కేబినెట్ రీషఫిల్‎‎కు కౌంట్డౌన్.. నలుగురికి పదవీ గండం.. పలువురికి శాఖల మార్పు..!

కేబినెట్ రీషఫిల్‎‎కు కౌంట్డౌన్.. నలుగురికి పదవీ గండం.. పలువురికి శాఖల మార్పు..!
  • 3న ఢిల్లీకి సీఎం, డిప్యూటీ సీఎం, పీసీసీ చీఫ్
  • హస్తినకు రాష్ట్ర ఇన్​చార్జి మీనాక్షి, మంత్రి ఉత్తమ్ కూడా 
  • తొలుత కేసీతో చర్చలు.. ఆపై హైకమాండ్ వద్దకు.. 
  • అసెంబ్లీ సమావేశాలలోపే విస్తరణపై ఊహాగానాలు
  • నలుగురికి పదవీ గండం.. పలువురికి శాఖల మార్పు!
  • మంత్రివర్గంలోకి పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్?
  • ఖాళీగా ఉన్న మరో రెండు మంత్రి పదవుల భర్తీ

హైదరాబాద్, వెలుగు: వచ్చే నెల 3 తర్వాత ఏ క్షణమైనా రాష్ట్ర మంత్రివర్గ ప్రక్షాళన చేపట్టే అవకాశం కనిపిస్తున్నది. ఈ మేరకు అటు పీసీసీ, ఇటు సీఎం వర్గాల నుంచి స్పష్టమైన సంకేతాలు వెలువడుతున్నాయి. రాష్ట్రంలో కాంగ్రెస్​ అధికారంలోకి వచ్చి రెండున్నరేండ్లు పూర్తికావడం, ఇటీవలి పరిణామాల నేపథ్యంలో మంత్రివర్గంలో మార్పులు చేర్పులకు సీఎం నుంచి వెళ్లిన ప్రతిపాదనకు హైకమాండ్ ​గ్రీన్​సిగ్నల్​ఇచ్చినట్టు  తెలుస్తున్నది. 

ఏఐసీసీ జాతీయ ప్రధాన కార్యదర్శి కేసీ వేణు గోపాల్ ప్రస్తుతం విదేశీ పర్యటనలో ఉన్నారు. వచ్చే నెల 2న  ఆయన ఢిల్లీకి తిరిగి రాగానే  3 న సీఎం, డిప్యూటీ సీఎం, పీసీసీ చీఫ్, మీనాక్షి, ఉత్తమ్ సమావేశం కానున్నారు. ఈ పర్యటన షెడ్యూల్​ఇప్పటికే ఖరారైంది. కేసీ వేణుగోపాల్‌తో చర్చల అనంతరం అధిష్టానంతో లిస్టుకు ఆమోదముద్ర పడ్తుందని, ఆ తర్వాత ఏ రోజైనా మంత్రివర్గ ప్రక్షాళన ఉంటుందని విశ్వసనీయ వర్గాల సమాచారం.

వచ్చే నెల 7 నుంచి అసెంబ్లీ సమావేశాలు ఉండడంతో ఈలోపే మంత్రివర్గ విస్తరణ చేయాలనే పట్టుదలతో సీఎం రేవంత్ రెడ్డి ఉన్నట్టు తెలిసింది. పునర్వ్యవస్థీకరణలో స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌‌కు బెర్త్ ఖాయమని పార్టీ వర్గాలు చెప్తున్నాయి. ఆయన స్థానంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన ఓ మంత్రిని  స్పీకర్‌‌గా నియమించాలని హైకమాండ్ భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే సదరు మంత్రిని రేవంత్​రెడ్డి పిలిపించుకొని అధిష్టానం నిర్ణయాన్ని చెప్పినట్టు సమాచారం. 

మంత్రి కొండా సురేఖపై క్రమశిక్షణ చర్యల అంశం ప్రస్తుతం ఏఐసీసీ పరిశీలనలో ఉంది. ఆమెపై వేటు వేయాలని హైకమాండ్​ భావిస్తే ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో బీసీ సామాజిక వర్గానికే చెందిన  ఓ ఎమ్మెల్యేకు అవకాశం రానున్నట్టు గాంధీభవన్​వర్గాల టాక్. మరోవైపు పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్‌ను కూడా ఈసారి కేబినెట్‌లోకి తీసుకుంటారనే ప్రచారం జోరుగా సాగుతోంది. ప్రస్తుతం మంత్రివర్గంలో నిజామాబాద్ జిల్లాకు ప్రాతినిధ్యం లేదు.  మహేశ్ గౌడ్‌ను తీసుకుంటే ఆ లోటును పూడ్చుకోవచ్చని  హైకమాండ్ భావిస్తున్నట్టు తెలిసింది. 

ఒకవేళ ఇదే జరిగితే బీసీ సామాజికవర్గానికే చెందిన ఓ మంత్రిని తప్పించి పీసీసీ చీఫ్‌గా నియమిస్తారని అంటున్నారు. మరోవైపు నిజామాబాద్​జిల్లాకే చెందిన  సీనియర్​ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి కోసం సీఎం రేవంత్ రెడ్డి ఈసారి కూడా సిఫార్సు చేస్తున్నట్టు తెలిసింది. ఇక కేబినెట్‌ ప్రాతినిధ్యంలేని రంగారెడ్డి జిల్లా నుంచి మల్‌రెడ్డి రంగారెడ్డి ఆశలు పెట్టుకున్నారు. అటు నల్గొండ జిల్లా నుంచి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కూడా మంత్రి పదవి ఆశిస్తున్నారు.  ఒకే సామాజిక వర్గం కావడంతో వీరిద్దరిలో ఎవరో ఒకరికి చాన్స్​ ఉంటుందని భావిస్తున్నారు.  

సీనియర్ మంత్రుల శాఖల్లోనూ మార్పులు

ఈసారి నలుగురు మంత్రులను తప్పించి, ఆయా స్థానాల్లో మరో నలుగురికి అవకాశం ఇవ్వనున్నట్టు టాక్‌ నడుస్తున్నది. మరోవైపు  మెజారిటీ మంత్రుల శాఖలను మార్చాలనే పట్టుదలతో సీఎం రేవంత్ రెడ్డి ఉన్నట్టు తెలుస్తున్నది.  పార్టీలో, ప్రభుత్వంలో నెంబర్ 2, ఆ తర్వాతి స్థానాల్లో ఉన్న సీనియర్ మంత్రుల శాఖల్లోనూ  మార్పులు చేర్పులు ఖాయమనే ప్రచారం సాగుతున్నది. 

ప్రస్తుతం కీలకమైన హోంశాఖ, విద్యాశాఖ, మున్సిపల్​ శాఖలు సీఎం వద్దే ఉన్నాయి. విద్యకు సీఎం ఇస్తున్న ప్రాధాన్యతను బట్టి ఆ శాఖను ఎవరికి ఇచ్చే పరిస్థితి లేదని చెప్తున్నారు. ఇక మిగిలిన హోంశాఖ, మున్సిపల్ ​శాఖను ఎప్పట్లాగే ఆయన వద్ద ఉంచుకుంటారా? ఇతరులకు కేటాయిస్తారా? అన్నది ఆసక్తికరంగా మారింది.