- ఆన్‌లైన్‌లో అప్లయ్ చేసుకున్న స్టూడెంట్లకు మెరిట్ ఆధారంగా సీట్ల కేటాయింపు
- పేరెంట్స్ హెడ్ ఆఫీస్‌కు రావొద్దు.. ప్రిన్సిపాళ్లను సంప్రదించాలి: బీసీ గురుకుల సెక్రటరీ సైదులు
హైదరాబాద్, వెలుగు: బీసీ గురుకుల సొసైటీలో సీట్ల భర్తీ పారదర్శకంగా చేపడుతున్నామని సెక్రటరీ సైదులు తెలిపారు. ఎంట్రన్స్, మెరిట్ ఆధారంగా స్టూడెంట్లకు సీట్లు కేటాయించామని, మిగిలిన సీట్లను కూడా భర్తీ చేస్తున్నామని చెప్పారు. ‘వెలుగు’లో శుక్రవారం ప్రచురితమైన ‘గురుకులాల అడ్మిషన్లపై గందరగోళం’ కథనంపై ఆయన ప్రకటన విడుదల చేశారు. పేరెంట్స్ ఆఫీసుల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా.. తమ ఊరు, గ్రామం నుంచే https://mjptbcwreishms.cgg.gov.in/Index.do ఆన్‌లైన్‌లో అప్లై చేసుకునే అవకాశం కల్పించామన్నారు.
ఇప్పటివరకు 505 అప్లికేషన్లురాగా.. వాటికి సీట్లు కేటాయించామని తెలిపారు. ఒక స్కూల్ నుంచి మరో స్కూల్‌కు సీటు మార్చుకోవాలంటే హెడ్ ఆఫీస్‌కు రావాల్సిన అవసరం లేదని.. ప్రిన్సిపాళ్లకు అప్లై చేసుకోవాలని సూచించారు. శుక్రవారం నుంచి వచ్చే నెల 14 వరకు బదిలీకి అవకాశం ఉంటుందన్నారు. అప్లికేషన్లను ప్రిన్సిపాళ్ల ఆర్సీవోలకు పంపాలని ఆదేశించినట్లు చెప్పారు. కొన్ని గురుకులాల్లో సీట్లు ఎక్కువగా నిండిపోగా.. మరికొన్నింటిలో ఖాళీలు ఉన్నందున పేరెంట్స్ అభ్యర్థనలను పరిశీలిస్తున్నామన్నారు. దళారుల బెడద లేకుండా ఆన్‌లైన్ విధానంలో సీట్లను భర్తీ చేస్తున్నామని సైదులు తెలిపారు.
