హైదరాబాద్, వెలుగు: మత్స్యకార సంఘం సభ్యత్వ వివాదంలో సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును హైకోర్టు ధర్మాసనం కొట్టివేసి, కేసును మళ్లీవిచారించాలని ఆదేశించింది. ఖమ్మం జిల్లా చింతకాని మండలం వందనం గ్రామంలోని మత్స్యకార సహకార సంఘంలో సభ్యత్వం కోరిన 60 మంది దరఖాస్తులను తిరస్కరించడంపై ఈ వివాదం తలెత్తింది.
సంఘానికి నోటీసు ఇవ్వకుండా, వాదనలు వినకుండానే సింగిల్ జడ్జి తీర్పు ఇచ్చారంటూ దాఖలైన అప్పీల్‌ను చీఫ్ జస్టిస్ అపరేశ్ కుమార్ సింగ్, జస్టిస్ జీఎం.మొహియుద్దీన్‌లతో కూడిన ధర్మాసనం ఇటీవల అనుమతించింది. సభ్యత్వానికి సంబంధించి వర్తించే ప్రభుత్వ ఉత్తర్వులు, సంఘ బైలాస్, ప్రస్తుత సభ్యత్వం, ఇతర నిబంధనలను పరిగణనలోకి తీసుకోవాల్సి ఉందని ధర్మాసనం పేర్కొంది. సంబంధిత పక్షాలందరికీ నోటీసులు జారీ చేసి, వారి వాదనలు విన్న తర్వాత కేసును తాజాగా నిర్ణయించాలని ఆదేశించింది. సభ్యత్వంపై తాము ఎలాంటి అభిప్రాయం వ్యక్తం చేయలేదని స్పష్టం చేసింది.
