- టీచర్ పై కేసు నమోదు, బోథ్ లో ఘటన
ఆదిలాబాద్టౌన్, వెలుగు : నర్సీరీ స్టూడెంట్ ను ఓ టీచర్ చితకబాదడంతో చెవి, వీపుపై తీవ్ర గాయాలయ్యాయి. ఆదిలాబాద్జిల్లా బోథ్మండల కేంద్రంలోని ఓ ప్రైవేట్ స్కూల్ జరిగిన ఈ ఘటన శుక్రవారం వెలుగుచూసింది. వివరాల్లోకి వెళ్తే... బోధ్ కు చెందిన నరేందర్ రెడ్డి కుమారుడు రుగ్వేద్ రెడ్డి నర్సరీ చదువుతున్నాడు. శుక్రవారం చిన్నారి ఒంటిపై గాయాలు కనిపించడంతో తండ్రి ప్రశ్నించగా.. టీచర్ కొట్టినట్లు చెప్పాడు.
దీంతో చిన్నారి తల్లిదండ్రులు శుక్రవారం టీచర్ ను నిలదీశారు. తాను కొట్టలేదని, ఇద్దరు స్టూడెంట్లు కొట్టుకోవడం వల్లే గాయాలయ్యాయని సమాధానమిచ్చింది. అనంతరం స్కూల్ లోని సీసీ టీవీ ఫుటేజీ పరిశీలించగా.. టీచర్ కొట్టినట్లు తేలింది.
అయినప్పటికీ.. వీడియోలో ఉన్నది తాను కాదని మొదట చెప్పిన టీచర్.. తర్వాత చిన్నారి లెటర్స్ రాయకపోవడం వల్లే కొట్టినట్లు ఒప్పుకుంది. దీంతో స్టూడెంట్ తల్లిదండ్రులు ఫిర్యాదు చేయడంతో టీచర్ పై కేసు నమోదు చేసినట్లు ఎస్సై పురుషోత్తం తెలిపారు.
