న్యూఢిల్లీ: పోటీ పరీక్షల అభ్యర్థుల కోసం కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ఉచిత ఆన్‌లైన్ కోచింగ్ పథకం మోసపూరితమైందని, ప్రభుత్వ బాధ్యతల నుంచి తప్పించుకునేందుకు వేసిన ఒక జిమ్మిక్కు మాత్రమేనని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరామ్ రమేశ్ విమర్శించారు. ఇలాంటి పథకాలను విజయవంతంగా అమలు చేసే సామర్థ్యం ఈ ప్రభుత్వానికి లేదని ‘ఎక్స్’లో ఎద్దేవా చేశారు. జూన్ 17న రాజస్థాన్‌లోని కోటాలో జరిగిన ‘ఛాత్రోంకీ గూంజ్’ కార్యక్రమంలో లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ దేశంలోని కోచింగ్ మాఫియా, ప్రభుత్వ విద్యావ్యవస్థపై దాని ప్రభావాన్ని లేవనెత్తారని రమేశ్ గుర్తుచేశారు.
దేశంలో ప్రభుత్వ విద్యారంగంపై కేంద్రం పెట్టే బడ్జెట్ కంటే, సాధారణ కుటుంబాలు ప్రైవేట్ కోచింగ్ సెంటర్ల కోసమే 2.5 రెట్లు ఎక్కువగా ఖర్చు చేస్తున్నారన్న వాస్తవాన్ని రాహుల్ బయటపెట్టారని పేర్కొన్నారు. ప్రజల నుంచి వస్తున్న తీవ్ర ఒత్తిడిని తప్పించుకునేందుకే ప్రధాని మోదీ ఆగస్టు 15న ఉచిత ఆన్‌లైన్ కోచింగ్ పథకాన్ని ప్రకటించారని విమర్శించారు. కేంద్ర సామాజిక న్యాయం, సాధికారత మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో అమలవుతున్న ఉచిత కోచింగ్ పథకం గత మూడేండ్లుగా లక్ష్యాన్ని చేరడంలో విఫలమైందని తెలిపారు. మూడేళ్లలో 10,500 మందికి శిక్షణ ఇవ్వాల్సి ఉండగా, కేవలం 2,790 మందికి (26 శాతం మాత్రమే) ప్రవేశాలు కల్పించారని పేర్కొన్నారు. దేశంలోని ప్రభుత్వ విద్యా వ్యవస్థను బలోపేతం చేయకుండా, ప్రజల సొమ్మును ఆన్‌లైన్ కోచింగ్‌లకు మళ్లించడం సరికాదని ఆయన పేర్కొన్నారు.
