వంద రోజులన్నరు.. వెయ్యి రోజులైనా గతి లేదు : కేటీఆర్

వంద రోజులన్నరు.. వెయ్యి రోజులైనా గతి లేదు : కేటీఆర్
  •     హామీల అమలుపై వచ్చే నెల 2 నుంచి నిరసనలు: కేటీఆర్ 
  •     సెప్టెంబర్ 1న తెలంగాణ భవన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో చార్జిషీట్ విడుదల చేస్తామని వెల్లడి

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి వెయ్యి రోజులు దాటినా ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలమైందని, ఈ అసమర్థ పాలనపై పోరుబాటకు సిద్ధం కావాలని పార్టీ శ్రేణులకు బీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపునిచ్చారు. అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లోనే ఆరు గ్యారంటీలు సహా ప్రధాన హామీలన్నీ అమలు చేస్తామని చెప్పి గద్దెనెక్కిన కాంగ్రెస్.. వెయ్యి రోజులు పూర్తయినా గతి లేదని, ప్రజలను నట్టేట ముంచిందని మండిపడ్డారు. 

సెప్టెంబర్ 2 నుంచి 10వ తేదీ వరకు రాష్ట్రవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయించారు. శుక్రవారం పార్టీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, ఎంపీలు, జిల్లా అధ్యక్షులు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులతో ఆయన టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. వారం రోజుల కార్యాచరణపై పార్టీ కేడర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు దిశానిర్దేశం చేశారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు, ఆరు గ్యారంటీలను తుంగలో తొక్కిన కాంగ్రెస్ నైజాన్ని ప్రజల్లో ఎండగట్టాలని స్పష్టం చేశారు. ఈ ఆందోళన కార్యక్రమాల్లో పార్టీ ముఖ్య నేతలు, ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు ముందుండి నడిపించాలని ఆదేశించారు. ప్రజల భాగస్వామ్యంతో వినూత్న రీతిలో కార్యక్రమాలు నిర్వహించి, ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. 

తెలంగాణ భవన్ నుంచి ఈ నిరసనలన్నింటినీ ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ సమన్వయం చేస్తామని ఆయన స్పష్టం చేశారు. ఈ క్రమంలో సెప్టెంబర్ 1 (ఆదివారం)న తెలంగాణ భవన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో చార్జిషీట్ విడుదల చేస్తామని చెప్పారు. 2న (సోమవారం) ఆరు గ్యారంటీలపై అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో ధర్నాలతో ‘బాకీ కార్డుల’ను ఇంటింటికీ పంపిణీ చేస్తామన్నారు. ఆ తరువాతి రోజుల్లో అన్ని నియోజకవర్గాల్లో రైతు సదస్సులు, 22ఏ నిషేధిత జాబితా భూముల సమస్యలపై నిరసనలు చేపడ్తామన్నారు. అలాగే, మహిళలకు నెలకు రూ.2,500 ఆర్థిక సాయం, కల్యాణలక్ష్మి/షాదీముబారక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో తులం బంగారం ఎగవేతపై, ఫీజు రీయింబర్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్ బకాయిలు, జాబ్ క్యాలెండర్ అమలు, యూత్ డిక్లరేషన్ వైఫల్యాలపై ర్యాలీలు నిర్వహిస్తామని తెలిపారు.