- యుద్ధ ట్యాంకుల వీక్ పాయింట్‌తో పేల్చేయగల పోర్టబుల్ మిసైల్
- ఇరు దేశాల రక్షణ సంబంధాలు మరింత బలం
న్యూఢిల్లీ/వాషింగ్టన్: యుద్ధరంగంలో తిరుగులేని శక్తిగా ఉన్న అమెరికా తయారీ 'జావలిన్' యాంటీ-ట్యాంక్ క్షిపణి వ్యవస్థను కొనుగోలు చేసేందుకు భారత్ సిద్ధమవుతోంది. ఈ మేరకు భారత్–-అమెరికా రక్షణ భాగస్వామ్యంలో మరో చారిత్రక మైలురాయి ఆవిష్కృతమైంది. శత్రువుల కంట పడకుండా రక్షించే 'ఫైర్-అండ్- ఫార్గెట్' విధానంతో పనిచేసే ఈ అత్యాధునిక క్షిపణి కొనుగోలుకు సంబంధించి అమెరికా రాయబారి సెర్గియో గోర్ 'ఎక్స్' వేదికగా శుక్రవారం కీలక ప్రకటన చేశారు. గతేడాది నవంబర్‌లోనే ఈ విక్రయానికి అమెరికా విదేశాంగశాఖ ఆమోదం తెలిపిందని వెల్లడించారు.
జావలిన్ ప్రత్యేకతలు..
ప్రముఖ రక్షణ సంస్థలు లాక్‌హీడ్ మార్టిన్, ఆర్టీఎక్స్ సంయుక్తంగా అభివృద్ధి చేసిన ఈ జావలిన్ క్షిపణి వ్యవస్థ ప్రపంచవ్యాప్తంగా ఎన్నో సైనిక దళాల చేతిలో సేవలందిస్తోంది. ఈ క్షిపణి ట్యాంకులను నేరుగా ఢీకొనకుండా, అత్యంత బలహీనంగా ఉండే పైకప్పు భాగంపై (టాప్-కానపీ) కచ్చితంగా విరుచుకుపడుతుంది. లాంచ్ అయినప్పటి నుంచి లక్ష్యాన్ని చేరేవరకు తలక్రిందులుగా ఉన్న 'యూ' ఆకారంలో ప్రయాణించి శత్రువుల భరతం పడుతుంది. గన్నర్ తన కర్సర్‌తో లక్ష్యాన్ని ఎంచుకున్న తర్వాత, కమాండ్ లాంచ్ యూనిట్ క్షిపణికి లాక్- అన్ సంకేతాన్ని పంపుతుంది. క్షిపణిని ప్రయోగించగానే ఆపరేటర్ సురక్షిత ప్రాంతానికి వెళ్లి కౌంటర్ ఫైర్ నుంచి తప్పుకోవచ్చు. ఇది 'సాఫ్ట్- లాంచ్' డిజైన్‌ను కలిగి ఉండటం వల్ల బంకర్ల నుంచి కూడా సురక్షితంగా ప్రయోగించవచ్చు.
భారత్ సైనిక శక్తికి మరింత బలం..
గతేడాది నవంబర్‌లో భారత్ కోసం 100 జావలిన్ వ్యవస్థలు, ఎక్స్‌కాలిబర్ గైడెడ్ ఫిరంగి గుళ్ల విక్రయానికి అమెరికా ఆమోదం తెలిపింది. ఇప్పటికే భారత్ అమెరికా నుంచి అపాచీ, చినూక్ హెలికాప్టర్లు, సీ-17 రవాణా విమానాలు, ఎం777 హోవిట్జర్లను సమకూర్చుకుంది. తాజా జావలిన్ క్షిపణుల చేరికతో భారత సైనిక శక్తి మరింత ఇనుమడించనుంది.
