ఒక్కసారి పర్మిషన్.. పదేండ్లు బిందాస్‌‌‌‌‌‌‌‌...! ప్రైవేటు స్కూళ్ల అనుమతులపై విద్యాశాఖ ఉదాసీనత..

ఒక్కసారి పర్మిషన్.. పదేండ్లు బిందాస్‌‌‌‌‌‌‌‌...! ప్రైవేటు స్కూళ్ల అనుమతులపై విద్యాశాఖ ఉదాసీనత..
  • ఇంటర్, డిగ్రీ, పీజీ, ఇంజినీరింగ్ ఇతర అన్ని కాలేజీలకు ఏటా అఫిలియేషన్  
  • స్కూళ్లకు మాత్రం18 ఏండ్ల కిందటి నిబంధనలు అమలు 
  • రెన్యువల్ ఫీజు అప్పర్ ప్రైమరీ దాకా రూ.2,500, హైస్కూళ్లకు రూ. 5 వేలే 
  • 10 నుంచి 20 రెట్లు పెరిగిన స్కూల్ ఫీజులు 

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో ప్రైవేటు, కార్పొరేట్ స్కూళ్ల అనుమతులు, రెన్యువల్ ప్రక్రియ గాడితప్పింది. ఇంటర్, డిగ్రీ, ఇంజినీరింగ్ సహా అన్ని కాలేజీలకు ఏటా అఫిలియేషన్లు తప్పనిసరి చేసిన విద్యాశాఖ.. ప్రైవేటు స్కూళ్లకు మాత్రం పదేండ్ల కాలపరిమితి పెట్టింది. దీంతో, ఒకసారి పర్మిషన్ తీసుకుంటే పదేండ్లు బిందాస్‌‌ అన్న రకంగా పరిస్థితి మారిపోయింది. పెద్ద పిల్లలు చదివే కాలేజీలకు లేని ఈ ప్రత్యేక మినహాయింపు.. చిన్న పిల్లలు చదివే ప్రైవేటు స్కూళ్ల విషయంలో కొనసాగుతుండటంపై అనేక విమర్శలు వినిపిస్తున్నాయి. 

రాష్ట్రంలో అధికారిక లెక్కల ప్రకారమే 13వేలకు పైగా ప్రైవేటు స్కూళ్లు ఉండగా.. వాటిలో ఏకంగా 36 లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారు. వీటిలో కేవలం లక్షన్నర మంది టీచర్లు మాత్రమే పనిచేస్తున్నారు. ఇందులోనూ చాలా వరకు బోగస్‌‌‌‌‌‌‌‌ లెక్కలేనని, మేనేజ్‌‌‌‌‌‌‌‌మెంట్లు తమ కుటుంబ సభ్యుల పేర్లను కూడా టీచర్లుగా చూపించి మభ్యపెడ్తున్నారనే ఆరోపణలున్నాయి. పలు చోట్ల ప్రైవేటు స్కూళ్లు చిన్న అద్దె భవనాల్లో, చివరికి రేకుల షెడ్లలోనూ ఎలాంటి వసతులు లేకుండానే కొనసాగుతున్నాయి. 

విద్యార్థులకు సరిపడా క్లాస్ రూములు, టాయిలెట్లు, కనీసం గాలి, -వెలుతురు ఉండవు. లైబ్రరీలు, సైన్స్ ల్యాబులు ఉండవు. రూల్స్ ప్రకారం స్టూడెంట్, టీచర్ రేషియో ఉండాలి కానీ, పర్మిషన్లు తీసుకునే టైమ్‌‌‌‌‌‌‌‌లో అందరూ ఉన్నట్లు రికార్డులు చూపించి, ఆ తర్వాత అర్హులను తీసేస్తున్నారు. చాలా స్కూళ్లు ఇంటర్, డిగ్రీ చదివిన వారితోనే క్లాసులు చెప్పిస్తూ రూ.10 వేల నుంచి రూ.20 వేలలోపే జీతాలిస్తున్నాయి. 

అనుమతులు ఇలా..

