ఈసారి కూడా కేటీఆర్ కు రాఖీ కట్టని కవిత

ఈసారి కూడా కేటీఆర్ కు రాఖీ కట్టని కవిత

హైదరాబాద్, వెలుగు: రాఖీ పండుగ వేళ మాజీ సీఎం కేసీఆర్ కుటుంబంలో అన్నాచెల్లెళ్ల మధ్య దూరం మరోసారి చర్చనీయాంశంగా మారింది. బీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు ఆయన సోదరి, తెలంగాణ రక్షణ సేన(టీఆర్ఎస్) చీఫ్ కల్వకుంట్ల కవిత ఈ ఏడాది కూడా రాఖీ కట్టలేకపోయారు. గత కొంతకాలంగా వీరిద్దరి మధ్య రాజకీయ, వ్యక్తిగత అంతరాలు పెరిగాయన్నది తెలిసిందే. గతేడాది రాఖీ సమయంలో కవిత తన అన్న కేటీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు స్వయంగా మెసేజ్ పెట్టినా.. ఆయన మాత్రం ఆ సమయంలో ముంబై పర్యటనకు వెళ్లిపోయారు. 

దీంతో అప్పట్లోనూ రాఖీ కట్టడం కుదరలేదు. ఈ ఏడాది రాఖీ పండుగ వేళ కేటీఆర్ ఏకంగా అమెరికా పర్యటనకు వెళ్లిపోయారు. పండుగ రోజుల్లో కూడా అన్న అందుబాటులో లేకపోవడంపై కవిత తీవ్ర నిరాశకు గురయ్యారు. వరుసగా రెండో ఏడాది కూడా రాఖీ పండుగకు ముఖం చాటేయడంపై కవిత ఓపెన్ గానే తన అన్నపై విమర్శలు గుప్పించారు. " పోయినసారి మెసేజ్ పెట్టినా పట్టించుకోకుండా ముంబై వెళ్లారు. ఈసారి ఏకంగా అమెరికాకు పారిపోయారు. ఒక ఆడబిడ్డగా నాకూ ఆత్మగౌరవం ఉంటుంది. ప్రతీసారీ మనమే తగ్గి ఉండాలా?" అని కామెంట్ చేశారు.