- వీ6 వెలుగు ఇంటర్వ్యూలో పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్
- ఆమెను తప్పించి ఆ పదవిని ఆశించే దీనస్థితిలో నేను లేను
- పార్టీ క్రమశిక్షణ అంశంలో కులం, మతం, ప్రాంతం ఉండదు
- నామినేటెడ్ పదవులు, పార్టీ కమిటీల భర్తీపై వచ్చే నెల క్లారిటీ
- ప్రభుత్వంపై బీఆర్ఎస్ సోషల్ మీడియాలోనే వ్యతిరేకత.. బయట లేదు
- అన్ని పార్టీల్లోనూ విభేదాలు.. కాంగ్రెస్ పార్టీలో స్వేచ్ఛ ఎక్కువ
- స్వేచ్ఛ హద్దులు దాటినప్పుడు చర్యలు తీసుకోక తప్పదు
- వచ్చే ఎన్నికల్లో వందకు పైగా సీట్లలో విజయం సాధిస్తం
హైదరాబాద్, వెలుగు: ప్రభుత్వం ఏర్పడి రెండున్నరేండ్లు పూర్తయినందున మంత్రివర్గాన్ని ప్రక్షాళన చేస్తే మంచిదేనని, దీనిపై సీఎం రేవంత్‌రెడ్డి, ఏఐసీసీదే తుదినిర్ణయం అని పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ చెప్పారు. నామినేటెడ్ పదవులు, పార్టీ కమిటీల భర్తీ ప్రక్రియపై సెప్టెంబర్ నాటికి క్లారిటీ వస్తుందని తెలిపారు. కొండా సురేఖపై చర్యల అంశం ఏఐసీసీ పరిధిలో ఉందని.. సురేఖను మంత్రి వర్గం నుంచి తప్పించి ఆ పదవిని ఆశించే దీనస్థితిలో తాను లేనని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.
అంతర్గత విభేదాలు అన్ని పార్టీల్లోనూ ఉంటాయని, కానీ అది పాలనపై పడడం లేదన్నారు. ప్రభుత్వంపై వ్యతిరేకత బీఆర్ఎస్ సోషల్‌మీడియాలో తప్ప బయటలేదని స్పష్టం చేశారు. సంక్షేమ పథకాల బలంతో వచ్చే ఎన్నికల్లో 100కు పైగా సీట్లు గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. ‘వీ6 వెలుగు ఇంటర్వ్యూ’లో రాష్ట్ర రాజకీయాలు, పార్టీ అంతర్గత వ్యవహారాలపై ఆయన మాట్లాడారు.
అసలు కాంగ్రెస్ పార్టీలో ఏం జరుగుతోంది? నిత్యం అంతర్గత విభేదాలు ఎందుకు వస్తున్నాయి?
అన్ని పార్టీల్లో జరిగేదే మా పార్టీలోనూ జరుగుతున్నది. విభేదాలు అస్సలు లేవని నేనేమీ అనను, ప్రతి పార్టీలోనూ ఉంటాయి. కాంగ్రెస్‌లో స్వేచ్ఛ ఎక్కువ కాబట్టి కాస్త బయటకు కనిపిస్తాయి. మిగతా పార్టీల్లో అర్ధరాత్రి డిప్యూటీ సీఎం రాజయ్యను పదవి నుంచి తీసేసినా ఎవరికీ కారణం తెలియదు. అమిత్ షా, మోదీకి వ్యతిరేకంగా మాట్లాడి బీజేపీలో ఉండగలరా? కానీ కాంగ్రెస్‌లో నెహ్రూ, ఇందిరా గాంధీని విమర్శించిన వాళ్లు కూడా కేబినెట్‌లో కొనసాగారు. అదే ప్రజాస్వామ్యం.అయితే ఏ స్వేచ్ఛకైనా హద్దులు ఉంటాయి. ఆ హద్దులు దాటినప్పుడు చర్యలు తప్పవు.