కొత్తగా స్కూల్ ఓపెన్ చేయాలంటే ప్రైమరీ, అప్పర్ ప్రైమరీ వరకు రూ.10 వేలు, హైస్కూల్‌‌‌‌‌‌‌‌కు రూ.20 వేలు ఫీజు కట్టాలి. ఇక రెన్యువల్ గుర్తింపు కోసం ప్రైమరీ, అప్పర్ ప్రైమరీకి కేవలం రూ.2,500, హైస్కూల్‌‌‌‌‌‌‌‌కు రూ.5 వేలు మాత్రమే వసూలు చేస్తున్నారు. విచిత్రమేమిటంటే.. ఏకంగా 18 ఏండ్ల కింద అంటే 2008లో నిర్ణయించిన ఈ ఫీజుల రేట్లను ఇప్పటివరకు అసలు మార్చనేలేదు. కానీ, ఆయా స్కూళ్లలో స్టూడెంట్ల నుంచి వసూలు చేసే ఫీజులు మాత్రం ఏకంగా10 నుంచి 20 రెట్లు పెరిగాయి. అప్పట్లో రూ.5 వేలు వసూలు చేస్తే.. ఇప్పుడు కనీసం రూ.50 వేల దాకా తీసుకుంటున్నారు. 

ఏటా కనీసం పది శాతం ఫీజులు పెంచే స్కూళ్లు.. ప్రభుత్వానికి కట్టే రెన్యువల్ ఫీజులు మాత్రం పెంచొద్దంటూ వితండవాదనలు చేస్తున్నాయి. ఈ విషయంలో విద్యాశాఖ ఆఫీసర్లూ ఉదాసీనంగా ఉండడం విమర్శలకు తావిస్తోంది. కొత్త హైస్కూల్‌‌‌‌‌‌‌‌కు ప్రభుత్వమే అనుమతి ఇస్తుండగా, ప్రైమరీ, అప్పర్ ప్రైమరీ స్కూళ్లకు డీఈఓలు పర్మిషన్ ఇస్తారు. రెన్యువల్ మాత్రం.. అప్పర్ ప్రైమరీ వరకు డీఈఓలు, హైస్కూల్‌‌‌‌‌‌‌‌కు ఆర్జేడీ పర్మిషన్ ఇస్తారు. మేనేజ్‌‌‌‌‌‌‌‌మెంట్లు అన్ని డాక్యుమెంట్లు సమర్పించి అనుమతులు పొందినా.. ఆ తర్వాత వసతులు, క్వాలిఫైడ్ ఫ్యాకల్టీ ఉన్నారా? లేదా? అనేది అధికారులు పట్టించుకోవడం లేదనే విమర్శలున్నాయి.

ఫైర్ నిబంధనల్లోనూ జిమ్మిక్కులు..

నిబంధనల అమలులో అధికారుల తీరు విచిత్రంగా ఉంది. 2009 కంటే ముందు ఏర్పాటైన స్కూళ్లకు ఫైర్ ఎన్ఓసీలు అవసరం లేదని, ఆ తర్వాత ఏర్పాటు చేసిన స్కూళ్లకే ఫైర్ ఎన్ఓసీ ఉండాలనే రూల్ పెట్టారు. ఈ ఫైర్ ఎన్ఓసీలకు ఏడాది మాత్రమే వ్యాలిడిటీ ఉన్నప్పటికీ, స్కూళ్లకు మాత్రం ఏకంగా ఐదేండ్ల వరకూ ఇస్తున్నారనే ఆరోపణలున్నాయి. రెన్యువల్ టైమ్‌‌‌‌‌‌‌‌లో అధికారులకు ముడుపులు ముట్టజెప్పి తనిఖీలన్నీ మమ  అనిపించుకుంటుండటంతో, ప్రైవేటు కార్పొరేట్ స్కూళ్ల దందా రాష్ట్రంలో మూడు పువ్వులు, ఆరు కాయలుగా కొనసాగుతోంది. 

