న్యూఢిల్లీ: రక్షా బంధన్ పర్వదినాన్ని దేశవ్యాప్తంగా ప్రముఖులు ఘనంగా జరుపుకున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ తన అధికారిక నివాసమైన 7, లోక్ కల్యాణ్ మార్గ్‌లో పాఠశాల విద్యార్థినులతో కలిసి రాఖీ వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా దేశ ప్రజలకు ప్రధాని శుభాకాంక్షలు తెలుపుతూ.. ఈ పవిత్ర పండుగ ప్రతి ఒక్కరి జీవితంలో ఆనందం, శ్రేయస్సు, విజయాలను తీసుకురావాలని ఆకాంక్షించారు. ఈ వేడుకలకు సంబంధించిన కొన్ని మరువలేని క్షణాలను మోదీ 'ఎక్స్' వేదికగా పంచుకున్నారు.
మరోవైపు, కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ కూడా తన నివాసంలో పాఠశాల విద్యార్థినులు, ఎన్సీసీ క్యాడెట్ల సమక్షంలో రాఖీ వేడుకలు జరుపుకున్నారు. రక్షా బంధన్ పర్వదినం సందర్భంగా కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ దేశ ప్రజలకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. రాహుల్ తన సోదరి ప్రియాంకా గాంధీతో కలిసి ఉన్న ఫొటోను షేర్ చేస్తూ దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు.
ప్రధానికి రాఖీ కట్టిన తెలుగు విద్యార్థిని..
రక్షాబంధన్ వేడుకల్లో ఢిల్లీలో 12వ తరగతి చదువుతున్న తెలుగు విద్యార్థిని సాయి మధుమిత ప్రధాని మోదీకి రాఖీ కట్టారు. ప్రధానికి రాఖీ కట్టే అరుదైన అవకాశం లభించడంపై ఆమె సంతోషం వ్యక్తం చేశారు.
