గరిడేపల్లి/హుజూర్ నగర్ , వెలుగు: సూర్యాపేట జిల్లా ప్రజలకు ఆధార్ సేవలను మరింత సులభతరం చేసేందుకు నగరంలోని విద్యానగర్‌లో ఏర్పాటు చేసిన నూతన ఆధార్ సేవా కేంద్రాన్ని కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ శుక్రవారం ప్రారంభించారు. డి-మార్ట్ ఎదురుగా ప్రారంభమైన ఈ కేంద్రం ద్వారా జిల్లా ప్రజలు ఇకపై హైదరాబాద్‌కు వెళ్లాల్సిన అవసరం లేకుండా అన్ని రకాల ఆధార్ సేవలను పొందవచ్చని కలెక్టర్ తెలిపారు.
కొత్త ఆధార్ నమోదుతో పాటు 5 నుంచి నుంచి 7 ఏండ్లు, 15 నుంచి 17 ఏండ్ల వయస్సు గల వారికి తప్పనిసరి బయోమెట్రిక్ నవీకరణ ఉచితంగా ఉంటుందని, 7 నుంచి 15 సంవత్సరాల వయస్సు పిల్లలకు 2026 సెప్టెంబర్ 30 వరకు ఈ సేవ ఉచితంగా లభిస్తుందని పేర్కొన్నారు. ఉద్యోగులు, విద్యార్థులు, సీనియర్ సిటిజన్ల సౌలభ్యం కోసం ఈ కేంద్రం ఆదివారాల్లో కూడా పనిచేస్తుందని, ఆన్‌లైన్ అపాయింట్‌మెంట్ సౌకర్యం కూడా అందుబాటులో ఉందని వెల్లడించారు.
మోడల్ కాలనీ పనుల్లో స్పీడు పెంచాలి
హుజూర్ నగర్ పట్టణంలోని రామస్వామి గుట్ట వద్ద నిర్మిస్తున్న మోడల్ కాలనీ డబుల్ బెడ్రూమ్ ఇండ్ల నిర్మాణ పనులను కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ అధికారులతో కలిసి పరిశీలించారు. ప్రతి బ్లాక్‌ను క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఇండ్లలోని చిన్నచిన్న లోపాలను వెంటనే సరిదిద్దాలని కాంట్రాక్టర్లు, అధికారులను ఆదేశించారు.
ఇండ్లతో పాటు డ్రైనేజీ, తాగునీరు, రోడ్లు వంటి మౌలిక వసతుల కల్పన పనులతో పాటు తెలంగాణ పబ్లిక్ స్కూల్, అంగన్వాడీ కేంద్రాలు, కమ్యూనిటీ హాళ్ల నిర్మాణాలను వేగవంతం చేయాలని స్పష్టం చేశారు.