అయితే, ప్రైవేటు మేనేజ్‌‌‌‌‌‌‌‌మెంట్లు ఏటా ఫైనాన్స్ ఆడిట్ రిపోర్టును సీఏతో సర్టిఫై చేయించి ఎంఈఓల ద్వారా డీఈఓ ఆఫీసులకు సమర్పించాల్సి ఉంటుంది. కానీ, ఏ స్కూల్ కూడా ఇచ్చిన దాఖలాలు లేవు. ఈ ఏడాది తప్పనిసరిగా ఇవ్వాలని స్కూల్ ఎడ్యుకేషన్ ఆఫీసర్లు ఆదేశాలు ఇచ్చి నెల రోజులైనా ఇప్పటికీ కేవలం 443 స్కూళ్లు మాత్రమే ఇవ్వడం గమనార్హం. 

మరోపక్క, ఫైర్ ఎన్ఓసీ, ట్రాఫిక్ ఎన్ఓసీ, మున్సిపల్/ గ్రామపంచాయతీ ఎన్ఓసీ తప్పనిసరిగా ఇవ్వాల్సి ఉంటుంది. శానిటరీ సర్టిఫికెట్లు, బిల్డింగ్ స్ట్రక్చరల్ సౌండ్ సర్టిఫికెట్లు, ప్లేగ్రౌండ్ వివరాలు, సేల్ డీడ్/ లీజ్ డీడ్ వివరాలు ఇవ్వాల్సి ఉంటుంది. ఇవేవీ సరిగా లేకపోయినా.. ఆఫీసర్లకు ముడుపులు ఇస్తే, అన్నీ ఉన్నట్టు అనుమతులు ఇస్తున్నట్టు ఆరోపణలు ఉన్నాయి.

కాలేజీల్లో మాత్రం ఏటా తనిఖీలు..

ఇంటర్, డిగ్రీ, పీజీ, ఇంజినీరింగ్, ఫార్మసీ, ఎంబీఏ, ఎంసీఏ, బీఈడీ, డీఈడీ, ఎల్ఎల్‌‌బీ.. ఇలా అన్ని కోర్సులు నడిచే కాలేజీల్లో మాత్రం ఏటా ఆఫీసర్లు తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఆ తర్వాతే అఫిలియేషన్ ఇస్తుంటారు. ప్రతి ఏటా ఆయా కాలేజీలు స్కూళ్ల మాదిరిగానే అన్ని ఎన్ఓసీలు, అఫిలియేషన్ కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. జూనియర్ కాలేజీలైతే రెన్యువల్ కోసం బోర్డుకు ఏటా రూ.50 వేల నుంచి రూ.లక్షన్నర దాకా చెల్లిస్తాయి. 

సెక్షన్లు పెరిగితే.. ఆఫీజు పెరుగుతుంది. డిగ్రీ, పీజీ కోర్సుల్లో ఏటా అఫిలియేషన్ ఫీజు రూ.50 వేల వరకూ ఉంటుండగా, ఇంజినీరింగ్, ఇతర ప్రొఫెషనల్ కాలేజీల్లో రూ.50 వేల నుంచి రూ.లక్షన్నర దాకా ఉంటుంది. సెక్షన్లు, స్టూడెంట్ల సంఖ్యను బట్టి ఫీజులు మరింత పెరుగుతాయి. వీటిలో సర్కారే ఫీజులను డిసైడ్ చేస్తుంది. కానీ, ప్రైవేటు స్కూళ్లలో మేనేజ్మెంట్లు ఇష్టానుసారంగా ఫీజులు వసూలు చేసుకుంటుండగా.. రెన్యువల్ ఫీజు కేవలం రూ.2,500 నుంచి రూ.5 వేలు మాత్రమే ఉండటం గమనార్హం. 

చిన్న పిల్లలు చదివే స్కూళ్ల విషయంలో మాత్రం అధికారులు నిర్లక్ష్యంగా ఉండటంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఇప్పటికైనా ప్రభుత్వం పాత  జీవోలను సవరించి, కొత్త జీవోల ప్రకారం నిబంధనలు రూపొందించాలని పేరెంట్స్, స్టూడెంట్ యూనియన్లు కోరుతున్నాయి.