ఫుడ్‌ కల్తీ కేసుల్లో చర్యలు నిల్‌.. కల్తీ అని తేలినా పెండింగ్‌లోనే కేసులు: ఫోరం ఫర్‌ గుడ్‌ గవర్నెన్స్‌ లేఖ

ఫుడ్‌ కల్తీ కేసుల్లో చర్యలు నిల్‌.. కల్తీ అని తేలినా పెండింగ్‌లోనే కేసులు: ఫోరం ఫర్‌ గుడ్‌ గవర్నెన్స్‌ లేఖ

హైదరాబాద్, వెలుగు: గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో ఫుడ్‌ కల్తీ కేసులు నమోదవుతున్నా.. బాధ్యులపై సరైన చర్యలు తీసుకోవడం లేదని ఫోరం ఫర్‌ గుడ్‌ గవర్నెన్స్‌ సెక్రటరీ పద్మనాభరెడ్డి ఆరోపించారు. ఈ మేరకు శుక్రవారం సీఎం రేవంత్‌రెడ్డికి లేఖ రాశారు. అనుమానిత ఆహార పదార్థాల శాంపిల్స్‌ను సేకరించి నాచారంలోని ఫుడ్‌ టెస్టింగ్‌ ల్యాబ్‌కు పంపిస్తుండగా.. పరీక్షల తర్వాత అసురక్షితమైనవి, ప్రమాణాలకు లేనివి, తప్పుడు బ్రాండింగ్‌ ఉన్నవిగా విభజిస్తున్నారని తెలిపారు. అసురక్షిత శాంపిల్స్‌పై కేసులు పెట్టి ప్రాసిక్యూషన్‌ చేయాల్సి ఉండగా.. చాలా కొద్ది కేసుల్లోనే అది జరుగుతోందన్నారు.

మూడేళ్లలో 1,310 అసురక్షితం..

ల్యాబ్‌ రికార్డుల ప్రకారం 2023--–24లో 6,067 శాంపిల్స్‌ పరీక్షించగా 802 అసురక్షితమైనవి, 119 నాసిరకంగా తేలాయి. 2024-–25లో 3,372లో 251 అసురక్షితం, 70 నాసిరకం కాగా.. 2025–-26లో 3,691లో 257 అసురక్షితం, 127 నాసిరకంగా గుర్తించారు. మొత్తంగా 1,310 శాంపిల్స్‌ హానికరంగా తేలాయి.

కేసులపై ట్రాకింగ్‌ ఉండాలి..

అసురక్షిత శాంపిల్స్‌పై ఎన్ని కేసులు పెట్టారు, ఎన్ని ప్రాసిక్యూషన్‌కు వెళ్లాయి, ఎన్ని కేసుల్లో శిక్షలు పడ్డాయి, మిగిలినవి ఎందుకు పెండింగ్‌లో ఉన్నాయో వెల్లడించాలని పద్మనాభరెడ్డి కోరారు. నాసిరకం, తప్పుడు బ్రాండింగ్‌ కేసుల్లో విధించిన జరిమానా ఎంత? ఎంత వసూలు చేశారు? ప్రభుత్వ ఖాతాలో జమ చేశారా? అనే వివరాలు కూడా బయటపెట్టాలన్నారు. కేసులపై పక్కా ట్రాకింగ్‌, పర్యవేక్షణ వ్యవస్థ ఏర్పాటు చేసి.. జరిమానా పూర్తిగా వసూలయ్యే వరకు ఫైళ్లు మూసేయొద్దని సీఎంను కోరారు.