి గట్టెక్కడానికి, నగదు నిల్వలను పెంచుకోవడానికి కార్ల తయారీ కంపెనీలు తమ ఐటీ, సాఫ్ట్‌వేర్, డిజిటల్ ఇంజనీరింగ్ విభాగాలను అమ్మేస్తున్నాయి. భారత ఐటీ కంపెనీలు ఈ అవకాశాన్ని అందిపుచ్చుకుంటూ, ఈ టెక్ కంపెనీలను తక్కువ ధరలకే కొనుగోలు చేస్తున్నాయి. ఇటీవల పోర్షేకు చెందిన ఐటీ కన్సల్టింగ్ సబ్సిడరీ ఎంహెచ్‌పీని టీసీఎస్ 320 మిలియన్ పౌండ్లకు కొనుగోలు చేసింది. నగారోను 1.27 బిలియన్ పౌండ్లకు పెర్సిస్టెంట్ సిస్టమ్స్ కొనుగోలు చేసింది. ఇన్-టెక్ సంస్థను 450 మిలియన్ పౌండ్లకు ఇన్ఫోసిస్ దక్కించుకుంది. ఇటాల్‌డిజైన్‌ను యూఎస్‌టీ కొనుగోలు చేసింది.
యూరప్‌లో సంక్షోభం
యూరోపియన్ ఆటో మొబైల్ కంపెనీలకు చైనా బ్రాండ్ల నుంచి పోటీ పెరిగింది. యూరోపియన్ ఆటోమొబైల్ అసోసియేషన్ (ఏసీఈఏ) డేటా ప్రకారం.. ఈవీ మార్కెట్లో బీవైడీ, చెరీ, ఎస్‌ఏఐసీ వంటి చైనా బ్రాండ్ల వాటా 2025 జనవరి–ఏప్రిల్‌లో 3.7శాతం ఉండగా, ఈ ఏడాది జనవరి–ఏప్రిల్‌లో రికార్డు స్థాయిలో 7.3శాతానికి రెట్టింపైంది. ఇదే టైమ్‌లో ఫోక్స్‌వ్యాగన్ నెట్ ప్రాఫిట్ 33శాతం పడిపోయి 1.54 బిలియన్ పౌండ్లకు చేరింది.
డిమాండ్ లేకపోవడంతో ఫోక్స్‌వ్యాగన్ ప్లాంట్లను మూసేయడం, లక్ష మంది వరకు ఉద్యోగులను తొలగించడం వంటివి చేపట్టింది. మరోవైపు పేరెంట్ కంపెనీ కోసం పనిచేసే ఇంటర్నల్ ఐటీ విభాగాలు జెనరేటివ్ ఏఐ, కంప్యూట్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌పై భారీ నిధులు వెచ్చించలేకపోతున్నాయి. ఫలితంగా ఖర్చులను తగ్గించుకోవడానికి తమ ఐటీ విభాగాలను ఔట్‌సోర్సింగ్‌కు అప్పగిస్తున్నాయి.
యూరోపియన్ క్లయింట్లను నేరుగా ఆకర్షించడం కష్టం కావడంతో, ఈ టెక్ కంపెనీలను కొనుగోలు చేసేందుకు ఇండియన్ కంపెనీలు ఆసక్తి చూపిస్తున్నాయి. దీంతో యూరప్ మార్కెట్‌లో విస్తరించడం ఈజీ అవుతుంది. తమ బలమైన ఆఫ్‌షోర్
ట్యాలెంట్, ఏఐ టూల్స్ ద్వారా ఖర్చులను తగ్గించి అధిక లాభాలు పొందాలని భారత కంపెనీలు ప్లాన్ చేస్తున్నాయి.
ఇండియన్ కంపెనీల డీల్స్
- పోర్షే గ్రూప్‌కు చెందిన సొంత ఐటీ, మేనేజ్‌మెంట్ కన్సల్టింగ్ సబ్సిడరీ ఎంహెచ్‌పీ కంపెనీని టీసీఎస్ కొనుగోలు చేసింది.
- జర్మనీకి చెందిన ఆటోమోటివ్ ఇంజనీరింగ్, టెస్టింగ్ సర్వీసెస్ కంపెనీ ఇన్‌టెక్‌ను ఇన్ఫోసిస్ దక్కించుకుంది.
- హెచ్‌సీఎల్‌టెక్ అయితే ఏఎస్ఏపీ గ్రూప్‌ను 251 మిలియన్ పౌండ్లకు కొనుగోలు చేసింది. ఈ జర్మన్ ఆటోమోటివ్ కంపెనీ మొబిలిటీ, అటానమస్ డ్రైవింగ్ సొల్యూషన్స్‌ను అందిస్తోంది.
- ఆటోమోటివ్ ప్రొటోటైపింగ్ సర్వీసులు అందించే టెక్నికా గ్రూప్‌ను (80 మిలియన్ పౌండ్లు), ఫ్యూచర్ మొబిలిటీని (15 మిలియన్ పౌండ్లు) కేపీఐటీ చేజిక్కించుకుంది.
- ఆటోమోటివ్ ఎలక్ట్రానిక్స్, టెస్టింగ్ సేవలందించే ఈఎస్‌టెక్‌ను టాటా టెక్నాలజీస్ 75 మిలియన్ పౌండ్లకు కొనుగోలు చేసింది.
- బ్యాంకింగ్, లాజిస్టిక్స్ వంటి వివిధ రంగాలకు సేవలందించే నగారోను పెర్సిస్టెంట్ సిస్టమ్స్ దక్కించుకుంది.
