సినీ ఫక్కీలోఈగల్‌‌ ఫోర్స్‌ ‌ 18 గంటల చేజింగ్‌‌.. ఒడిశా నుంచి పంతంగి టోల్‌‌ ప్లాజా దాకా వెంబడింపు

సినీ ఫక్కీలోఈగల్‌‌ ఫోర్స్‌ ‌ 18 గంటల చేజింగ్‌‌.. ఒడిశా నుంచి పంతంగి టోల్‌‌ ప్లాజా దాకా వెంబడింపు
  • ఇద్దరు గంజాయి సప్లయర్ల అరెస్ట్‌‌.. 20.5 కిలోల గంజాయి, కారు స్వాధీనం

హైదరాబాద్‌‌, వెలుగు: ఒడిశా నుంచి హైదరాబాద్‌‌కు గంజాయి తరలిస్తున్న అంతర్రాష్ట్ర ముఠాను తెలంగాణ ఈగల్‌‌ ఫోర్స్‌‌ పోలీసులు సినీ ఫక్కీలో పట్టుకున్నారు. ఖమ్మం ఆర్‌‌ఎన్‌‌సీసీ, స్టేట్‌‌ టాస్క్‌‌ఫోర్స్‌‌, ఈగల్‌‌ ఫోర్స్‌‌, చౌటుప్పల్‌‌ పోలీసులు సంయుక్తంగా చేపట్టిన ఆపరేషన్‌‌లో 20.5 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. 18 గంటలకు పైగా సాగిన ఛేజింగ్‌‌ తర్వాత యాదాద్రి భువనగిరి జిల్లా పంతంగి టోల్‌‌ప్లాజా వద్ద కారును అడ్డుకుని ఒడిశాలోని కేంద్రపారా జిల్లాకు చెందిన తిలోచన్‌‌ సమంత్ర (30), సాగర్‌‌ బాల్‌‌ (23)ను పట్టుకున్నారు. గంజాయి విలువ రూ.10.25 లక్షలు ఉంటుందని అధికారులు తెలిపారు. 

ఒడిశా నుంచి ఛేజింగ్‌‌..

ఈ నెల 26న రాత్రి గంజాయి తరలిస్తున్నట్లు సమాచారం రావడంతో ఈగల్‌‌ బృందాలు నిఘా పెట్టాయి. విశాఖపట్నం జిల్లా  సబ్బవరం వద్ద ఏడు గంటలకు పైగా ఆగిన కారు.. 27న ఉదయం 7.30 గంటలకు హైదరాబాద్‌‌ వైపు బయల్దేరింది. రాజమండ్రి దాటి ఖమ్మం, -సూర్యాపేట మార్గంలోకి రావడంతో పోలీసులు వెంటపడ్డారు. కారు వేగంగా వెళ్తుండటంతో హైవేపై అడ్డుకుంటే ప్రమాదం జరిగే అవకాశం ఉందని భావించారు. ఎస్‌‌టీఎఫ్‌‌కు సమాచారం అందించి.. చౌటుప్పల్‌‌ పోలీసులతో సమన్వయం చేసుకున్నారు. పంతంగి టోల్‌‌ప్లాజా వద్ద వాహనాన్ని అడ్డుకునేందుకు వ్యూహం రూపొందించారు. 

విచారణలో తిలోచన్‌‌, సాగర్‌‌.. ఒడిశాకు చెందిన అమిత్‌‌ సాహానీ నుంచి సుమారు 20 కిలోల గంజాయిని రూ.25 వేలకు కొనుగోలు చేసినట్లు తేలింది. హైదరాబాద్‌‌కు చెందిన బికాష్‌‌ బారిక్‌‌ సూచనతో గంజాయిని తరలిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. గతంలోనూ తిలోచన్‌‌... బికాష్‌‌కు గంజాయి సరఫరా చేసినట్లు వెల్లడైంది. నిందితులపై గతంలో కేసులు ఉన్నట్లు గుర్తించిన పోలీసులు.. ఈ అంతర్రాష్ట్ర నెట్‌‌వర్క్‌‌లో ఇంకా ఎవరెవరు ఉన్నారన్న దానిపై దర్యాప్తు చేస్తున్నారు.