ప్రభుత్వం నుంచి ఒక బీసీ మంత్రిని సాగనంపాలని పీసీసీ కమిటీ ఏఐసీసీకి రికమండ్ చేసిందా?
ఈ వ్యవహారం వల్ల కొంత నష్టం జరుగుతోందనే నివేదికను కమిటీ ఇచ్చింది. క్రమశిక్షణ విషయానికి వచ్చినప్పుడు కులం, మతం, ప్రాంతం ఉండదు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ అంతా సమానమే. చిన్నారెడ్డికి కూడా నోటీసులు ఇచ్చాం. గతంలో కులాల విషయంలో ఇబ్బందికరంగా మాట్లాడిన జక్కిడి ప్రభాకర్ రెడ్డిని సస్పెండ్ చేశాం.
ప్రభుత్వం ఏర్పడి మూడేళ్లవుతున్నా మంత్రులు, ఎమ్మెల్యేల మధ్య, పార్టీ-ప్రభుత్వం మధ్య సఖ్యత లేదనే వాదన ఎందుకు వస్తోంది?
ప్రతి పార్టీలోనూ ఇలాంటి పరిణామాలు ఉంటాయి. ప్రాంతీయ పార్టీలు కప్పిపుచ్చుకుంటాయి, మా దగ్గర స్వేచ్ఛ ఎక్కువ కాబట్టి మాట్లాడతారు. బీజేపీలోనూ ఇద్దరు కేంద్ర మంత్రుల మధ్య విభేదాలు వస్తే అధిష్టానం సయోధ్య కుదిర్చిన విషయం చూశాం.
మంత్రి కొండా సురేఖ చేసిన తప్పేంటి? సీఎంకు వ్యతిరేకంగా మాట్లాడితే చర్యలు ఉంటాయనే సంకేతమిస్తున్నారా?
ఆ రోజు సురేఖ కుమార్తె మాట్లాడిన తీరు బాధాకరం. రేవూరి ప్రకాశ్ రెడ్డి సభలో సీఎం మాట్లాడినంత మాత్రాన టికెట్ ఇచ్చినట్టు కాదు. టికెట్లకు డీసీసీ, పీఈసీ, సీఈసీ అనే ఎంపిక విధానం ఉంటుంది. అంత తొందరపడి మాట్లాడాల్సింది కాదు. తప్పు ఏమిటనేది ఏఐసీసీ పరిశీలిస్తుంది. గతంలోనూ రాహుల్ గాంధీపై శశిథరూర్ మాట్లాడారు, అంతమాత్రాన అందరిపైనా చర్యలు తీసుకోలేదు. పరిస్థితులను బట్టి నిర్ణయాలు ఉంటాయి.
ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, అనిరుధ్ రెడ్డి లాంటి వాళ్లూ కామెంట్లు చేశారు కదా? మరి వారిపై ఎందుకు చర్యలు లేవు?
రాజగోపాల్ రెడ్డి, అనిరుధ్ రెడ్డిని వివరణ అడిగాం. వారు వివరణ ఇచ్చారు. ఇదొక నిరంతర ప్రక్రియ. గతంలో ఎన్నికలకు ముందు ఎన్ని గొడవలు ఉన్నా, ఎన్నికల నాటికి అందరం కలిసికట్టుగా పనిచేసి పార్టీని అధికారంలోకి తెచ్చాం.
కొండా సురేఖ మంత్రిగా కొనసాగుతారా? పార్టీలో బీసీ వర్గాల అసంతృప్తిని ఎలా తగ్గిస్తారు?
కొండా సురేఖ నా సోదరిలాంటిది. సీనియర్ నాయకురాలు. క్రమశిక్షణ అంశం ఏఐసీసీ చేతుల్లో ఉంది. తెలంగాణలో బీసీలకు కాంగ్రెస్ చేసినంత సేవ ఏ పార్టీ చేయలేదు. కుల సర్వే రాహుల్ గాంధీ ఆకాంక్ష అయితే, రేవంత్ రెడ్డి నాయకత్వంలో దాన్ని అమలు చేసి చూపించాం.
