చెన్నూరులో అభివృద్ధి పనులు స్పీడప్ చేయాలి : కలెక్టర్ కుమార్ దీపక్

చెన్నూరులో అభివృద్ధి పనులు స్పీడప్ చేయాలి : కలెక్టర్ కుమార్ దీపక్

చెన్నూరు, వెలుగు: చెన్నూరులో జరుగుతున్న అభివృద్ధి పనులను స్పీడప్​ చేయాలని కలెక్టర్ కుమార్ దీపక్ సూచించారు. చెన్నూరులో అమృత్ 2.0 పథకం కింద కొనసాగుతున్న వాటర్​ట్యాంక్ నిర్మాణ పనులను శుక్రవారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రజలకు తాగునీటి ఇబ్బంది లేకుండా నిత్యం సరఫరా చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. మండల కేంద్రంలో జరుగుతున్న 100 పడకల ఆస్పత్రి ప్రహరీ, ఆస్పత్రిలోని పనులను పరిశీలించి వేగవంతం చేయాలన్నారు. గిరిజన సంక్షేమ బాయ్స్​ హైస్కూల్​లో జరుగుతున్న అదనపు గదుల పనులను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. 

విద్యార్థులకు మెనూ ప్రకారం సకాలంలో పౌష్టికాహారం, శుద్ధమైన తాగునీటిని అందించాలని, విద్యార్థుల ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలన్నారు. సమాచారం లేకుండా విధులకు గైర్హాజరైన టీచర్లకు షోకాజ్ నోటీసులు జారీ చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. తహసీల్దార్ కార్యాలయాన్ని సందర్శించి తహసీల్దార్ మల్లికార్జున్, మున్సిపల్ కమిషనర్ మారుతి ప్రసాద్​తో కలిసి ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియ, రీ సర్వే నిర్వహణ తీరును పరిశీలించారు. నోటీసుల జారీ ప్రక్రియను సమర్థవంతంగా నిర్వహించాలని, బూత్ స్థాయి అధికారులు తమ విధులను సక్రమంగా నిర్వహించేలా అధికారులు పర్యవేక్షించాలని సూచించారు.