గద్వాల, వెలుగు : తన తండ్రి ఎవరో అధికారికంగా తేల్చాలని డిమాండ్ చేస్తూ పవన్ అనే యువకుడు తన తల్లితో కలిసి గద్వాల పట్టణంలోని భీమ్‌నగర్‌లో శుక్రవారం ధర్నాకు దిగాడు. పట్టణంలోని బీసీ కాలనీకి చెందిన రేణుక 24 ఏండ్ల కింద భీమ్‌నగర్‌లోని ఓ ఇంట్లో పని చేసేది. రేణుకను పెండ్లి చేసుకుంటానని ఆ ఇంటి యజమాని కొడుకు చింతరేవుల చక్రపాణి జోషి నమ్మించాడు.
ఈ క్రమంలో రేణుక గర్భం దాల్చగా కొడుకు పుట్టాడు. కానీ ఈ విషయాన్ని ఎవరికైనా చెబితే చంపుతానని తన తల్లిని బెదిరించాడని పవన్ ఆరోపించాడు. సమస్య పరిష్కారం కోసం ఎన్ని సార్లు ప్రయత్నించినా పట్టించుకోకుండా, తమపై దౌర్జన్యానికి దిగారని, ఫోన్‌లోనూ బెదిరించారని ఆ రికార్డులు సైతం తమ వద్ద ఉన్నాయని పవన్ తెలిపాడు.
తన తండ్రి ఎవరో అధికారికంగా తేలేందుకే తన తల్లితో కలిసి ధర్నా చేస్తున్నానని, అవసరమైతే డీఎన్‌ఏ టెస్ట్‌కైనా సిద్ధమేనని యువకుడు తెలిపాడు. చక్రపాణి భార్య పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు వచ్చి తల్లీకొడుకును స్టేషన్‌కు తరలించారు.చక్రపాణి అందుబాటులో లేడని, శనివారం ఇరువర్గాలతో మాట్లాడుతామని పోలీసులు చెప్పారు.
