- మోదీ ప్రభుత్వంలోనే మహిళలకు భరోసా: రాంచందర్ రావు
- బీఆర్‌ఎస్, కాంగ్రెస్ ప్రభుత్వాలు హైదరాబాద్ ను విషాద నగరంగా మార్చాయని ఫైర్
హైదరాబాద్, వెలుగు: మహిళా సాధికారతకు మోదీ సర్కార్ కట్టుబడి ఉందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్ రావు స్పష్టం చేశారు. కాంగ్రెస్, ఇండియా కూటమి పార్టీలు పచ్చి మహిళా వ్యతిరేక పార్టీలని ఆరోపించారు. శుక్రవారం బీజేపీ స్టేట్ ఆఫీసులో పార్టీ మహిళా మోర్చా అధ్యక్షురాలు డాక్టర్ మేకల శిల్పారెడ్డి అధ్యక్షతన రక్షాబంధన్ వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన రాంచందర్ రావుతో పాటు మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ, బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డికు మహిళా నేతలు రాఖీలు కట్టి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా రాంచందర్ రావు మాట్లాడుతూ.. ప్రధాని మోదీ హయాంలో ఉజ్వల యోజనతో ఉచిత గ్యాస్, మాతృ వందనతో గర్భిణులకు భరోసా లభించిందన్నారు.
నారీ శక్తి వందన్ అధినియమ్ ద్వారా చట్టసభల్లో మహిళలకు 33% రిజర్వేషన్లు అందించేలా చర్యలు తీసుకున్నారని గుర్తుచేశారు. కానీ మహిళా రిజర్వేషన్ చట్టాన్ని కాంగ్రెస్, ఇండియా కూటమి పార్టీలు అడుగడుగునా అడ్డుకున్నాయని మండిపడ్డారు. రాహుల్ గాంధీ, ఖర్గేతో పాటు సీఎం రేవంత్ రెడ్డి కూడా డీలిమిటేషన్‌ను వ్యతిరేకిస్తూ ఎస్సీ, ఎస్టీ మహిళల రాజకీయ ఎదుగుదలను అడ్డుకుంటున్నారని ఆరోపించారు. తెలంగాణ మహిళా లోకానికి బీజేపీ ఎల్లవేళలా రక్షణగా ఉంటుందని, మహిళల ఆత్మగౌరవాన్ని కాపాడుకునేందుకు అందరూ కలిసికట్టుగా ముందుకు సాగాలని ఆయన పిలుపునిచ్చారు.
పాలకుల నిర్లక్ష్యంతోనే అభివృద్ధి కుంటుపడింది
హైదరాబాద్‌ను విశ్వనగరంగా మారుస్తామని గొప్పలు చెప్పి.. గత బీఆర్‌ఎస్, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వాలు కలిసి మహానగరాన్ని విషాద నగరంగా మార్చేశాయని రాంచందర్ రావు ఫైర్ అయ్యారు. నగరంలోని పలువురు విద్యావంతులు, స్థానికులు బీజేపీలో చేరారు. వారికి కాషాయ కండువాలు కప్పి రాంచందర్ రావు పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పాలకుల నిర్లక్ష్యంతోనే భాగ్యనగర అభివృద్ధి కుంటుపడిందని ఆరోపించారు. ప్రధాని మోదీ పాలనకు ఆకర్షితులై మేధావులు, విద్యావంతులు బీజేపీ వైపు చూస్తున్నారని రాంచందర్ రావు పేర్కొన్నారు. హైదరాబాద్ అభివృద్ధి ఒక్క బీజేపీతోనే సాధ్యమని ప్రజలు బలంగా విశ్వసిస్తున్నారని చెప్పారు. రాబోయే మూడు మున్సిపల్ కార్పొరేషన్ల ఎన్నికల్లో బీజేపీని భారీ మెజారిటీతో గెలిపించేందుకు జనం సిద్ధంగా ఉన్నారని ధీమా వ్యక్తం చేశారు.