కొండా సురేఖను తప్పించి ఆ స్థానంలో మహేశ్ కుమార్ గౌడ్ కు మంత్రి పదవి ఇస్తారనే వార్తలపై మీరేం చెప్తారు?
అలాంటి ఆలోచన ఉంటే గతంలోనే నేను ఎందుకు సయోధ్య కుదిర్చేవాడిని? చాలామందికి తెలియదు.. పీసీసీ అధ్యక్ష పదవి మంత్రి పదవి కంటే పెద్దది. ప్రభుత్వంలో సీఎం తర్వాత స్థానం పీసీసీ చీఫ్‌దే. నేను పీసీసీ అధ్యక్షుడిగా చాలా సౌకర్యవంతంగా ఉన్నాను. కొండా సురేఖను తీసేసి నాకివ్వమని అడిగే దీనస్థితిలో నేను లేను.
రేవంత్ రెడ్డి, మహేశ్ గౌడ్ కాంబినేషన్ లో పార్టీ మళ్లీ అధికారంలోకి వస్తుందా?
100శాతం వస్తుంది.. రాసిపెట్టుకోండి. మాకున్న క్షేత్రస్థాయి సమాచారం ప్రకారం వచ్చే ఎన్నికల్లో 100కు పైగా సీట్లు గెలుస్తాం. గాంధీ భవన్ నుంచి ఒక ఎస్ఎంఎస్ ఇస్తే క్షణాల్లో లక్షల మంది కార్యకర్తలకు చేరుతుంది. అదే మా బలం.
కార్యకర్తల్లో నిస్తేజం ఉంది.. నామినేటెడ్ పదవులు, పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ల నియామకాలు ఇంకా పెండింగ్‌లో ఎందుకున్నాయి?
ఇప్పటికే ఎన్నో కార్పొరేషన్లు, మార్కెట్, టెంపుల్ కమిటీలు ఇచ్చాం. కొంత ఆలస్యం జరిగిన మాట వాస్తవమే. ప్రభుత్వం ఉన్నప్పుడు వర్కింగ్ ప్రెసిడెంట్ వ్యవస్థ ఉండాలనే నిబంధన లేదు. మాకు 86 మంది జనరల్ సెక్రెటరీలు , 49 మంది వైస్ ప్రెసిడెంట్లు పనిచేస్తున్నారు.
సీఎం రేవంత్ రెడ్డి అమెరికా పర్యటనను కేంద్రం అడ్డుకుందనే వివాదంపై ఏమంటారు?
పూర్తి రాజకీయ కారణాలతోనే అడ్డుకున్నారు. తెలంగాణను ఎడ్యుకేషన్ హబ్‌గా మార్చేందుకు ప్రపంచ ప్రఖ్యాత యూనివర్సిటీలను తేవాలని సీఎం వెళ్తుంటే బీజేపీ ఓర్వలేకపోయింది. కేంద్రం ప్రోత్సహించాల్సింది పోయి అడ్డంకులు సృష్టించింది.
విదేశీ పర్యటనలపై ప్రతిపక్షాలు శ్వేతపత్రం అడుగుతున్నాయి.. పెట్టుబడులు కేవలం ఎంవోయూలకే పరిమితమవుతున్నాయా?
కేటీఆర్ మంత్రిగా ఉన్నప్పుడు తెచ్చిన పెట్టుబడులపై ముందు వాళ్లు శ్వేతపత్రం ఇవ్వాలి. మేం తెచ్చిన పెట్టుబడుల్లో 60- –70 శాతం గ్రౌండ్ అయినా వేల ఉద్యోగాలు వస్తాయి. పరిశ్రమల స్థాపనకు సమయం పడుతుంది.
కేంద్రం చేపట్టే కులగణనపై కాంగ్రెస్ ఎందుకు అభ్యంతరం చెబుతోంది?
