- అలవెన్స్ లపై ఇన్ కం ట్యాక్స్ చెల్లించనున్న సంస్థ
ఒప్పందం వివరాలు వెల్లడించిన ఏఐటీయూసీ నేతలు సీతారామయ్య, రాజ్ కుమార్
గోదావరిఖని/కోల్‌బెల్ట్/నస్పూర్, వెలుగు : సింగరేణిలో దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న డిమాండ్లను నెరవేర్చేందుకు యాజమాన్యం ఒప్పుకుందని సింగరేణి గుర్తింపు సంఘం ఏఐటీయూసీ స్టేట్ప్రెసిడెంట్వాసిరెడ్డి సీతారామయ్య, జనరల్సెక్రటరీ కె.రాజ్‌కుమార్ తెలిపారు.
శుక్రవారం మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్ ఏరియా ఆర్కే బొగ్గు గనిపై గేట్ మీటింగ్ లో, గోదావరిఖని ప్రెస్ క్లబ్లో మీడియాతో మాట్లాడారు. సింగరేణిలో కార్మికుల పెండింగ్ సమస్యలపై 31 డిమాండ్లతో సమ్మే నోటీస్ ఇవ్వగా... అసిస్టెంట్ లేబర్ కమిషనర్ సమక్షంలో సింగరేణి మేనేజ్మెంట్తో జరిగిన చర్చలు సఫలమయ్యాయని చెప్పారు. నోటీసులోని 24 డిమాండ్లను యాజమాన్యం అంగీకరించిందని, మిగిలిన డిమాండ్లను కూడా త్వరలో పరిష్కరిస్తామని హామీ ఇచ్చిందని చెప్పారు.
ముఖ్యంగా కార్మికులకు అందుతున్న అలవెన్సులపై ఇన్కమ్ ట్యాక్స్ ను యాజమాన్యమే చెల్లించనుందని, సర్వీసులో సహజ మరణం పొందిన కార్మికుడి కుటుంబానికి రూ.20 లక్షల పరిహారం ఇవ్వడం, ప్రతీ నెల మెడికల్ బోర్డు నిర్వహణ, దసరాలోపు లాభాల వాటా చెల్లింపు, బదిలీలకు మూడేండ్ల నిబంధన తొలగింపు, మైనింగ్ స్టాఫ్ కు ఓవర్ మెన్ ప్రమోషన్లు, మారుపేర్ల సమస్య పరిష్కారానికి కమిటీ ఏర్పాటు, హైదరాబాద్‌లో సింగరేణి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఏర్పాటు, మెడికల్ అటెండెన్స్ రూల్స్‌లో మార్పులు, రిటైర్డ్ కార్మికులకు ఇన్‌పేషెంట్ గా వైద్య సేవలు, విద్యా సంస్థల్లో సీబీఎస్ఈ సిలబస్ వంటి డిమాండ్లకు యాజమాన్యం ఒప్పుకుందన్నారు. ఆయా కార్యక్రమాల్లో యూనియన్ లీడర్లు మడ్డి ఎల్లా గౌడ్, ముస్కె సమ్మయ్య, కవ్వంపల్లి స్వామి, గునిగంటి నర్సింగరావు, పెద్దెల్లి శంకర్, పడాల కనకరాజు, ఎర్రగొల్ల చేరాలు, బూడిద మల్లేశ్, కే.దేవయ్య, నూనె కొమురయ్య, తొడుపునూరి రమేశ్ కుమార్, ఎండి.అక్బర్అలీ, సలేంద్ర సత్యనారాయణ, దాగం మల్లేశ్, భీమనాధుని సుదర్శనం, వీరభద్రయ్య పాల్గొన్నారు.
కార్మికుల సంబురాలు
సింగరేణిలో పెండింగ్‌లో ఉన్న పలు డిమాండ్లు, సమస్యల పరిష్కారానికి సింగరేణి యాజమాన్యం ఒప్పుకోవడంతో కార్మికులు సంబురాలు చేసుకున్నారు. మంచిర్యాల జిల్లాలోని శ్రీరాంపూర్, మందమర్రి ఏరియాలోని సింగరేణి బొగ్గు గనులు, డిపార్ట్మెంట్ల వద్ద పటాకులు కాల్చి, స్వీట్లు పంపిణీ చేశారు.
