- ఆరుగురు కాంట్రాక్టర్ల దరఖాస్తులు.. పరిశీలిస్తున్న అధికారులు
- 4.36 కోట్ల చేప పిల్లల పంపిణీ లక్ష్యం
- 1,712 చెరువుల్లో చేప పిల్లల పెంపకం
సిద్దిపేట, వెలుగు : సిద్దిపేట జిల్లాలోని ఉచిత చేప పిల్లల పంపిణీకి అధికారులు రంగం సిద్ధం చేస్తున్నారు. వర్షాలు లేక కొంత ఆలస్యమైనా జిల్లాలో1,712 చెరువులతో పాటు రంగనాయక సాగర్, మల్లన్న సాగర్, కొండ పొచమ్మ సాగర్ రిజర్వాయర్ల లో దాదాపు 4.36 కోట్ల చేప పిల్లలను వదలడానికి కసరత్తు ప్రారంభించారు. జిల్లాలో మొత్తం 379 మత్స్యకార సొసైటీలుండగా, దాదాపు 25 వేల మంది సభ్యులున్నారు. మత్స్యకారుల జీవనోపాధితో పాటు వారి అభివృద్ధికి దొహదపడేలా రూ.1.73 కోట్ల 40 ఎంఎం, రూ.2.63 కోట్ల 100 ఎంఎం సైజుల్లో చేప పిల్లల చెరువుల్లో వదలనున్నారు.
ఇందు కోసం ఇటీవలే టెండర్ల ను స్వీకరించగా, ఆరుగురు కాంట్రాక్టర్లు దరఖాస్తు చేసుకున్నారు. దాఖలైన టెండర్ల ను పరిశీలించి వాటిని ఖరారు చేసే పనిలో అధికారులు వున్నారు. రెండు సంవత్సరాలుగా చేప పిల్లల పంపిణీ అంతంత మాత్రంగా జరగగా, ఈ ఏడాది పకడ్బందీగా నిర్వహించాలని అధికారులు నిర్ణయించారు. గతేడాది జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో మాత్రమే దాదాపు రెండు కోట్ల చేప పిల్లలను వదిలారు. గతంలో జిల్లాలో చేప పిల్లల పంపిణీ సరైన విధంగా జరగక పోవడంతో మత్స్య కారులకు ఆర్థిక సహాయం చూడా చేయాలనే డిమాండ్ తెరపైకి వచ్చింది.
ఆశించిన వర్షాలు లేక ఆలస్యం..
గతంలో ఆగస్టు నెల నెటికి చెరువుల్లో చేప పిల్లల పంపిణీ ప్రక్రియ ను ప్రారంభించే వారు కానీ, ఈసారి ఆశించిన స్థాయిలో వర్షాలు లేక పోవడంతో ఈ ప్రక్రియ ఆలస్యమైంది. ఇటీవల కురిసన వర్షాలతో ప్రస్తుతం జల వనరుల్లో నీరు చేరింది. చెరువుల విస్తీర్ణాన్ని బట్టి చిన్న, పెద్ద సైజు చేప పిల్లలను వదలనున్నారు. జిల్లాలోని మూడు జలాశయాల్లో చేప పిల్లలతో పాటు రొయ్యల పెంపకం పై ఈఏడాది దృష్టి
సారించారు.
పరిశీలనలో టెండర్ దరఖాస్తులు
ఈనెల 20తో చేప పిల్లల పంపిణీ కి దరఖాస్తు కు గడువు ముగియడంతో అందిన దరఖాస్తులను అధికారులు పరిశీలించనున్నారు. ఇప్పటి వరకు చేప పిల్లల పంపిణీకి ఆరుగురు దరఖాస్తులు చేయగా వారి సామర్థ్యం, పనితీరును అధికారులు క్షేత్ర స్థాయిలో పరిశీలించనున్నారు. టెండరు పొందిన తరువాత సకాలంలో చేప పిల్లలను చెరువుల్లోకి వదలక పోతే ఇబ్బందులు ఎదురవుతాయని, ఈసారి వర్షలేమి కారణంగా సకాలంలో చేప పిల్లల పంపిణీని పూర్తి చేయాలని అధికారులు భావిస్తున్నారు.
చేప పిల్లలను చెరువుల్లో వదిలిన తరువాత వాటి పర్యవేక్షణ ఆయా ప్రాంతాల్లోని మత్స్యకార సొసైటీలకు అప్పగిస్తారు. సెప్టెంబరు చివరి నాటికి చేప పిల్లలను వదిలిపెడితే వచ్చే ఏడాది జనవరి నాటికి మంచి సైజులో చేపలు పెరిగే అవకాశం వుంటుందని మత్స్యకారులు పేర్కొంటున్నారు.
