- ఒక్కో నియోజకవర్గంలో 480 ఫ్లాట్లకు 600 మంది ఎంపిక
- ఎవరైనా అనర్హులుగా తేలితే 120 మంది నుంచి చాన్స్
- నాంపల్లి, రాజేంద్రనగర్ డ్రాలో పాల్గొన్న మంత్రి పొంగులేటి
- అర్హులైన ప్రతి పేదకు ఇందిరమ్మ ఇల్లు ఇస్తాం
- రూపాయి ఖర్చు లేకుండా ఫ్రీగా రిజిస్ట్రేషన్ చేస్తామని వెల్లడి
హైదరాబాద్, వెలుగు: ‘క్యూర్’ పరిధిలో ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల ఎంపికకు లక్కీడ్రా ప్రారంభమైంది. నాంపల్లి, కుత్బుల్లాపూర్, సికింద్రాబాద్, రాజేంద్రనగర్ అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఇందిరమ్మ టవర్స్ ఫ్లాట్ల కోసం శుక్రవారం లక్కీడ్రా నిర్వహించారు. నాంపల్లి నియోజకవర్గంలోని రెడ్‌హిల్స్‌లో నిర్మించనున్న ఇందిరమ్మ టవర్స్ ఫ్లాట్ల కేటాయింపునకు వెట్ గార్డెన్స్‌లో, రాజేంద్రనగర్ నియోజకవర్గంలోని మైలార్‌దేవుపల్లి పరిధికి సంబంధించి లక్ష్మీగూడలో నిర్వహించిన లక్కీడ్రా కార్యక్రమాల్లో హౌసింగ్‌శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి పాల్గొని డ్రా తీసిన లబ్ధిదారులను ఎంపిక చేశారు. అనంతరం మంత్రి మాట్లాడారు. ప్రజా ప్రభుత్వంలో అర్హులైన ప్రతి పేదకు ఇందిరమ్మ ఇల్లు ఇస్తామని స్పష్టం చేశారు. హైదరాబాద్ నగరంలో పేదల సొంతింటి కలను నిజం చేస్తూ, వారి ఆత్మగౌరవానికి ప్రతీకగా ఇందిరమ్మ టవర్స్ నిలుస్తాయని అన్నారు.
అర్హతే ప్రామాణికంగా.. కులమతాలు, రాజకీయాలు, పొలిటికల్ పార్టీలకు అతీతంగా లబ్ధిదారులను ఎంపిక చేస్తున్నామని చెప్పారు. క్యూర్ పరిధిలో తొలి విడతగా చేపడుతున్న ఇందిరమ్మ టవర్స్‌లో ఫ్లాట్ల కేటాయింపునకు అత్యంత పారదర్శకంగా లక్కీడ్రా నిర్వహిస్తున్నామని మంత్రి తెలిపారు. మీడియా, అర్హులైన లబ్ధిదారుల సమక్షంలో లక్కీడ్రా నిర్వహిస్తూ, మొత్తం ప్రక్రియను మీడియాలో ప్రత్యక్ష ప్రసారం చేస్తున్నామని చెప్పారు. శుక్రవారం నుంచి ఈ నెల 31వ తేదీ వరకు 16 అసెంబ్లీ సెగ్మెంట్లలో 7,340 ఫ్లాట్లకు లక్కీడ్రా నిర్వహిస్తున్నామని తెలిపారు. రోజుకు 4 నియోజకవర్గాల చొప్పున లక్కీడ్రా ప్రక్రియ కొనసాగుతుందన్నారు. ‘ప్రతి నియోజకవర్గంలో 480 ఫ్లాట్లకు 600 మంది లబ్ధిదారులను లక్కీడ్రా ద్వారా ఎంపిక చేస్తున్నాం. అనంతరం అధికారులు క్షేత్రస్థాయిలో తుది పరిశీలన నిర్వహిస్తారు. ఎంపికైన వారిలో ఎవరైనా అనర్హులుగా తేలితే మిగిలిన 120 మందిలోని అర్హులకు అవకాశం కల్పిస్తాం. ఈ విధానం ద్వారా అర్హులైన పేదలకు న్యాయం జరిగేలా చూస్తాం.
సీఎం రేవంత్ రెడ్డి ఈ నెల 13న కూకట్‌పల్లి కేపీహెచ్‌బీ కాలనీలో ఇందిరమ్మ టవర్స్‌కు శంకుస్థాపన చేశారు. క్యూర్ పరిధిలో తొలి విడతగా లక్ష ఇండ్ల నిర్మాణాన్ని లక్ష్యంగా పెట్టుకుని ప్రభుత్వం ముందుకు సాగుతోంది. మరో 4 అసెంబ్లీ నియోజకవర్గాల్లో స్థలాల గుర్తింపు ప్రక్రియ పూర్తయింది. ఆయా నియోజకవర్గాల్లో ఇందిరమ్మ ఇండ్ల కోసం వచ్చేనెల 3వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరిస్తం. మా ప్రభుత్వం ఏర్పడిన తొలి సంవత్సరంలోనే రాష్ట్రవ్యాప్తంగా తొలి విడతలో 4.50 లక్షల ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేశాం. ఇప్పటికే 2 లక్షలకు పైగా ఇండ్ల నిర్మాణాలు పూర్తయ్యాయి. రెండో విడతలో మరో 2.50 లక్షల ఇండ్లను మంజూరు చేసి, లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియను వేగవంతం చేస్తున్నం. మరో 10 రోజుల్లో రెండో విడత లబ్ధిదారుల ఎంపిక కూడా పూర్తి చేస్తాం. ఎకరం రూ.100 కోట్లు, రూ.200 కోట్లు, రూ.300 కోట్లు విలువ చేసే ప్రాంతాల్లోనూ పేద కుటుంబాలు గౌరవంగా జీవించాలి అనేది మా ప్రభుత్వ లక్ష్యం” అని పొంగులేటి తెలిపారు.
