ఇకపై ఏడాదికి మూడుసార్లు ఎఫ్ఎంజీఈ పరీక్ష..రెండు విడతల విధానానికి స్వస్తి పలికిన ఎన్బీఈఎంఎస్

ఇకపై ఏడాదికి మూడుసార్లు ఎఫ్ఎంజీఈ పరీక్ష..రెండు విడతల విధానానికి స్వస్తి పలికిన ఎన్బీఈఎంఎస్
  •     అక్టోబర్ 31న అదనపు ఎఫ్ఎంజీఈ ఎగ్జామ్ నిర్వహణ 
  •     వచ్చే ఏడాది జనవరిలో  జరగనున్న  పరీక్షకు రీషెడ్యూల్
  •     ఉత్తర్వులు జారీ చేసిన నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్

హైదరాబాద్, వెలుగు: విదేశాల్లో ఎంబీబీఎస్ పూర్తి చేసిన భారతీయ విద్యార్థులకు నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఇన్ మెడికల్ సైన్సెస్ (ఎన్​బీఈఎంఎస్) గుడ్ న్యూస్ చెప్పింది. స్వదేశంలో డాక్టర్లుగా ప్రాక్టీస్ చేసేందుకు రాసే ఫారెన్ మెడికల్ గ్రాడ్యుయేట్ ఎగ్జామినేషన్ (ఎఫ్ఎంజీఈ)ను ఇకపై ఏడాదికి మూడుసార్లు నిర్వహించాలని బోర్డు నిర్ణయించింది. ఇప్పటివరకు ఏడాదికి రెండుసార్లు మాత్రమే జరుగుతున్న ఈ పరీక్షలను ఇకపై మూడు విడతల్లో నిర్వహించనున్నారు. దేశవ్యాప్తంగా వివిధ కేంద్రాల్లో కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (సీబీటీ) పద్ధతిలోనే ఈ పరీక్షలు జరగనున్నాయి. ఈ మేరకు ఎన్బీఈఎంఎస్ అధికారిక నోటీస్ జారీ చేసింది.

గతంలో ఆర్నెళ్ల నిరీక్షణ..

ఇప్పటివరకు ఎన్బీఈఎంఎస్ ఈ ఎఫ్ఎంజీఈ పరీక్షను జూన్, డిసెంబర్ సెషన్లలో మాత్రమే నిర్వహించేది. సాధారణంగా మొదటి సెషన్ పరీక్ష జూన్ లేదా జులైలో జరిగేది. దీని ఫలితాలు జులై చివరి వారం లేదా ఆగస్టు మొదటి వారంలో వచ్చేవి. రెండో సెషన్ పరీక్షను డిసెంబర్ లేదా జనవరిలో నిర్వహించి, జనవరి లేదా ఫిబ్రవరిలో ఫలితాలు వెల్లడించేవారు. పరీక్షల మధ్య ఆర్నెళ్ల వ్యవధి ఉండటంతో విద్యార్థులు ఇబ్బందులు పడేవారు. ఏదైనా కారణంతో పరీక్ష రాయలేకపోయినా లేదా ఉత్తీర్ణత సాధించలేకపోయినా మళ్లీ పరీక్ష రాసేందుకు సుదీర్ఘకాలం నిరీక్షించాల్సి వచ్చేది.

ఏడాదికి మూడు విడతలుగా కొత్త షెడ్యూల్..

విద్యార్థుల విలువైన సమయం వృథా కాకుండా ఉండేందుకు బోర్డు పరీక్షల సంఖ్యను మూడింటికి పెంచింది. తాజా మార్పుల ప్రకారం ఇకపై ప్రతి ఏటా డిసెంబర్/జనవరి, ఏప్రిల్/మే, ఆగస్టు/సెప్టెంబర్ నెలల కాలవ్యవధిలో మూడుసార్లు ఎఫ్ఎంజీఈ పరీక్షలు జరగనున్నాయి. ఈ పరీక్షలు ముగిసిన కొద్ది వారాల్లోనే ఫలితాలను విడుదల చేస్తారు. బోర్డు తీసుకున్న తాజా నిర్ణయంలో భాగంగా ఈ ఏడాది అక్టోబర్ 31న అదనపు ఎఫ్ఎంజీఈ పరీక్షను నిర్వహించనున్నారు.

జనవరి 9 పరీక్ష రీషెడ్యూల్..

గతంలో ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం 2027 జనవరి 9న జరగాల్సిన పరీక్షను ఎన్బీఈఎంఎస్ రీషెడ్యూల్ చేసింది. ఆ పరీక్షను జనవరి లేదా ఫిబ్రవరి 2027లో మరో కొత్త తేదీలో నిర్వహించనున్నారు. ఈ పరీక్షలకు సంబంధించిన పూర్తి సమాచారం, ఇన్ఫర్మేషన్ బులెటిన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను త్వరలోనే అధికారిక వెబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సైట్ natboard.edu.in లో అందుబాటులో ఉంచుతామని అధికారులు తెలిపారు. విద్యార్థులకు ఏమైనా సందేహాలుంటే అధికారిక కమ్యూనికేషన్ వెబ్ పోర్టల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను సంప్రదించాలని సూచించారు.