న్యూఢిల్లీ: కాంగ్రెస్ ఎంపీ, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీపై ఉత్తరప్రదేశ్‌కు చెందిన బీజేపీ నేత, సుప్రీం కోర్టు లాయర్ నాజియా ఖాన్ ఘజియాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. మనుస్మృతిలోని ఒక అధ్యాయాన్ని మాత్రమే ప్రస్తావించి, అందులోని పదాలను వక్రీకరించడం ద్వారా ప్రాచీన గ్రంథంపై తప్పుడు అభిప్రాయం కలిగించేలా రాహుల్ మాట్లాడారని ఆమె ఆరోపించారు. మనుస్మృతి గురించి మాట్లాడే టైంలో ప్రధాని నరేంద్ర మోదీ, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్, ఆర్ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భగవత్ ఫొటోలను ప్రదర్శించడంపైనా ఆమె అభ్యంతరం తెలిపారు. మనుస్మృతిని అందరూ చదవాలని ప్రధాని ఎప్పుడైనా చెప్పారా? అని నాజియా ప్రశ్నించారు. ఈ మేరకు రాహుల్‌పై చర్యలు తీస్కోవాలంటూ శుక్రవారం పోలీసులకు ఆమె ఫిర్యాదు చేశారు.
రాహుల్ ఏమన్నారంటే..
ఇటీవల పుణెలో జరిగిన ‘ఛాత్రోంకీ గూంజ్’ కార్యక్రమంలో రాహుల్ మాట్లాడుతూ, మనుస్మృతి మైండ్‌సెట్‌ను విమర్శించారు. మహిళలు తమ తండ్రి, భర్త లేదా కొడుకులకు చెందరని.. తమకు తామే చెందుతారని అన్నారు. మనుస్మృతిలో బాల్యంలో తండ్రి, యవ్వనంలో భర్త, భర్త మరణించిన తర్వాత కొడుకుల ఆధీనంలో మహిళ ఉండాలని పేర్కొన్నారని ఆయన ప్రస్తావించారు. ‘‘మహిళ ఎప్పుడూ స్వతంత్రంగా ఉండకూడదన్న ఈ మాటలు సిగ్గుచేటు’’ అని రాహుల్ విమర్శించారు. కాగా, రాహుల్ వ్యాఖ్యలపై సీఎం యోగి కూడా మండిపడ్డారు. మత గ్రంథాలపై వ్యాఖ్యలు చేసే ముందు వాటిని అధ్యయనం చేయాలని సూచించారు.
