- 1,545 మందిని రక్షించిన రెస్క్యూ టీమ్స్
- వీరిలో 85 మంది భారతీయులు
- ఇంకా 320 మంది
- ఇండియన్లు మిస్సింగ్
- చైనా వైపు చిక్కుకున్న
- 400 మంది సేఫ్.. వీరిలో
- 96 మంది నేపాల్‌కు తరలింపు
- ఢిల్లీకి చేరుకున్న 21 మంది
న్యూఢిల్లీ/కఠ్మాండు: నేపాల్‌లో ఆకస్మిక వరదల కారణంగా మృతిచెందిన వారి సంఖ్య శుక్రవారం నాటికి 547కు చేరిందని నేపాల్ పోలీసులు తెలిపారు. ఎనిమిది జిల్లాల నుంచి 547 మృతదేహాలను వెలికితీసినట్టు చెప్పారు. ఇంకా వేలాది మంది గల్లంతైనట్టు ప్రకటించారు. ఈస్ట్ నవల్‌పరాసి నుంచి 134 డెడ్‌బాడీలు, వెస్ట్నవల్పరాసి పశ్చిమ నుంచి 28, చిత్వాన్ నుంచి 221, గోర్ఖా నుంచి 44, నువాకోట్ నుంచి 38, ధాడింగ్ నుంచి 40, తను నుంచి 29, రసువా నుంచి 13 మృతదేహాలను వెలికితీసినట్టు వెల్లడించారు.
అలాగే, టిబెట్ అటానమస్ రీజియన్‌లోని గైరాంగ్ కౌంటీలో ఐదుగురు మరణించినట్టు చైనా అధికారులు తెలిపారు. అదే విధంగా వివిధ ప్రభావిత ప్రాంతాల నుంచి 1,545 మందిని రక్షించామని, వారిలో 84 మంది కఠ్మాండులోని వివిధ ఆస్పత్రుల్లో ట్రీట్మెంట్ పొందుతున్నారని వివరించారు. శుక్రవారం మధ్యాహ్నం వరకు వివిధ వరద ప్రభావిత ప్రాంతాల నుంచి 85 మంది భారతీయులు, 9 మంది దక్షిణ కొరియన్లు, 16 మంది చైనా జాతీయులతో సహా 121 మంది విదేశీ పర్యాటకులను రక్షించినట్టు నేపాల్ టూరిజం బోర్డు తెలిపింది.
మూడో రోజైన శుక్రవారం 2,391 మంది నేపాల్ ఆర్మీ సిబ్బందితో సహా 7,451 మంది భద్రతా సిబ్బందిని మోహరించి గాలింపు, సహాయక చర్యలు చేపడుతున్నట్టు పోలీసు శాఖ ఓ ప్రకటన తెలిపింది. వరదల్లో చాలా మృతదేహాలు దిగువ ప్రాంతాలకు కొట్టుకుపోయాయి. దీంతో అనేక ప్రాంతాల్లోని ఆస్పత్రుల్లో మార్చురీలు డెడ్‌బాడీలతో నిండిపోతున్నాయి.
కాగా, ప్రకృతి వైపరీత్యం తరువాత తలెత్తిన పరిస్థితి దృష్ట్యా ఈ నెల 29 నుంచి అన్ని పరీక్షలను నిలిపివేయాలని నేపాల్ ప్రభుత్వం నిర్ణయించింది. ఆకస్మిక వరదల వల్ల ప్రభావితమైన వ్యక్తులు, వ్యాపారాల కోసం సహాయ, పునరావాస ప్యాకేజీని సిద్ధం చేయాలని మంత్రివర్గం ఆర్థిక మంత్రిత్వ శాఖను ఆదేశించింది.
320 మంది భారతీయులు గల్లంతు
నేపాల్, టిబెట్ సరిహద్దు ప్రాంతంలో సంభవించిన ఆకస్మిక వరదల్లో 320 మంది భారతీయులు గల్లంతయ్యారని విదేశాంగ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. అలాగే, చైనా వైపు మరో 400 మంది ఇండియన్లు చిక్కుకుపోయినట్టు శుక్రవారం తెలిపింది. అయితే, వారంతా సురక్షితంగా ఉన్నారని పేర్కొంది. వీరితో పాటు కైలాస మానససరోవర యాత్రకు వెళ్లి.. వేరే దేశాల పౌరసత్వం కలిగి ఉన్న మరో 100 మంది భారతీయ సంతతి వ్యక్తుల ఆచూకీ కూడా ఇంకా తెలియరాలేదని విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి రణ్‌ధీర్ జైస్వాల్ చెప్పారు.
చైనా వైపు చిక్కుకుపోయిన 96 మంది భారతీయ పౌరులు రోడ్డు మార్గం ద్వారా సురక్షితంగా నేపాల్‌లోకి ప్రవేశించారని తెలిపారు. నేపాల్ చేపడుతున్న సహాయక చర్యలకు తమ వంతు సాయం అందించేందుకు భారత్ సిద్ధంగా ఉందని స్పష్టం చేసింది. నేపాల్‌లోని వరద ప్రభావిత ప్రాంతాల నుంచి గురువారం ఖాట్మాండు చేరుకున్న 21 మంది ఇండియన్లు శుక్రవారం ప్రత్యేక విమానంలో ఢిల్లీకి చేరుకున్నారు. తమిళనాడుకు చెందిన ఈ ప్రయాణికులను ఎయిర్‌పోర్టులో విదేశాంగ మంత్రి జైశంకర్ స్వాగతించారు.
నేపాల్ అధికారులు ప్రకారం.. బుధవారం నాటి వరదలలో మరణించిన వారి సంఖ్య 538కి చేరింది. సహాయక చర్యలు కొనసాగుతుండటంతో మరిన్ని మృతదేహాలు లభ్యమవుతున్నాయి. చైనా వైపు సుమారు 400 మంది భారతీయులు చిక్కుకు పోయారని, వారంతా సురక్షితంగా ఉన్నారని రణ్‌ధీర్ జైస్వాల్ తెలిపారు. వారు తమ కుటుంబ సభ్యుల తో టచ్‌లో ఉన్నారని, బీజింగ్‌లోని మన రాయబార కార్యాలయం ఏర్పాటు చేసిన హెల్ప్‌లైన్ నంబర్ల ద్వారా అనేక మంది కుటుంబ సభ్యులు తమను సంప్రదించారని చెప్పారు.
చైనాలోని స్థానిక అధికారులతో మన రాయబార కార్యాలయం సంప్రదింపులు జరుపుతోందని, అక్కడ చిక్కుకున్న వారిని సురక్షితంగా వెనక్కి తీసుకురావడానికి ఏర్పాట్లు చేస్తున్నట్టు వెల్లడించారు. నేపాల్ వరదల నేపథ్యంలో విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ సీనియర్ అధికారులతో ఉన్నత స్థాయి సమావేశాన్ని నిర్వహించారు. గల్లంతయిన భారతీయుల ఆచూకీ తెలుసుకోవడంపై ఈ సమావేశంలో ప్రధానంగా చర్చించారు. కాఠ్మాండూ, బీజింగ్ లోని భారత రాయబారులు ఈ సమావేశంలో వర్చువల్ ద్వారా పాల్గొన్నారు.
