సెప్టెంబర్ 1 తేదీ సమీపిస్తుండటంతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఒరాకిల్ టెక్కీల్లో లేఆఫ్ భయం పెరుగుతోంది. గత మార్చి 31న ఒరాకిల్ సంస్థ వేలాది మంది ఉద్యోగులను ఊహించని రీతిలో తొలగించిన సంగతి తెలిసిందే. సరిగ్గా అదే తరహాలో ఇప్పుడు కూడా సెప్టెంబర్ 1 తెల్లవారుజామున లేఆఫ్స్ మెయిల్స్ వస్తాయేమోనని టెక్కీలు నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు. ఉదయం 6 గంటలకే ఎలాంటి ముందస్తు హెచ్చరిక లేకుండా అకస్మాత్తుగా అందిన టెర్మినేషన్ నోటీసుల సీన్ మళ్లీ గుర్తుచేసుకుంటున్నారు.
మార్చి నాటి లేఆఫ్స్‌లో ఒరాకిల్ 30వేల మంది ఉద్యోగాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. "ఒరాకిల్ లీడర్‌షిప్" పేరుతో వచ్చిన ఆ ఈమెయిళ్లలో సంస్థ వ్యాపార అవసరాలు, బ్రాడర్ ఆర్గనైజేషనల్ చేంజ్ పేరుతో ఉద్యోగాలను తొలగిస్తున్నట్లు తెలిపారు. ఈరోజే మీ చివరి పనిదినం అంటూ వచ్చిన మెయిల్ టెక్కీలను నివ్వెరపోయేలా చేసింది. మెయిల్ అందిన కొద్ది నిమిషాలకే కంపెనీ సిస్టమ్స్ నుంచి యాక్సెస్ తొలగించడం, హెచ్ఆర్, మేనేజర్‌ల నుంచి కనీస సమాచారం లేకపోవడం సిలికాన్ వ్యాలీలో తీవ్ర ఆందోళన కలిగించింది.
కీలక డిపార్ట్మెంట్లలో ఇంజనీర్లు, మేనేజర్లు సైతం ఈ వేటుకు బలయ్యారు. టెర్మినేషన్ పేపర్‌వర్క్‌ను డోక్యుసైన్ ద్వారా పంపిస్తామని, పర్సనల్ ఈమెయిల్ ఐడీలను ఇవ్వాలని ఆ నోటీసులో పేర్కొన్నారు. సెవర్ ప్యాకేజీ రూల్స్ కి లోబడి ఉంటుందని తెలిపినప్పటికీ, క్షణాల వ్యవధిలో జీవితాలు తలకిందులైన వైనం ఉద్యోగులను తీవ్రమైన మానసిక వేదనకు గురిచేసింది.
మరోసారి సెప్టెంబర్ 1న భారీ లేఆఫ్స్ రౌండ్ ఉంటుందన్న వార్తలు టెక్కీల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్నాయి. ఏఐ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, డేటా సెంటర్ల విస్తరణ కోసం ఒరాకిల్ భారీగా పెట్టుబడులు పెడుతుండటమే దీనికి కారణమని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ పెట్టుబడుల భారాన్ని తగ్గించుకోవడానికి, అదనపు నగదు ప్రవాహాన్ని సృష్టించడానికి మరో 20వేల నుంచి 30వేల ఉద్యోగాలను తొలగించే అవకాశం ఉందని టీడీ కోవెన్ అంచనా వేసింది.
కంపెనీ క్లౌడ్, ఏఐ వ్యాపారాలు బలమైన వృద్ధిని కనబరుస్తున్నప్పటికీ.. ఆర్థిక సర్దుబాట్ల పేరుతో ఉద్యోగుల లేఆఫ్స్ కొనసాగుతుండటం గమనార్హం. గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని, సెప్టెంబర్ 1 తెల్లవారుజామున తమ మెయిల్ బాక్స్‌లలో ఎలాంటి పిడుగులాంటి వార్త ఉంటుందోనని ఒరాకిల్ ఉద్యోగులు బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీస్తున్నారు.
