- బాధితులు, మహిళపై చేయి చేసుకున్న సీఐ
కోదాడ, వెలుగు : సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలో మెయిన్ రోడ్ పై ఉన్న ఓ డబ్బా కొట్టు తొలగించేందుకు మున్సిపల్ ఆఫీసర్లు ప్రయత్నించగా.. బాధితులు అడ్డుకున్నారు. ఈ సమయంలో అక్కడకు వచ్చిన సీఐ తమపైనే దాడికి పాల్పడ్డారంటూ బాధితులు ఆందోళనకు దిగారు.
వివరాల్లోకి వెళ్తే... పట్టణంలోని యాదవ నగర్ మెయిన్ రోడ్ పై ఉన్న డబ్బా కొట్టు వల్ల ట్రాఫిక్ కు ఇబ్బంది కలుగుతుందని మున్సిపల్ అధికారులు శుక్రవారం డబ్బాను తొలగించే ప్రయత్నం చేయగా... యజమానులు అడ్డుకొని రహదారిపై బైఠాయించి ఆందోళనకు దిగారు.
30 ఏండ్లుగా డబ్బా కొట్టుపైనే ఆధారపడి జీవిస్తున్నామని, దానిని తొలగించడంతో జీవనోపాధి దెబ్బతింటుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆందోళన విషయం తెలుసుకున్న సీఐ శివశంకర్ ఘటనాస్థలానికి చేరుకున్నారు. ఈ క్రమంలో ఆందోళన చేస్తున్న ఉపేందర్ అనే వ్యక్తిని నెట్టివేసి, లాక్కెళ్లి పోలీస్ వాహనంలో పడేయడం, అడ్డుకునేందుకు యత్నించిన మహిళను సైతం తోసేయడంతో కొంతసేపు ఉద్రిక్తత నెలకొంది. ఈ ఘటనను వీడియో తీస్తున్న ఓ జర్నలిస్ట్ పైన దాడి చేసినట్లు తెలుస్తోంది. కాగా, ఆందోళన చేస్తున్న బాధితులతో సీఐ వ్యవహరించిన తీరు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
