- గతేడాది జూన్ వరకు 29,130, ఈ ఏడాది ఆరునెల్లలో 31,891
- 7.15 శాతం పెరిగిన సాధారణ నేరాలు, 46.10 శాతం పెరిగిన నార్కొటిక్స్ కేసులు
- సైబర్ నేరాలు, ఆర్థిక నేరాల్లో తగ్గుదల, మహిళలు, బాలికలపై తగ్గిన నేరాలు
- అర్ధవార్షిక నేర సమీక్షలో గణాంకాలు వెల్లడించిన డీజీపీ సీవీ ఆనంద్
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో ట్రాఫిక్ ఉల్లంఘనలు, నార్కోటిక్స్, సాధారణ నేరాలు పెరుగుతుండగా.. సైబర్, ఆర్థిక, తీవ్ర నేరాలు తగ్గుముఖం పట్టాయి. మహిళలు, చిన్నారులపై నమోదైన కేసుల్లోనూ స్వల్ప తగ్గుదల కనిపించింది. గత మూడేండ్లతో పోల్చితే ఈ ఏడాది మొదటి ఆరు నెలల్లో సైబర్ నేరాలు 13.29 శాతం, ఆర్థిక నేరాలు 13.28 శాతం తగ్గాయి. ట్రాఫిక్ ఉల్లంఘనల కేసులు 9.48 శాతం, సాధారణ నేరాలు 7.28 శాతం పెరిగాయి. మాదకద్రవ్యాల కేసుల్లో 46.10 శాతం పెరుగుదల నమోదైంది. శుక్రవారం డీజీపీ కార్యాలయంలో జరిగిన అర్ధవార్షిక నేర సమీక్షలో డీజీపీ సీవీ ఆనంద్ ఈ వివరాలను వెల్లడించారు.
వృత్తి నైపుణ్యం ప్రదర్శించాలి: డీజీపీ
సీసీటీఎన్‌ఎస్ డేటా 96 శాతం అప్‌డేట్ కావడం అభినందనీయమని డీజీపీ ఆనంద్ అన్నారు. ప్రతి నెల క్రైమ్ రివ్యూ మీటింగ్‌లకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. ఏఐ ఆధారిత అప్లికేషన్లు, సీసీటీఎన్‌ఎస్, టీజీ-కాప్, హాక్‌ఐ తదితర డిజిటల్ వేదికల పనితీరుపై అధికారులు ప్రజెంటేషన్లు ఇచ్చారు. కొత్త చట్టాల అమలు, ఐసీజేఎస్, సైబర్ నేరాల నియంత్రణ, లొంగిపోయిన మావోయిస్టుల పునరావాసంపై సమీక్షించారు.
మూడేండ్లలో మొదటి ఆరు నెలల కేసుల వివరాలు..
రాష్ట్రంలో గత మూడేళ్లలో అన్ని రకాల నేరాల సంఖ్య 7.15 శాతం పెరిగింది. 2023 జులై నుంచి 2024 జూన్ వరకు 2,65,377 కేసులు నమోదుకాగా, 2024 జులై నుంచి 2025 జూన్ వరకు 2,77,938, 2025 జులై నుంచి 2026 జూన్ వరకు 2,84,363 కేసులు నమోదయ్యాయి. ప్రతి లక్ష జనాభాకు నేరాల నమోదు రేటు 481.58 నుంచి 491.59కి పెరిగింది.
ట్రాఫిక్ నేరాల్లో 9.48 శాతం పెరుగుదల..
2023-24లో 29,130 ట్రాఫిక్ కేసులు నమోదుకాగా.. 2025-26లో 31,891కు చేరాయి. మూడేళ్లలో 9.48 శాతం పెరుగుదల నమోదైంది. సైబరాబాద్‌లో 2,882 నుంచి 3,677కు, మల్కాజిగిరిలో 3,213 నుంచి 3,673కు పెరిగాయి. హైదరాబాద్‌లో స్వల్పంగా, వరంగల్‌లో 8.27 శాతం తగ్గాయి. కొమురం భీం ఆసిఫాబాద్‌లో 154 నుంచి 1,115కు చేరడంతో 624.03 శాతం వృద్ధి నమోదైంది. నిర్మల్, నల్గొండ, ఆదిలాబాద్‌లో కేసులు పెరగగా.. భద్రాద్రి కొత్తగూడెం, కామారెడ్డి, వికారాబాద్‌లో తగ్గాయి.
నార్కోటిక్ కేసులు పెరిగాయి..
2023-–24లో 2,026 నార్కోటిక్ కేసులు నమోదుకాగా.. 2025–-26లో 2,960కు పెరిగాయి. సైబరాబాద్‌లో 266 నుంచి 508కు చేరాయి. ఇక్కడ 90.98 శాతం, వరంగల్‌లో 142.31 శాతం వృద్ధి నమోదైంది. ఆదిలాబాద్, నిజామాబాద్, నారాయణపేట, మహబూబ్‌నగర్, జోగులాంబ జిల్లాల్లోనూ కేసులు పెరిగాయి.
మహిళలు, చిన్నారులపై తగ్గిన నేరాలు...
గతేడాది తొలి ఆరు నెలలతో పోల్చితే మహిళలు, చిన్నారులపై నేరాలు 1.54 శాతం తగ్గాయి. గతేడాది 31,593 కేసులు నమోదుకాగా.. ఈసారి జూన్ వరకు 31,108 నమోదయ్యాయి. హైదరాబాద్, సైబరాబాద్, వరంగల్ కమిషనరేట్లలో కేసులు తగ్గగా.. ఫ్యూచర్ సిటీ, ఖమ్మం, ఆదిలాబాద్, మహబూబాబాద్, నారాయణపేట, ములుగులో పెరిగాయి. సైబర్ నేరాలు 13.29 శాతం, ఆర్థిక నేరాలు 13.28 శాతం తగ్గాయి. గ్రేవ్ క్రైమ్ కేసులు 2024-–25లో 7,019 ఉండగా.. 2025-–26లో 6,294కు తగ్గాయి. 10.33 శాతం తగ్గుదల నమోదైంది. హైదరాబాద్‌లో 1,483 నుంచి 1,094కు, సైబరాబాద్‌లో 656 నుంచి 613కు, మల్కాజిగిరిలో 664 నుంచి 549కు తగ్గాయి. ములుగు, నిర్మల్, ఆదిలాబాద్‌లో మాత్రం పెరిగాయి.
ఏటా పెరుగుతున్న సాధారణ నేరాలు..
నాన్-గ్రేవ్ కేసులు 2023-–24లో 2,59,201 ఉండగా.. 2025-–26లో 2,78,069కు చేరాయి. మొత్తంగా 7.28 శాతం పెరిగాయి. ఫ్యూచర్ సిటీ, సైబరాబాద్, మల్కాజిగిరితో పాటు కొమురం భీం ఆసిఫాబాద్, ఆదిలాబాద్, మెదక్, సంగారెడ్డి, నల్గొండ, నారాయణపేటలో కేసులు పెరిగాయి. హైదరాబాద్‌లో 2.77 శాతం తగ్గాయి.
