టెన్నిస్ దిగ్గజం రోజర్ ఫెడరర్‎కు అరుదైన గౌరవం

టెన్నిస్ దిగ్గజం రోజర్ ఫెడరర్‎కు అరుదైన గౌరవం

న్యూయార్క్‌‌: స్విట్జర్లాండ్‌‌ టెన్నిస్‌‌ లెజెండ్‌‌ రోజర్‌‌ ఫెడరర్‌‌.. ప్రతిష్టాత్మక అంతర్జాతీయ టెన్నిస్‌‌ హాల్‌‌ ఆఫ్‌‌ ఫేమ్‌‌లో చోటు దక్కించుకున్నాడు. 25 ఏళ్ల సుదీర్ఘ కెరీర్‌‌లో ఫెడరర్‌‌ 20 గ్రాండ్‌‌ స్లామ్స్‌‌తో కలిపి మొత్తం 103 సింగిల్స్‌‌ టైటిల్స్‌‌ సాధించాడు. ఆరుసార్లు ఏటీపీ స్పోర్ట్స్‌‌ మాన్‌‌షిప్‌‌ అవార్డుతో పాటు అత్యధికంగా ఫ్యాన్‌‌ ఫేవరెట్‌‌ అవార్డులు గెలుచుకున్నాడు. కెరీర్‌‌లో 1251 మ్యాచ్‌‌లు గెలిచిన ఫెడరర్‌‌.. యూఎస్‌‌ ఓపెన్‌‌లో వరుసగా ఐదుసార్లు (2004–08) చాంపియన్‌‌గా నిలిచాడు. 

ఆటతో పాటు సహచర ప్లేయర్లు, అభిమానులతో నేను వ్యవహరించిన తీరు తనను చరిత్రలో నిలిచేలా చేసిందని ఫెడరర్‌‌ వ్యాఖ్యానించాడు. ‘నేను కోర్టులో లేనప్పుడు నా వ్యక్తిత్వం గురించి, నా ఆట గురించి, దానికి అందిస్తున్న సహకారం గురించి చర్చ జరిగింది. దానికి నేను కొంచెం ఆశ్చర్యపోయాను. ఆ క్షణంలో నేను బ్యాక్‌‌హ్యాండ్స్‌‌, ఫోర్‌‌హ్యాండ్స్‌‌, బ్రేక్‌‌ పాయింట్లను కాపాడటం, విజయాల గురించి మాత్రమే మాట్లాడేవారని గ్రహించా.

కానీ అది వాస్తవం కాదని ఇప్పుడు తెలుసుకున్నా. లాకర్‌‌ రూమ్‌‌ల్లో, కారిడార్లలో, మీడియాతో, టోర్నీ డైరెక్టర్లతో, బాల్ కిడ్స్‌‌తో మన ప్రవర్తన ఎలా ఉంటుందనే దానిపై కూడా చర్చ జరుగుతుంది’ అని ఫెడరర్‌‌ పేర్కొన్నాడు.  రోడ్‌‌ ఐలాండ్‌‌లోని న్యూపోర్ట్‌‌లో శనివారం జరిగే ప్రత్యేక కార్యక్రమంలో ఫెడరర్‌‌తో పాటు మాజీ క్రీడాకారిణి, వ్యాఖ్యాత మేరీ కరిల్లోనూ ఘనంగా సత్కరించనున్నారు.