న్యూఢిల్లీ: న్యూజిలాండ్‌లో టీమిండియా టూర్ నేపథ్యంలో బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకుంది. యంగ్ పేసర్ అకిబ్ నబీకి ఇంగ్లండ్ కౌంటీల్లో స్వల్ప కాలిక కాంట్రాక్ట్ ఇప్పించేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టింది. గత రంజీ సీజన్‌లో 60 వికెట్లు తీసి టాప్ బౌలర్‌గా నిలిచిన నబీని ఇటీవల శ్రీలంకతో జరిగిన టెస్ట్ సిరీస్‌కు ఎంపిక చేశారు. కానీ తుది జట్టులో చోటు దక్కలేదు. దాంతో కివీస్ టూర్ కోసం అతన్ని పూర్తి స్థాయిలో ఫిట్‌నెస్‌తో ఉంచేందుకు బోర్డు సన్నాహాలు మొదలుపెట్టింది.
ఈ క్రమంలో సర్రే క్లబ్‌తో బీసీసీఐ సంప్రదింపులు చేస్తోంది. వీసా ప్రక్రియ పూర్తి కాగానే నబీ ఇంగ్లండ్‌కు పయనం కానున్నాడు. మరో పేసర్ గుర్నూర్ బ్రార్.. దులీప్ ట్రోఫీ సెమీస్‌లో నార్త్ జోన్ తరఫున ఆడనున్నాడు. స్పిన్నర్ మానవ్ సుతార్ ఇప్పటికే వార్విక్‌షైర్ తరఫున రెండు మ్యాచ్‌లు ఆడగా, కుల్దీప్ యాదవ్, ఆర్. సాయి కిశోర్ కౌంటీల్లో ఆడుతున్నారు. కౌంటీల్లో ఆడిన అనుభవం న్యూజిలాండ్ పిచ్‌లపై ఇండియా బౌలర్లకు బాగా ఉపయోగపడుతుందని బీసీసీఐ భావిస్తోంది.
