న్యూఢిల్లీ: ఇటీవల భారీగా పెరిగిన చక్కెర ధరలు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. మిల్లుల దగ్గర ధరలు గత కొద్ది రోజుల్లో సుమారు 20శాతం తగ్గాయని, రిటైల్ మార్కెట్లలోనూ ఇదే విధంగా ధరలు దిగొస్తాయని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. దేశంలో చక్కెర కొరత లేదని, కేవలం నిల్వలు దాచడం (హోర్డింగ్), స్పెక్యులేషన్ వల్లే ధరలు పెరిగాయని పేర్కొంది. దేశవ్యాప్త తనిఖీల్లో పలు మిల్లులు ప్రకటించిన దానికంటే ఎక్కువ స్టాక్ దాచినట్లు గుర్తించిన ప్రభుత్వం, మార్కెట్లోకి సరఫరా పెంచేందుకు చర్యలు చేపట్టింది.
సెప్టెంబర్ నుంచి ప్రస్తుత నెలవారీ కేటాయింపులకు బదులు 15 రోజుల కోటా విధానం అమలవుతుంది. ప్రభుత్వం మిల్లులకు కేటాయించిన కోటాలో కనీసం 40శాతం మొదటి వారంలోనే అమ్మాలి. అంతేకాకుండా అమ్మకం జరిపిన 7 రోజుల్లో చక్కెరను హోల్‌సేల్ లేదా రిటైల్ వ్యాపారులకు డిస్పాచ్ చేయాలి.
కాగా, చక్కెర పరిశ్రమ ప్రభుత్వ కంట్రోల్లో నడుస్తుంది. గతంలో ప్రతి మిల్లుకు ఇంత కోటా అమ్మాలని నెల నెలా నిర్ణయించేవారు. దీనిని తాజాగా 15 రోజులకు తీసుకొచ్చారు. మరోవైపు అక్టోబర్ 15 నుంచి చెరకు క్రషింగ్ ప్రారంభం కానుండగా, అక్టోబర్‌లో 10 లక్షల టన్నులు, నవంబర్‌లో 45 లక్షల టన్నుల ఉత్పత్తి అంచనా వేస్తున్నారు. కర్ణాటక, మహారాష్ట్ర మిల్లుల నుంచి సెప్టెంబర్‌లోనే 2 లక్షల టన్నుల చక్కెర మార్కెట్లోకి రానుంది. ఈ చర్యలతో మార్కెట్లలో చక్కెర సప్లయ్ పెరిగి ధరలు సాధారణ స్థాయికి చేరుకోనున్నాయి.
