న్యూఢిల్లీ: ఇండియా స్టార్ జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా ప్రతిష్టాత్మక డైమండ్ లీగ్ ఫైనల్స్‌కు అర్హత సాధించాడు. ఈ సీజన్‌లో కేవలం రెండు టోర్నీల్లో మాత్రమే పాల్గొన్నప్పటికీ స్టాండింగ్స్‌లో ఆరో ప్లేస్‌తో క్వాలిఫై అయ్యాడు. జూన్ 19, ఆగస్టు 21న జరిగిన దోహా, లుసానే డైమండ్ లీగ్ ఈవెంట్లలో రెండో స్థానంలో నిలిచిన నీరజ్ మొత్తం 12 పాయింట్లు సాధించాడు.
గురువారం జ్యూరిచ్‌లో జరిగిన చివరి డీఎల్ పోటీల తర్వాత అర్హత జాబితాను ప్రకటించారు. గతేడాది సెప్టెంబర్ నుంచి వెన్ను నొప్పితో ఇబ్బందిపడ్డ నీరజ్ ఐదు డీఎల్ పోటీలు జరగ్గా మూడింటికి దూరంగా ఉన్నాడు. ఇటీవల జరిగిన గ్లాస్గో కామన్వెల్త్ గేమ్స్‌లో ఫిట్‌గా లేనప్పటికీ 85.83 మీటర్ల త్రోతో సిల్వర్ మెడల్ గెలిచాడు.
తర్వాత లుసానే డైమండ్ లీగ్‌లో 88.05 మీటర్లు విసిరాడు. వచ్చే నెల 5న బ్రస్సెల్స్‌లో డీఎల్ ఫైనల్స్ జరగనున్నాయి. మరోవైపు బుడాపెస్ట్‌లో వచ్చే నెల 11 నుంచి 13 వరకు జరిగే తొలి వరల్డ్ అథ్లెటిక్స్ అల్టిమేట్ చాంపియన్‌షిప్ క్వాలిఫయింగ్ రేసులో నీరజ్, సచిన్ యాదవ్ వరుసగా 7, 8వ స్థానాల్లో ఉన్నారు. 6న తుది జాబితాను ప్రకటించనున్నారు.
