డిజిటల్ వర్సిటీగా అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ..ఘనంగా వర్సిటీ 45వ వ్యవస్థాపక దినోత్సవం

డిజిటల్ వర్సిటీగా అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ..ఘనంగా వర్సిటీ 45వ వ్యవస్థాపక దినోత్సవం
  • వీసీ ఘంటా చక్రపాణి

  హైదరాబాద్ సిటీ, వెలుగు: డాక్టర్ బీఆర్‌‌‌‌ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీని కేవలం దూర విద్యకే పరిమితం చేయకుండా, ఏఐ, డిజిటల్ టెక్నాలజీలను జోడించి పూర్తిస్థాయి డిజిటల్ ఆన్‌‌లైన్ యూనివర్సిటీగా మార్చనున్నట్లు వీసీ ప్రొఫెసర్‌‌‌‌ ఘంటా చక్రపాణి తెలిపారు.

 శుక్రవారం అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ 45వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా వర్సిటీ ప్రాంగణంలో బీఆర్‌‌‌‌ అంబేద్కర్ విగ్రహానికి, దూర విద్యా పితామహుడు ప్రొఫెసర్‌‌‌‌ జి.రామ్‌‌రెడ్డి ఫొటో వద్ద నివాళులర్పించారు. అనంతరం ‘ప్రజాస్వామ్యీకరించిన విద్యపై అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ వాగ్దానం’ అనే అంశంపై చర్చించారు. అకాడమిక్ డైరెక్టర్ ప్రొఫెసర్​జి. పుష్పా చక్రపాణి అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా వీసీ చక్రపాణి మాట్లాడుతూ  ప్రభుత్వ స్కూల్స్ టీచర్ల కోసం  ‘ఏఐ ఫర్ టీచర్స్’ ట్రైనింగ్‌‌ను ప్రారంభించామన్నారు. 

త్వరలోనే వర్సిటీలో విదేశీ భాషల్లో ట్రైనింగ్ సెంటర్‌‌‌‌ ఏర్పాటు చేస్తామన్నారు. యూజీసీ నుంచి డిజిటల్ ఆన్‌‌లైన్ మోడ్‌‌లో కోర్సులు అందించడానికి యూనివర్సిటీకి అనుమతి లభించిందన్నారు. కామన్వెల్త్ ఎడ్యుకేషనల్ మీడియా సెంటర్ ఫర్ ఆసియా(సెమ్కా- న్యూఢిల్లీ) డైరెక్టర్ డాక్టర్ బి. షడ్రక్ మాట్లాడుతూ  ఏఐ, డిజిటల్ టెక్నాలజీ వల్ల స్టూడెంట్స్‌‌కు చదువు నేర్చుకోవడం సులువవుతోందన్నారు. 

డిజిటల్ ఓడీఎల్ (ఓపెన్ డిస్టెన్స్ లెర్నింగ్)  విధానం ద్వారా రైతులు, గృహిణులు, ఉద్యోగులు భౌగోళిక పరిమితులు లేకుండా తమకు నచ్చిన సమయంలో చదువుకోవచ్చన్నారు. కార్యక్రమంలో రిజిస్ట్రార్ డాక్టర్​ఎల్. విజయకృష్ణారెడ్డి, వివిధ విభాగాల హెచ్‌‌వోడీలు, బోధనా సిబ్బంది పాల్గొన్నారు.