- భవిష్యత్‌లో జాయింట్ వెంచర్‌గా ఏర్పడాలి
- సింగరేణి ఆఫీసర్లకు డిప్యూటీ సీఎం భట్టి ఆదేశం
- కర్నాటకలోని హట్టి, యూటీ గనుల్లో పర్యటన
- బంగారం శుద్ధి ప్రక్రియ పరిశీలించిన ఉప ముఖ్యమంత్రి
హైదరాబాద్, వెలుగు: గోల్డ్మైనింగ్లో విశేష అనుభవమున్న కర్నాటక ప్రభుత్వ సంస్థ ‘హట్టి గోల్డ్ మైన్స్’తో సింగరేణి కలిసి పనిచేయాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సంస్థ అధికారులను ఆదేశించారు. భవిష్యత్తు ప్రాజెక్టుల్లో జాయింట్ వెంచర్ అవకాశాలను పరిశీలించాలని సూచించారు. రెండు ప్రభుత్వ రంగ సంస్థల సాంకేతిక సామర్థ్యం, అనుభవాన్ని సమన్వయం చేస్తే దేశీయ బంగారం ఉత్పత్తిలో మెరుగైన ఫలితాలు సాధించవచ్చని పేర్కొన్నారు.
కర్నాటక గోల్డ్ మైన్స్ ప్రాంతంలో రెండో రోజు పర్యటనలో భాగంగా శుక్రవారం రాయచూర్ జిల్లాలోని హట్టి, యూటీ బంగారు గనులను భట్టి సందర్శించారు. బంగారు ఖనిజం తవ్వకం నుంచి శుద్ధ బంగారం తయారీ వరకు చేపడుతున్న ప్రక్రియలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. హట్టి గోల్డ్ మైన్స్‌కు బంగారం అన్వేషణ, తవ్వకం, ప్రాసెసింగ్, శుద్ధిలో అపార అనుభవం ఉందని భట్టి తెలిపారు.
బొగ్గు, ఇతర ఖనిజాల అన్వేషణ, తవ్వకాల్లో సింగరేణికి ఉన్న సాంకేతిక నైపుణ్యాన్ని హట్టి అనుభవంతో జోడించాలని సూచించారు. బంగారం అన్వేషణ, తవ్వకం, వెలికితీత, శుద్ధి, ఆధునిక సాంకేతికత వినియోగం, నిపుణుల సేవలు, మానవ వనరుల శిక్షణ తదితర అంశాల్లో రెండు సంస్థలు సంయుక్తంగా పనిచేసేందుకు కార్యాచరణ రూపొందించాలని సింగరేణి అధికారులను ఆదేశించారు.
ఉత్పత్తి నుంచి శుద్ధి వరకు పరిశీలన
హట్టి గోల్డ్ మైన్స్‌లోని ప్రొడక్షన్ యూనిట్, ఖనిజ శుద్ధి కేంద్రం, ఎలక్ట్రో విన్నింగ్ కేంద్రాలను డిప్యూటీ సీఎం భట్టి పరిశీలించారు. గని నుంచి వెలికితీసిన ఖనిజాన్ని వివిధ దశల్లో ప్రాసెస్ చేసి శుద్ధ బంగారంగా మార్చే విధానాన్ని అధికారులు వివరించారు. హట్టి ప్రాజెక్టు ద్వారా రోజుకు సగటున రెండు నుంచి నాలుగు కిలోల బంగారం ఉత్పత్తి అవుతోందని అధికారులు తెలిపారు.
బంగారం ఖనిజ గనికి సంబంధించిన సమగ్ర మ్యాప్‌లను లోతుగా పరిశీలించారు. ఈ పర్యటనలో సింగరేణి సీఎండీ బుద్ధ ప్రకాశ్ జ్యోతి, ప్లానింగ్ అండ్ ప్రాజెక్ట్స్ డైరెక్టర్ వెంకటేశ్వర్లు, జనరల్ మేనేజర్ పంకజ్ కులశ్రేష్ఠ, రాయచూరు జిల్లా పరిషత్ సభ్యులు అమ్జద్, హట్టి పాల్గొన్నారు.
బంగారం దిగుమతులు తగ్గించాలి
బంగారం దిగుమతులపై ఆధారపడడాన్ని తగ్గించి దేశీయ ఉత్పత్తిని పెంచాల్సిన అవసరం ఉందని డిప్యూటీ సీఎం భట్టి పేర్కొన్నారు. దేశ ఆర్థిక భద్రతలో బంగారం కీలక పాత్ర పోషిస్తుందన్నారు. దేశంలో అందుబాటులో ఉన్న బంగారు ఖనిజ వనరులను శాస్త్రీయంగా అన్వేషించి వెలికితీయడంలో సింగరేణి వంటి ప్రభుత్వ రంగ సంస్థలు ముందుండాలన్నారు. హట్టి–సింగరేణి భాగస్వామ్యంతో బంగారం ఉత్పత్తి పెంపు, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం వినియోగం, స్థానిక ఉపాధి కల్పనతోపాటు దేశ ఆర్థికాభివృద్ధికి మేలు జరుగుతుందని తెలిపారు.