ఉచితంగా రిజిస్ట్రేషన్
ఇందిరమ్మ టవర్స్‌లో ఇల్లు పొందిన లబ్ధిదారులకు పైసా ఖర్చు లేకుండా రిజిస్ట్రేషన్ చేసి ఇస్తామని మంత్రి పొంగులేటి తెలిపారు. లక్కీడ్రాలో ఇల్లు పొందిన ప్రతి లబ్ధిదారుడికి సుమారు 525 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఇంటిని నిర్మించి అందిస్తామని మంత్రి చెప్పారు. ఒక్కో ఇంటికి 17 నుంచి 20 గజాల అన్‌డివైడెడ్ షేర్ భూమి ఇస్తున్నామన్నారు. లక్కీడ్రా పూర్తయ్యాక లబ్ధిదారుల తుది ఎంపిక జరుగుతుందని, పరిశీలించాక అధికారులు సర్టిఫికెట్లు ఇస్తారని మంత్రి తెలిపారు. ఆ తర్వాత మూన్నాలుగు రోజుల్లోనే టవర్ల నిర్మాణ పనులు ప్రారంభించేలా చర్యలు తీసుకుంటామన్నారు. లబ్ధిదారులు తమ ఇంటి నిర్మాణ పనులను స్వయంగా పర్యవేక్షించుకునే అవకాశం ఉంటుందని తెలిపారు.
రిజర్వేషన్ల వారీగా అర్హుల ఎంపిక
నాంపల్లి నియోజకవర్గంలో డ్రాకు అర్హులైన సుమారు 3,800 మంది పేర్లను క్యాస్ట్ ఆధారంగా అధికారులు నోటీస్ బోర్డులో ఏర్పాటు చేశారు. కులాలవారీగా అప్లికేషన్లను డివైడ్ చేసి డ్రా తీశారు. నాంపల్లిలో నిర్వహించిన లక్కీడ్రాలో తొలుత ఎస్సీ వర్గానికి కేటాయించిన 14 శాతం రిజర్వేషన్ ప్రకారం 67 ఫ్లాట్ల కోసం 288 మంది పేర్లతో కూడిన చీటీలను డ్రమ్‌లో వేశారు. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, స్థానిక ఎమ్మెల్యే మాజిద్ హుస్సేన్, హౌసింగ్ ఎండీ వీపీ గౌతమ్, కలెక్టర్ ప్రియాంక తదితర అధికారుల సమక్షంలో లబ్ధిదారులతోనే డ్రా తీయించారు. ఎస్సీ విభాగంలో తొలి ఫ్లాట్‌కు మరకాల కృష్ణవేణి ఎంపిక కాగా, అనంతరం టి.అనిత, మంగనూరి అనసూయ, ఎం.కుమారి, శైలజాకుమారి వరుసగా ఫ్లాట్లను లక్కీడ్రా ద్వారా పొందారు. ఎస్సీలకు 14%, ఎస్టీలకు 5%, బీసీలకు16%, దివ్యాంగులకు 5%, పారిశుధ్య కార్మికులు, నాలుగో తరగతి ఉద్యోగులు, అవుట్‌సోర్సింగ్ ఉద్యోగులకు 10% చొప్పున రిజర్వేషన్లు అమలు చేస్తున్నామని వీపీ గౌతమ్ వివరించారు. ఈ ఫ్లాట్లలో మొత్తం 50 శాతం రిజర్వేషన్లు ఉండగా, మొత్తంగా మహిళలకు 30 శాతం రిజర్వేషన్ అమలు చేస్తున్నామన్నారు.
ఇంత తక్కువ ధరకే ఇల్లు ఇచ్చుడు గ్రేట్
ఏండ్ల తరబడి హైదరాబాద్‌లో కిరాయి ఇంట్లో ఉంటున్నం. ఇందిరమ్మ టవర్స్‌లో మాకు ఇల్లు వచ్చింది. చాలా సంతోషంగా ఉంది. సీఎం రేవంత్ రెడ్డికి, మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి కృతజ్ఞతలు. ఇప్పటి ధరలకు హైదరాబాద్‌లో ఇల్లు కొనాలన్నా, కట్టాలన్నా 50 లక్షలకు తక్కువ కావు. ఇలాంటి పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం రూ. 5 లక్షలకే ఇల్లు ఇవ్వడం గొప్ప విషయం.
- వీరేశ్ , రాజేంద్ర నగర్
ఇల్లు దక్కడం సంతోషంగా ఉంది
మా పాప చేతుల మీదుగా ఈ డ్రాను స్టార్ట్ చేశారు. నాకు 5వ సీరియల్‌లో ఫ్లాట్ వచ్చింది. ఇల్లు వస్తుందని అసలు అనుకోలేదు. రాఖీ పండుగనాడు ఇల్లు దక్కడం సంతోషంగా ఉంది. హైదరాబాద్‌లో విలువైన ప్లేస్‌లో తక్కువ ధరకు ఇల్లు ఇవ్వడం సాధారణ విషయం కాదు. రెడ్ హిల్స్‌లో ఇల్లు రూ. 60 లక్షల విలువ చేస్తుంది. ప్రైవేట్ ఎంప్లాయిగా పనిచేస్తున్నాం. హైదరాబాద్‌లో సొంతిల్లు కొనాలని చాలామందికి ఉంటుంది. ఆ కలను ప్రభుత్వం నిజం చేసింది.
- లబ్ధిదారు, నాంపల్లి