కేంద్రం కులగణన పేరుతో మోసం చేస్తోంది. గణన ఫార్మాట్‌లో ఎస్సీ, ఎస్టీలతో పాటు బీసీ కాలమ్ ఎందుకు పెట్టలేదు? బీసీ కాలమ్ లేకపోతే జనాభా ఎలా లెక్కిస్తారు? తెలంగాణలో మేం చేసిన కుల సర్వే దేశానికే రోల్ మోడల్.
రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై ప్రజల్లో అసంతృప్తి పెరుగుతోందన్న ప్రచారంపై మీరేమంటారు?
సోషల్ మీడియాలో తప్ప క్షేత్రస్థాయిలో అసంతృప్తి లేదు. పల్లెల్లో ప్రజలు సంక్షేమ పథకాలతో సంతోషంగా ఉన్నారు. ప్రతిపక్షాలు ఫామ్‌హౌస్‌లో కూర్చొని సోషల్ మీడియా ప్రచారాలు చేసుకుంటున్నాయి. గత ప్రభుత్వం చేసిన రూ. 8.5 లక్షల కోట్ల అప్పుల వల్ల ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి. అయినా ఆరు గ్యారెంటీల్లో 60-–70శాతం అమలు చేశాం.. మిగిలినవి కూడా త్వరలోనే అమలు చేస్తాం.
22ఏ రిజిస్ట్రేషన్ల వివాదం ప్రభుత్వాన్ని ఇరుకున పెడుతోంది కదా?
ధరణి లోపాల వల్ల ప్రజలు ఇబ్బంది పడ్డారు. 22ఏ సమస్య రాగానే సీఎం వెంటనే స్పందించి ఆదేశాలు ఇచ్చారు. రెవెన్యూ మంత్రి కూడా క్షమాపణ చెప్పారు. తప్పులను సరిదిద్దుతున్నాం.
కాంగ్రెస్ లో నాయకత్వ సంక్షోభం ఉందా? వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ఎందుకు ఓటెయ్యాలి?
పార్టీలో ఎలాంటి నాయకత్వ సంక్షోభం లేదు. యంగ్ సీఎం, పటిష్టమైన పీసీసీ, సీనియర్ మంత్రుల మేధస్సు మా బలం. గతంలో ఇచ్చిన మాట ప్రకారం తెలంగాణ ఇచ్చాం, ఇప్పుడు ఎన్నికల హామీలను నిలబెట్టుకుంటున్నాం కాబట్టే ప్రజలు కాంగ్రెస్ కు ఓటేస్తారు.
మీరు బీసీ పీసీసీ అధ్యక్షుడిగా ఉండి, ఒక బీసీ మహిళా మంత్రిని ప్రభుత్వం నుంచి సాగనంపే కార్యక్రమానికి అంకురార్పణ చేశారనే ప్రచారంపై మీరేమంటారు?
కొండా సురేఖ వ్యవహారంలో ఆమె కూతురు మాట్లాడిన తీరుతెన్నులు ఆక్షేపణీయం. పీసీసీ అధ్యక్షుడిగా అది కరెక్ట్ కాదని చెబుతాను. ఆ వ్యవహారంలో ఎవరి పాత్ర ఎంత అనే దానిపై పీసీసీ క్రమశిక్షణా కమిటీ సమగ్ర నివేదికను ఉన్నదిఉన్నట్టుగా ఏఐసీసీకి సమర్పించింది.
అక్కడ మాట్లాడింది మంత్రి కూతురు కదా, మంత్రి తప్పేముంది?
మంత్రి కూతురు మాట్లాడితే మంత్రికి శిక్ష వేయాలా? వద్దా? అనేది ఏఐసీసీ నిర్ణయిస్తుంది. ఇదివరకు రెండుసార్లు జరిగితే వివరంగా క్రమశిక్షణా కమిటీ నివేదికను రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్‌కు పంపించాం. కొండా సురేఖ హై ప్రొఫైల్ ఉన్న సీనియర్ నాయకురాలు. వారిపై చర్యలు ఉంటాయా? ఉండవా? అనేది ఏఐసీసీ పరిధిలోని అంశం.
