జీ గ్రూప్ అధినేత సుభాష్ చంద్ర చేసిన సంచలన ప్రకటన దేశీయ కార్పొరేట్ వర్గాల్లో ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. తనపై, తన కుటుంబంపై, ఎస్సెల్ గ్రూప్ ఆర్థిక పరిస్థితిపై వస్తున్న ఆరోపణలు, ఊహాగానాలపై శుక్రవారం బహిరంగంగా స్పందించారు. గ్రూప్ రుణాలకు సంబంధించి తప్పుడు ప్రచారం జరుగుతోందని మండిపడిన ఆయన.. పూర్తి వాస్తవాలు వెలుగులోకి తెచ్చేందుకు ఒక ఇండిపెండెంట్ ఆడిట్‌కు తాను సిద్ధమని.. ఇందుకోసం బ్యాంకింగ్ వ్యవస్థకు, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు ఏర్పాటు చేయాలని కోరారు. గ్రూప్ ప్రారంభించినప్పటి అప్పులు, చెల్లింపులపై సమగ్ర విచారణ జరగాలని డిమాండ్ చేశారు.
తన కార్పొరేట్ ప్రయాణంలో తప్పు జరిగిందని నిజాయితీగా అంగీకరించిన సుభాష్ చంద్ర.. 2019 జనవరి నుంచి ఆస్తులు-అప్పుల వ్యత్యాసం వల్లనే సమస్యలు మొదలయ్యాయని స్పష్టం చేశారు. గ్రూప్ మొత్తం రూ.45వేల కోట్ల అప్పుల్లో ఇప్పటివరకు సుమారు రూ.43వేల కోట్లను తిరిగి చెల్లించినట్లు వెల్లడించారు. బాధ్యతలను నెరవేర్చడానికి సొంత ఇల్లు కూడా తాకట్టు పెట్టడంతో పాటు కుటుంబ, వ్యక్తిగత ఆస్తులన్నింటినీ అమ్మేశానని, చివరికి జీ సంస్థను కూడా అమ్మకానికి పెట్టామని గుర్తుచేశారు. మిగిలిన రూ.2వేల కోట్ల రుణాల చెల్లింపులు వివిధ కారణాల వల్ల నిలిచిపోయాయని, మౌలిక వసతుల రంగంలో ప్రభుత్వాల నుంచి రావాల్సిన బకాయిలు రావలసి ఉందని చెప్పారు.
నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్(NCLT) ఎదుట జరుగుతున్న పరిణామాలపై వస్తున్న ఆరోపణలను తీవ్రంగా ఖండించారు సుభాష్ చంద్ర. ఎన్‌సీఎల్‌టీలో నడుస్తున్న కేసులు వ్యక్తిగత అప్పులకు సంబంధించినవి కాదని, కొన్ని రుణాలకు తాను ఇచ్చిన వ్యక్తిగత గ్యారెంటీలని స్పష్టం చేశారు. కొందరు రుణదాతలకు ఇప్పటికే చెల్లింపులు చేసినప్పటికీ ట్రిబ్యునల్‌లో క్లెయిమ్‌లు దాఖలు చేశారని ఆరోపించారు.
ఈ మొత్తం పరిణామాల నేపథ్యంలో ఎస్సెల్ గ్రూప్ రుణాల పునరుద్ధరణ, చెల్లింపులపై పారదర్శకత కోసం ఒక ఇండిపెండెంట్ ఆడిట్ నిర్వహించాలని సుభాష్ చంద్ర పట్టుబట్టడం కార్పొరేట్ వర్గాల్లో హాట్ టాపిక్ అయింది. బ్యాంకులు, ప్రభుత్వ పెద్దలు ఈ ఓపెన్ ఛాలెంజ్‌ను ఎలా స్వీకరిస్తారనేది ఇప్పుడు సర్వత్రా ఆసక్తి రేకెత్తిస్తోంది.
