గ్రాండ్‌‌ చెస్‌‌ టూర్‌‌ టైటిల్‌‌ దక్కించుకున్న ప్రజ్ఞానంద.. తొలి ఇండియన్‌‌గా రేర్ రికార్డు

గ్రాండ్‌‌ చెస్‌‌ టూర్‌‌ టైటిల్‌‌ దక్కించుకున్న ప్రజ్ఞానంద.. తొలి ఇండియన్‌‌గా రేర్ రికార్డు

సెయింట్‌‌ లూసియా (అమెరికా): ఇండియా గ్రాండ్‌‌ మాస్టర్‌‌ ఆర్‌‌. ప్రజ్ఞానంద.. ప్రతిష్టాత్మక ‘గ్రాండ్‌‌ చెస్‌‌ టూర్‌‌’ టైటిల్‌‌ను సొంతం చేసుకున్నాడు. శుక్రవారం జరిగిన ఫైనల్లో ప్రజ్ఞానంద 15–13తో ఫ్యాబియానో కరువాన (అమెరికా)పై సంచలన విజయం సాధించాడు. దాంతో ఈ టైటిల్‌‌ను సాధించిన తొలి ఇండియన్‌‌ గ్రాండ్‌‌ మాస్టర్‌‌గా ప్రజ్ఞా రికార్డులకెక్కాడు. ఫలితంగా వచ్చే ఏడాది జరిగే గ్రాండ్‌‌ చెస్‌‌ టూర్‌‌లో స్థానాన్ని ఖరారు చేసుకున్నాడు. 

సెయింట్‌‌ లూయిస్‌‌ చెస్‌‌ క్లబ్‌‌లో జరిగిన పోరులో ఆరు పాయింట్ల వెనుకంజతో ఆట మొదలుపెట్టిన ప్రజ్ఞానంద ర్యాపిడ్‌‌, బ్లిట్జ్‌‌ రౌండ్లలో పోరాటస్ఫూర్తిని చూపెట్టాడు. రెండు ర్యాపిడ్‌‌ గేమ్స్‌‌లోనూ (గెలిస్తే నాలుగు పాయింట్లు) గెలిచి ఎనిమిది పాయింట్లు సాధించాడు. ఫలితంగా కరువాన కంటే రెండు పాయింట్ల ఆధిక్యంలో నిలిచాడు. తర్వాత జరిగిన నాలుగు బ్లిట్జ్‌‌ గేమ్స్‌‌లోనూ ఇద్దరు ప్లేయర్లూ సమానంగా రాణించారు. 

తొలి గేమ్‌‌ 50 ఎత్తుల వద్ద డ్రా కాగా, రెండో గేమ్‌‌లో కరువాన 70 ఎత్తుల వద్ద గెలిచాడు. దాంతో ఇరువురి స్కోరు 12–12తో సమమైంది. ఇక్కడినుంచి మరింత పట్టుదలగా ఆడిన ప్రజ్ఞానంద.. మూడో బ్లిట్జ్‌‌ గేమ్‌‌లో 48 ఎత్తులతో కరువానపై సంచలన విజయం సాధించాడు. దాంతో 14–12 ఆధిక్యంలో నిలిచాడు. నాలుగో గేమ్‌‌ 50 ఎత్తుల వద్ద డ్రాగా ముగించిన ప్రజ్ఞానంద 15–13తో చిరస్మరణీయ విజయం సాధించాడు. 

ఒకవేళ చివరి బ్లిట్జ్‌‌ గేమ్‌‌లో కరువాన గెలిచి ఉంటే ‘టైమ్‌‌ కంట్రోల్‌‌’లో మరో రెండు గేమ్స్‌‌ ఆడాల్సి వచ్చేది. ఇక్కడా స్కోరు సమమైతే ఆర్మగెడాన్‌‌ (టైబ్రేకర్‌‌)తో విజేతను తేల్చేవారు. మూడో స్థానం కోసం జరిగిన పోరులో వెస్లీ సో (అమెరికా) 18–12తో విన్సెంట్‌‌ కీమర్‌‌ (జర్మనీ)పై గెలిచాడు. ప్రజ్ఞా, కరువాన, వెస్లీ గ్రాండ్‌‌ చెస్‌‌ టూర్‌‌లో పాల్గొంటారు. విజేతగా నిలిచిన ప్రజ్ఞానందకు ట్రోఫీతో పాటు రూ. 1.91 కోట్ల ప్రైజ్‌‌మనీ లభించింది. 

‘నిజాయితీగా చెప్పాలంటే ఈరోజు నాకు పెద్దగా అవకాశాలు ఉంటాయని అనుకోలేదు. ఫ్యాబీపై ఒక విజయం సాధించడమే అరుదు. అలాంటిది ర్యాపిడ్‌‌లో రెండు విజయాలు సాధించడం కీలకంగా మారింది’ అని ప్రజ్ఞానంద వ్యాఖ్యానించాడు. ‘తన కెరీర్‌‌లో తొలి గ్రాండ్‌‌ చెస్‌‌ టూర్‌‌ టైటిల్‌‌ను గెలిచిన ప్రజ్ఞానందకు అభినందనలు’ అని గ్రాండ్‌‌ చెస్‌‌ టూర్‌‌ ఎక్స్‌‌లో పోస్ట్‌‌లో చేసింది.

‘ఒక అద్భుతమైన సీజన్‌‌ను ముగిస్తూ, ఉత్కంఠభరితమైన ఫైనల్ మ్యాచ్‌‌లో కరువానాను ఓడించి ప్రగ్ తన కెరీర్‌‌లో మొదటిసారిగా జీసీటీ కిరీటాన్ని కైవసం చేసుకున్నాడు. అద్భుతమైన పునరాగమనం, అసమానమైన పోరాటం, చాంపియన్‌‌గా నిలవడానికి ఎంత అద్భుతమైన మార్గం ఇది’ అని రాసుకొచ్చింది. ఈ ఏడాది ప్రారంభంలో నార్వే చెస్ టైటిల్‌‌ను గెలుచుకున్న తొలి ఇండియన్‌‌గా ప్రజ్ఞానంద నిలిచాడు. ఆ టోర్నమెంట్‌‌లో ప్రజ్ఞా.. ప్రపంచ నంబర్‌‌వన్‌‌, టైటిల్ ఫేవరెట్ అయిన మాగ్నస్ కార్ల్‌‌సన్‌‌పై రెండుసార్లు విజయం సాధించాడు.